Oct 19 2021 @ 16:38PM

‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ చిత్ర ఫస్ట్‌లుక్‌ వదిలిన శేఖర్ కమ్ముల

‘‘కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌’’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటిస్తున్న చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం తేజస్వి క్రియేటివ్‌ వర్క్స్‌ పతాకంపై సందీప్‌ గోపిశెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను ఇటీవల ‘లవ్‌స్టోరి’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని అందుకున్న ప్రముఖ దర్శకుడు శేఖర్‌కమ్ముల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ ఇంప్రెసివ్‌గా ఉంది. చిత్రం కూడా ప్రేక్షకులను అలరించేలా ఉంటుందని అనుకుంటున్నాను. ఈ చిత్ర విజయం సాధించి అందరికీ మంచి పేరును తీసుకరావాలని ఆశిస్తున్నాను’’ అన్నారు.

దర్శకనిర్మాత సందీప్‌ గోపిశెట్టి మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు శేఖర్‌ కమ్ములగారు మా చిత్ర ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడం ఎంతో ఆనందంగా వుంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్‌ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఆడియన్స్‌ సర్‌ఫ్రైజ్‌గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుందనే నమ్మకంతో ఉన్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.