Abn logo
Nov 25 2021 @ 11:34AM

Jr NTRపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: నందమూరి హీరో జూనియర్ ఎన్టీయార్‌పై టీడీపీ నేత వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కుటుంబానికి వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ విజయవాడలో వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయపడ్డారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీయార్ విఫలమయ్యారని విమర్శించారు. మేనత్తను నోటికొచ్చినట్లు అంటే మేనల్లుడిగా ఆయన సరిగ్గా స్పందించలేదని రాష్ట్రం మొత్తం అనుకుంటోందని వర్ల రామయ్య తెలిపారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య నిలదీశారు. 


వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీయార్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదని వర్ల అన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీయార్ అంటే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకే ఉందని చెప్పారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నవాళ్లే టీడీపీ సభ్యులని వర్ల స్పష్టం చేశారు. జూనియర్ ఎన్టీయార్‌పై తాను చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.