Abn logo
Sep 22 2021 @ 01:00AM

రావణబ్రహ్మ వాహనంపై గణనాథుడు

రావణబ్రహ్మ వాహనంపై స్వామివారు - ప్రాకారోత్సవంలో పాల్గొన్న ఆలయ ఈవో వెంకటేశు, ఉభయదారులు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 21: కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం రావణబ్రహ్మ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి పుణ్యసముద్రం, లక్ష్మాంబపురం, సంతపల్లె, ద్వారకాపురం, కురప్పల్లె, సిద్ధంపల్లె, ముద్దురామాపురం గ్రామస్తులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం ఉభయదారుల ఆధ్వర్యంలో స్వామికి అభిషేకం చేసి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకు రావడంతో ఆలయ అలంకార మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు పూజలు చేశారు. అనంతరం సిద్ధి, బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవ విగ్రహాలను రావణబ్రహ్మ వాహనంపై ఉంచి, ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వెంకటేశు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్లు కోదండపాణి, శ్రీధర్‌బాబు, ఆలయ ఇన్‌స్పెక్టర్లు కిషోర్‌కుమార్‌రెడ్డి, రమేష్‌ పాల్గొన్నారు.


ప్రత్యేక ఉత్సవాల్లో నేడు

ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామికి యాళి వాహన సేవ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అగరంపల్లెకు చెందిన ఎ.నరసింహారెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, చినకాంపల్లెకు చెందిన పి.సుబ్బారెడ్డి కుమారులు ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.