Abn logo
May 20 2020 @ 18:38PM

హాంకాంగ్‌లో కష్టాలు.. భారత్‌కు చేరుకున్న కొందరు ప్రవాసులు!

హాంకాంగ్: భారతదేశంలో వలస కార్మికులు ఏ విధంగా కష్టపడుతున్నారో.. పొట్టకూటి కోసం విదేశాలు వెళ్లిన భారతీయులు కూడా ఆయా దేశాల్లో అదే విధంగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా హాంకాంగ్‌లో నివసిస్తున్న అనేక మంది భారతీయులు డబ్బులు లేక అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నారు. హాంకాంగ్‌కు కాంట్రాక్ట్ ప్రాజెక్ట్‌పై వచ్చిన అజయ్ అనే వ్యక్తి ఉద్యోగం కోల్పోయి హాంకాంగ్‌లో ఇల్లు కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. హర్ష అనే మరో వ్యక్తి మార్చి నెల నుంచి భారతదేశానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా ఎటువంటి లాభం లేకపోయింది. ఉద్యోగం కూడా లేకపోవడంతో స్నేహితుడి గదిలో ఉంటూ ఉన్న డబ్బుతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. తన దగ్గర ఉన్న డబ్బులు మరో రెండు వారాలు మాత్రమే వస్తాయని.. ఆ తరువాత పరిస్థితి అర్థం కావడం లేదంటూ హర్ష ఆవేదన వెల్లగక్కాడు. అజయ్, హర్ష మాదిరిగా అనేక మంది భారతీయులు హాంకాంగ్‌లో ఇబ్బందులు పడుతున్నారు. పొట్టకూటి కోసం హాంకాంగ్‌ వచ్చి కనీసం ఇంటి అద్దెలు కట్టలేక తిరిగి స్వదేశానికి కూడా పోలేక నరకం అనుభవిస్తున్నారు. భార్య, పిల్లలతో ఉన్న వారి కష్టం మాటల్లో చెప్పలేని విధంగా ఉంది. తాము స్వదేశానికి వెళ్లేందుకు కేంద్రం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని వీరంతా కేంద్రాన్ని వేడుకొంటున్నారు.


ఇదిలా ఉండగా.. భారత్‌లో చిక్కుకున్న హాంకాంగ్ రీజియన్‌కు చెందిన వారిని కేంద్రం ప్రత్యేక విమానంలో మే 17న హాంకాంగ్‌కు పంపింది. ఇదే విమానంలో ప్రవాసులను స్వదేశానికి పంపాలని హాంకాంగ్‌లోని భారతీయ సంఘాలు అభ్యర్థించాయి. వారి అభ్యర్థనతో ప్రవాసులను భారత్‌కు తీసుకెళ్లేందుకు ఎయిర్ ఇండియా అంగీకరించింది. ఇదే విమానంలో కొందరు ప్రవాసులు హాంకాంగ్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ప్రవాసులను భారత్‌కు తీసుకెళ్లడంపై హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి హర్షం వ్యక్తం చేశారు. హాంకాంగ్‌లో ఇబ్బందులు పడుతున్న ప్రవాసులు చాలా మంది ఉన్నారని.. వారి గురించి కూడా ఆలోచించి కేంద్రం సరైన నిర్ణయం తీసుకోవాలని జయ పీసపాటి కోరారు. అదే విధంగా భారత ప్రభుత్వం వివిధ దేశాలతో చర్చించి భారతీయులకు వీసా ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలన్నారు. 


మరోపక్క హాంకాంగ్ నుంచి భారత్‌కు వెళ్లి చిక్కుకుపోయిన ప్రవాసులు కూడా చాలా మంది ఉన్నారు. రెసిడెన్సీ వీసాపై హాంకాంగ్‌లో ఉన్నవారు భారత్‌కు వెళ్లి ఇరుక్కుపోయారు. వీరంతా తమ వీసా గడువు తీరితే.. రెసిడెన్సీ స్టేటస్ నిలుపుకోవడం కోసం వీసా గడువు తీరిన నాటి నుంచి 120 రోజుల్లోపు హాంకాంగ్ రావాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రకటన రాకపోవడంతో వీరి పరిస్థితి అయోమయంగా ఉంది. అంతేకాకుండా పిల్లలకు దూరంగా ఉండాల్సి వస్తోందని చాలా మంది ప్రవాసులు ఆవేదన చెందుతున్నారు. కాగా.. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వంద కుటుంబాలు భారత్‌లో చిక్కుకున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మూడు వేల మంది వరకు భారత్‌లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. 


ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి

Advertisement
Advertisement
Advertisement