Abn logo
Sep 25 2021 @ 01:20AM

పాడేరులో కదం తొక్కిన వాల్మీకులు!

ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నాలో పాల్గొన్న గిరిజనులు

మహాధర్నా భగ్నానికి పోలీసుల యత్నం 

మండలాల్లో గిరిజన సంఘాల నేతల అరెస్టు 

నిర్బంధాన్ని లెక్కచేయకుండా తరలివచ్చిన గిరిజనులు 

పాడేరు, సెప్టెంబరు 24: ప్రభుత్వ వెబ్‌సైట్‌ల్లో ఎస్‌టీ వాల్మీకి తెగ పేరును తొలగించిన వారిపై అట్రాసిటీ కేసు పెట్టి శిక్షించాలనే డిమాండ్‌పై గిరిజన సంఘం, ఇతర సంఘాలు తలపెట్టిన మహాధర్నాకు వాల్మీకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఏజెన్సీ వ్యాప్తంగా 400 వాహనాల్లో అధిక సంఖ్యలో వాల్మీకులు, వారికి మద్దతుగా ఉన్న ఇతర గిరిజనులు మహాధర్నాకు తరలించేందుకు ఏర్పాట్లు చేయగా, అన్ని మండలాల్లోని ముఖ్యనేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేసి, వారిని నిర్బంధించారు. అయినప్పటికీ పోలీసుల నిర్బంధాన్ని సైతం లెక్కచేయకుండా గిరిజనులు పాడేరు తరలివచ్చి పట్టణ వీధుల్లో భారీ స్థాయిలో నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఐటీడీఏ ముందు మహాధర్నా నిర్వహించారు. అయితే పోలీసులు ఊహించిన దాని కన్నా ఎక్కువగానే గిరిజనులు మహాధర్నాలో పాల్గొన్నారు.

ఆదివాసీలకు అన్యాయం చేస్తే ఊరుకోం: గిరిజన సంఘాలు

పాలకులు ఆదివాసీలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని గిరిజన సంఘాల నేతలు హెచ్చరించారు. ఎస్‌టీ వాల్మీకి తెగకు జరిగిన అన్యాయంపై శాంతియుతంగా ధర్నాకు తరలివచ్చే నేతలను పోలీసులు అరెస్టులు చేయడం దారుణమన్నారు. అలాగే మహా ధర్నాకు వచ్చే వాహనాలు, గిరిజనుల్ని ఎక్కడిక్కడ పోలీసులు నిలుపుదల చేయడం ఘోరమన్నారు. పోలీసు బలగాలను అడ్డుపెట్టుకుని తమ ఉద్యమాన్ని భగ్నం చేయలేరని వాల్మీకి తెగ నేతలు అన్నారు. ప్రభుత్వ వెబ్‌సైట్‌లలో ఎస్‌టీ వాల్మీకి తెగను తొలగించి రాజ్యాంగ వ్యతిరేక చర్యకు పాల్పడిన అధికారులపై చర్యలు చేపట్టకుండా బాధితులైన గిరిజనులపై పాలకులు పోలీసులను ప్రయోగించడం సరికాదని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణకు వినతిపత్రం సమర్పించారు. ఈ ఆందోళనలో గిరిజన ప్రజ, విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు బి.తౌడన్న, కిల్లో సురేంద్ర, కోరాబు సత్యనారాయణ, జర్రా అప్పారావు, పృధ్వీరాజ్‌, పాలకి లక్కు, కోటిజయప్రసాద్‌, సత్యారావు, ఆర్‌.జాన్‌, వి.గంగులయ్య, ఎస్‌.గంగరాజు, కె.నీలకంఠం, ప్రభు, దొర, రాజశేఖర్‌, మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు. 

పాడేరులో గిరిజన నేతలు అరెస్టు, విడుదల

మహాధర్నా భగ్నంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామునే పలువురు గిరిజన నేతల ఇళ్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స, జేఏసీ కన్వీనర్‌ రామారావుదొర, సీపీఎం మండల కార్యదర్శి ఎల్‌.సుందరరావులను వారి ఇళ్ల వద్దే పోలీసులు అదుపులోకి  తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారిని స్టేషన్‌లోనే ఉంచి సాయంత్రం సొంత పూచీపై వారిని విడుదల చేశారు.  

అరెస్టులకు వ్యతిరేకంగా నేడు, రేపు నిరసనలు 

పాడేరులో మహాధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన గిరిజన నేతలు, గిరిజనుల్ని ఎక్కడిక్కడ పోలీసులు అరెస్టులు చేయడాన్ని వ్యతిరేకిస్తూ శని, ఆదివారాలు ఏజెన్సీ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స తెలిపారు.