Abn logo
Jun 19 2021 @ 18:15PM

విజయసాయికి మతిభ్రమించింది: వడ్డే శోభనాద్రీశ్వరరావు

విజయవాడ: కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిపై తీవ్ర విమర్శలు చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డికి మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. విజయసాయికి మతిభ్రమించిందంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏ రోజైనా అశోక్ గజపతి జైలుకు వెళ్ళక తప్పదన్న విజయసాయి రెడ్డి ప్రకటన చూస్తే అతని మానసిక స్థితి సరిగ్గా లేదని స్పష్టంగా అర్థమవుతోందన్నారు. అవినీతి ఆరోపణలతో దాదాపు పదిహేను మాసాలు జైలులో గడిపి, దీర్ఘకాలంగా బెయిల్‌పై విజయసాయి ఉన్నారని, ప్రస్తుతం ఏరోజైనా బెయిల్ కాన్సిల్ అయ్యి తిరిగి ఊచలు లెక్కించాల్సిందేనన్నారు. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనుపిస్తుందన్న నానుడి విజయసాయికి వర్తిస్తుందన్నారు. ఆంధ్రా యూనివర్సిటీకి 600 ఎకరాలు దానం చేయటమేకాక, వేలకు వేల ఎకరాలు భూములను పలు దేవాలయాలకు, ధార్మిక సంస్థలకు దానం చేసిన ఘన చరిత్ర అశోక్ కుటుంబానికి ఉందన్నారు. 


రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో పద్ధతిలో వేలకు వేల కోట్ల రూపాయలు అక్రమంగా జగన్  దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయని.. అందులో ప్రధాన సూత్రధారి ఏ2గా విజయసాయి రెడ్డి పేరుందన్నారు. అశోక్‌ను విమర్శించడం సూర్యునిపై  ఉమ్మి వేయడానికి ప్రయత్నించడమే అవుతుందని హెచ్చరించారు. కలలో కూడా అశోక్‌కు తప్పుడు ఆలోచనలు రావని, బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి ఇటువంటి అసత్య, దౌర్భాగ్య ప్రకటనలు చేయడం ఎంతమాత్రం తగదన్నారు.