Abn logo
Jan 18 2021 @ 02:18AM

టీకా.. జోరిక!

2 రోజుల్లో 2,24,301 మందికి వ్యాక్సిన్‌

447 మందికి దుష్ప్రభావాలు.. ముగ్గురికి చికిత్స

ఆస్పత్రిలో చేరిన ముగ్గురిలో ఇద్దరు డిశ్చార్జ్‌

రెండోరోజు ఆరు రాష్ట్రాల్లో 17,072 మందికి టీకా

వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో పెరుగుతున్న భరోసా

కేంద్రాలు, టీకాల సంఖ్య పెంచుతున్న సర్కార్లు

ఏపీలో వారానికి ఆరు.. తెలంగాణలో 4 రోజులు

వ్యాక్సినేషన్‌పై రాష్ట్రాలతో భేటీ.. సూచనలు


న్యూఢిల్లీ, జనవరి 17: సోమవారం నుంచి టీకా కార్యక్రమం జోరందుకోనుంది. టీకాపై భయం తొలగుతుండడంతోపాటు సాంకేతిక సమస్యలు కూడా క్రమంగా పరిష్కారమవుతుండడమే ఇందుకు కారణం. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో సోమవారం నుంచి టీకా వేసే కేంద్రాలతోపాటు సంఖ్య కూడా పెంచుతున్నారు. ఇబ్బందులు తగ్గితే వీటి సంఖ్యను మరింత పెంచేందుకూ రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా.. సైడ్‌ ఎఫెక్టులు తక్కువగా కనిపించినందున, తొలి రోజు పేరు నమోదు చేసుకుని కూడా టీకా కేంద్రాలకు వెళ్లనివారు ఇప్పుడు సుముఖత వ్యక్తం చేయవచ్చనే భావన వ్యక్తమవుతోంది. సోమవారం నుంచి వ్యాక్సినేషన్‌కు ఎక్కువ మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి రోజు 2,07,229 మందికి టీకా వేశారు! రెండో రోజు కేవలం ఆరు రాష్ట్రాల్లో 17,072 మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు! ఆంధ్రప్రదేశ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, మణిపూర్‌, తమిళనాడుల్లో టీకా కార్యక్రమం కొనసాగించారు. ఏపీలో తొలిరోజు 332 కేంద్రాల్లో 19,025 మందికి టీకాలు వేసిన ప్రభుత్వం రెండోరోజైన ఆదివారం 308 కేంద్రాల్లో 13,041 మందికి వ్యాక్సిన్‌ అందించింది. ఆదివారం 312 కేంద్రాల్లో 27,233 మంది లబ్ధిదారులకు టీకా అందించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.


కానీ.. 14,192 మంది టీకా తీసుకోలేదు. శనివారం టీకా తీసుకోని వారు ఆదివారం కూడా వేయించుకోకపోతే వారికి మరో అవకాశం ఇవ్వబోమని కేంద్రం హెచ్చరించింది. దీంతో శనివారం టీకా వేయించుకోని వారిలో చాలామంది ఆదివారం తీసుకున్నారు. ఇదే పరిస్థితి ఇతర రాష్ట్రాల్లోనూ నెలకొంది. వెరసి, రెండు రోజుల్లో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం 2,24,301 మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు అయింది. దేశం మొత్తంమీద 447 మందికి స్వల్ప ఇబ్బంది ఎదురైతే, ముగ్గురికి మాత్రమే ఆస్పత్రిలో చికిత్స చేయాల్సి వచ్చింది. వారిలో ఇద్దరిని డిశ్చార్జి చేశారు. ఒక్కరు మాత్రమే వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా సాధారణంగానే ఉంది. తద్వారా, టీకా సురక్షితమనే భావనకు బలం పెరుగుతోంది.


దీనికితోడు, కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో తలెత్తిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకుంది. అమెరికా, యూకే, ఫ్రాన్స్‌ల్లో తొలి రోజు వేసిన టీకాల కన్నా మన దేశంలో వేసిన టీకాలే ఎక్కువ. అయినా, దుష్ప్రభావాలూ తక్కువ నమోదయ్యాయి. ‘‘వ్యాక్సిన్‌ గురించి ప్రజల్లో కొద్దిగా భయం ఉంది. అంతేకాదు.. భారతీయులు ముఖ్యమైన విషయాల్లో వేచిచూసే ధోరణిని అవలంబిస్తుంటారు. కారు కొనాలన్నా.. ఏదైనా గృహోపకరణం కొనుగోలు చేయాలన్నా.. నిర్ణయం తీసుకోవడానికి ముందు.. అప్పటికే వాటిని కొన్నవారి అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు’’ అని ఢిల్లీలోని రాజీవ్‌గాంధీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ బీఎల్‌ షేర్వాల్‌ తెలిపారు. టీకా గురించి తెలిసే కొద్దీ వాటిని తీసుకునేవారి సంఖ్య మరింతగా పెరుగుతుందని భారత వైద్య పరిశోధన మండలి మాజీ డైరెక్టర్‌ జనరల్‌ ఎన్‌కే గంగూలీ ఆశాభావం వెలిబుచ్చారు. ఇక, తొలిరోజు టీకా తీసుకున్న వారి సంఖ్య తక్కువగా ఉండడానికి కొవిన్‌ యాప్‌లో లోపాలే కారణమని ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ ఆస్పత్రి మెడికల్‌ డైరెక్టర్‌ సురేశ్‌ కుమార్‌ అన్నారు. వీటి పరిష్కారంపై కేంద్రం ఇప్పటికే దృష్టి సారించింది. 


తెలంగాణ టాప్‌

తొలి రోజు ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి టీకా ఇవ్వాలన్నది కేంద్రం లెక్క. కానీ, భయం వల్లనో.. వేచి చూద్దామనే ధోరణితోనో.. కొవిన్‌ యాప్‌లో లోపాల వల్లనో.. కారణమేదైనాగానీ ఎక్కడా 100 శాతం లబ్ధిదారులు టీకా వేయించుకోవడానికి రాలేదు. కేంద్రం లెక్క ప్రకారం.. ఒక్కో సెషన్‌ సైట్‌లో 100 మందికి చొప్పున దేశవ్యాప్తంగా తొలిరోజు 3,35,200 మందికి టీకా ఇవ్వాలి. కానీ, 2,07,229 మంది (61.82 శాతం) మాత్రమే టీకా తీసుకున్నారు. ఇది జాతీయ సగటు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 67.16 మంది (తీసుకోవాల్సినవారు 31,700 మంది. తీసుకున్నవారు 21,291 మంది) టీకా తీసుకోగా.. ఏపీలో 31,570 మందికిగాను 19,025 మంది (60.26%) టీకా తీసుకున్నారు. ఇక, భద్రతకు పెద్దపీట వేస్తూ ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణలో ఒక్కో కేంద్రంలో తొలి రోజు 30 మందికే వేశారు. మొత్తం 140 కేంద్రాల్లో 4,200 మందికి 3,962 మంది టీకా వేయించుకున్నారు. అంటే 94.3 శాతం. ఇది దేశంలోనే అత్యధికం. దేశవ్యాప్తంగా శనివారం జరిగిన వ్యాక్సినేషన్‌ గురించి ఆదివారం ఆయా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో చర్చించామని కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌ అగ్నానీ తెలిపారు. ఇతర వైద్య సేవలు, టీకా కార్యక్రమాలకు విఘాతం కలగకుండా వారానికి నాలుగు రోజులు కరోనా టీకా కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సూచించామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వారానికి ఆరు రోజులపాటు.. మిజోరాంలో 5 రోజులపాటు టీకా కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. తెలంగాణ సహా 27 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో వారానికి నాలుగు రోజులపాటు వ్యాక్సినేషన్‌ జరుగుతుందన్నారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు, నాగాలాండ్‌, ఒడిశాల్లో వారానికి మూడురోజులు.. గోవా, ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో వారానికి రెండు రోజులు టీకా కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కాగా, కొవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకు ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాలకు ఉచితంగా ఇస్తా రా? అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ ప్రశ్నించింది. తొలి విడతలో 3 కోట్ల మం దికి వ్యాక్సిన్‌ ఇస్తామంటున్న ప్రభుత్వం మిగిలిన వారికి ఎప్పుడిస్తుందో, ఉచితంగా ఇస్తుందో లేదో స్పష్టం చేయాలని ఆ పార్టీ ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా కోరారు. కాగా, వ్యాక్సిన్లపై కాంగ్రెస్‌ చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విజ్ఞప్తి చేశారు. 


పొగరాయుళ్లు, శాకాహారులకు ముప్పు తక్కువ!

‘‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’’..  అయితే పొగరాయుళ్లకు కరోనా సోకే ముప్పు తక్కువని సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన సీరో సర్వేలో వెల్లడైంది. ఇందులో భాగంగా ధూమపానం అలవాటు, మద్యపానం అలవాటు, రక్త వర్గం, వృత్తి, ఆహారపు అలవాట్లు, ఆరోగ్య వివరాలు వంటి సమాచారాన్ని సర్వేలో పాల్గొన్న వారి నుంచి సేకరించారు. 10,427 మంది నుంచి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షించగా, 1058 మందిలో కరోనా యాంటీబాడీల (సెరో పాజిటివిటీ)ను గుర్తించారు. పొగరాయుళ్లు, శాకాహారుల్లో సెరో పాజిటివిటీ రేటు స్వల్పంగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఏ, ఓ బ్లడ్‌ గ్రూప్‌ల వారితో పోలిస్తే.. బీ, ఏబీ గ్రూప్‌ల వారికి ఇన్ఫెక్షన్‌ ముప్పు ఎక్కువని తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement