Abn logo
Oct 13 2021 @ 17:42PM

మన అణ్వాయుధాలను ఏలియన్స్ హ్యాక్ చేశారు.. వాటితోనే మూడో ప్రపంచ యుద్ధం.. అమెరికా వాయుసేన మాజీ అధికారి హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్:  ఏలియన్స్ లేదా గ్రహాంతర వాసులు ఉన్నారా అంటే.. ఉన్నారని శాస్త్రీయంగా వాదించవచ్చు! ఈ సువిశాల విశ్వంలో  మనిషి ఉనికిలోకి వచ్చినట్టుగానే మరో చోట.. మనుషుల్లాంటి బుద్ధిజీవులు పుట్టే ఆస్కారం కచ్చితంగా ఉంది.   అయితే.. వారికి మన గురించి తెలుసా..? ఇప్పటికే వారు భూమిని సందర్శించి వెళ్లారా..? అనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ నిర్దిష్టమైన సమాధానాల్లేవు. పాశ్చాత్య దేశాల్లో అనేక మంది ఏలియన్లు ఉన్నారని బలంగా నమ్ముతారు. గ్రహాంతరవాసులు వినియోగించే వ్యోమనౌకలను(యూఏఫ్ఓలు) చూశామని బల్లగుద్ది మరీ వాదిస్తుంటారు. అంతేకాదు.. వారి ఉనికి గురించి ప్రభుత్వాలకు తెలుసునని, అయితే ప్రజల్లో కలకలం రేగకుండా ఉండేందుకు వాస్తవాలను తొక్కిపెడుతున్నాయని ఆరోపిస్తుంటారు. 

ఇదిలా ఉంటే..ఈమారు ఏకంగా అమెరికా ఎయిర్ ఫోర్స్ మాజీ ఉన్నతాధికారి రాబర్ట్ సాలాస్.. ఏలియన్లకు సంబంధించి ఇటీవల పలు సంచలన విషయాలు బయటపెట్టారు. దశాబ్దాల క్రితమే వారు అమెరికా అణ్వాయుధాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారని, కొన్ని మిస్సైళ్లను నిర్వీర్యం చేశారని ఇటీవల ఆయన పేర్కొన్నారు. మరికొన్నింటిని ప్రారంభించేందుకు ప్రయత్నించారని తెలిపారు. 1967 మార్చి 24న ఓ అండర్‌గ్రౌండ్ అణ్వాయుధ స్థావరంలో తాను విధుల్లో ఉండగా.. ఏలియన్స్ అక్కడి అణ్వాయుధాల నియంత్రణ వ్యవస్థలను ట్యాంపరింగ్ చేయడం చూశానని చెప్పుకొచ్చారు.

సాధారణ ప్రజలు ఇలా ఏలియన్స్ గురించి ప్రస్తావిస్తే ఎవరి నమ్మకాలు వారివని సరిపెట్టుకోవచ్చు గానీ.. సాక్షాత్తూ ఓ ఎయిర్ ఫోర్స్ మాజీ అధికారి.. అందునా అణ్వాయుధ వ్యవస్థలపై లోతైన అవగాహన ఉన్న సాలస్ ఇటువంటి ప్రకటన చేయడంతో ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది. రాబర్ట్‌కు అణ్వాయుధాల గురించి లోతైన అవగాహన ఉంది. న్యూక్లియర్ మిస్సైళ్ల అభివృద్ధి కోసం అమెరికా ప్రభుత్వం చేపట్టిన టైటన్-3 కార్యక్రమంలో రాబర్ట్..  ప్రోపల్షన్ సిస్టమ్ ఇంజినీర్‌గా పనిచేశారు. అమెరికా వాయుసేనలో ఆయుధాల కంట్రోలర్‌గా కూడా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. 

దీంతో.. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది ఏలియన్స్ వల్లనేనని కూడా ఆయన తేల్చి చెప్పడం.. పెద్ద చర్చకే దారితీసింది. ఏలియన్స్ నిర్వాకాల గురించి అమెరికా వాయు సేన మాజీ అధిపతులకూ తెలుసనని, వారు ఇందుకు సంబంధించిన రహస్య పత్రాలను త్వరలోనే బహిరంగపరుస్తారని రాబర్ట్ పేర్కొన్నారు. అక్టోబర్ 19న ఈ మేరకు వారు ఓ మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది. దీంతో.. ఈ సమావేశం ఎటువంటి సంచలనానికి దారితీస్తుందో అనే ఉత్కంఠ ప్రస్తుతం సర్వత్రా నెలకొంది. 

తాజా వార్తలుమరిన్ని...