Apr 17 2021 @ 09:01AM

త్వరలో 'ఉప్పెన' కాంబోలో మరో సినిమా..!

త్వరలో ఉప్పెన కాంబినేషన్‌లో మరో సినిమా పట్టాలెక్కబోతోందా.. అవుననే మాట ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఉప్పెన సినిమా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చి ఎంత పెద్ద హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకి ఈ సినిమాతో ముగ్గురు పరిచయమయ్యారు. దర్శకుడిగా బుచ్చిబాబు సానా, హీరోగా మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, హీరోయిన్‌గా కృతిశెట్టి. ఈ ముగ్గురికి ఉప్పెన లైఫ్‌లో గుర్తిండిపోయే సినిమాగా మిగిలింది. ఇక ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్‌కి భారీ లాభాలను తెచ్చి పెట్టింది. ఈ క్రమంలో దర్శకుడు బుచ్చిబాబు తన రెండవ సినిమాని కూడా ఇదే నిర్మాతలతో చేయనున్నాడు.  

బుచ్చిబాబు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు. ఈసారి స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు బుచ్చిబాబు. కాగా ఉప్పెన టీంలో కొత్త దర్శకుడు వచ్చి చేరనున్నాడట. ఈ సినిమా ద్వారా సుకుమార్ టీమ్ నుంచి మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుండగా ఉప్పెన జంట ఈ సినిమాలో కనిపించబోతున్నారట. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్.. క్రిష్ దర్శకత్వంలోనటించిన సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటించింది. ఇక రీసెంట్‌గా వైష్ణవ్ తేజ్ మూడవ సినిమా కూడా ప్రారంభమైంది. రొమాంటిక్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.