Abn logo
May 22 2020 @ 00:12AM

ఊరటనివ్వని ఉద్దీపన

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రైతులు, వలస కార్మికులకు ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీలోని అంశాలు సాధారణ బడ్జెట్‌లో వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాల వంటివి మాత్రమే. కరోనా సంక్షోభంలో రైతులు, వలసకార్మికులకు ప్రత్యేకంగా భరోసానిచ్చేవిధంగా లేవు.


కొవిడ్‌- 19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు అమలు చేయబడిన 4 దఫాల లాక్‌డౌన్‌ వలన కష్టనష్టాలకు గురైన రైతులు, వ్యవసాయ కూలీలు, వలస కార్మికులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సుమారు రూ.3.16 లక్షల కోట్లు కేటాయింపుతో కూడిన కొన్ని పథకాలను ప్రకటించారు. లోతుగా పరిశీలన చేసినపుడు ఈ ప్రతిపాదిత చర్యల వలన అత్యంత తీవ్రంగా నష్టపోయివున్న రైతులకు, పేదలకు ముఖ్యంగా వలస కార్మికులకు పెద్దగా ప్రయోజనం చేకూరదని భావించాల్సి వస్తోంది.


దాదాపు 50రోజులుగా అమలుచేయబడుతున్న లాక్‌డౌన్‌ వలన అత్యంత దారుణంగా కష్టనష్టాలకు గురైనవారు వలస కార్మికులు. పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లభించక ఉదరపోషణ నిమిత్తం వందలవేల కిలోమీటర్ల సుదూర ప్రాంతాలకు వెళ్ళి కూలీనాలీ పనులు చేసుకొంటూ సంపాదించుకొన్న దానిలో కొంత స్వస్థానంలో వున్న కుటుంబసభ్యులకు పంపుతూ వుంటారు. దేశవ్యాప్తంగా వీరిసంఖ్య దాదాపు 8కోట్లు అని ఆర్థిక మంత్రే అంగీకరించారు. 


లాక్‌డౌన్‌ ప్రకటన చేసేముందు, అందువలన ఎదురుకాగల పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలించి తగునిర్ణయాలు తీసుకోవలసి వుండగా ప్రధాని మోదీ అందుకు భిన్నంగా వ్యవహరించారు. భవనాలు-, రహదారులు, -ఇరిగేషన్‌ ప్రాజెక్టులు మున్నగువాటి నిర్మాణ కార్యక్రమాల్లో, పరిశ్రమలలో, వ్యవసాయ, సేవారంగాల్లో పనిచేస్తూవున్న అసంఘటిత వలస కార్మికులకు వసతి సౌకర్యాలు, ఆహారపు ఏర్పాట్లు చేయవలెనని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారేతప్ప, కేంద్రం నుండి నిధులను అందించడంగానీ, స్పష్టమైన మార్గదర్శకాలను కానీ, మోదీ ప్రకటించలేదు. వలస కార్మికుల సేవలను పొం దుతూవున్న సంస్థలు, వ్యక్తులు, దయార్ద్రహృదయం వున్న సమాజం కొంతమేరకు వారికి భోజన సదుపాయాలు సమకూర్చారు. రాష్ట్రప్రభుత్వాల పక్షంగా జరిగిన సహాయం కూడా అతి స్వల్పం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో చేయూత నందిస్తున్నా, ఈ వర్గం సంక్షేమం గురించి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం కడు విచారకరం. 


దేశవ్యాప్తంగా వలస కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణిని పౌరసమాజం, స్వచ్ఛంద సంస్థలు నిరసించడం, ఔరంగాబాద్‌ సమీపంలో రైలు చక్రాల క్రింద 15 మంది దుర్మరణం పాలవడం, కాలినడకన వెళ్ళేదారిలో అధికసంఖ్యలో పేదలు చనిపోవడం వంటి అంశాలు వెలుగుచూడటంతో వలస కార్మికులను వారి స్వస్థలాలకు వెళ్ళేందుకు అనుమతించాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. మార్చి 25 నుండి ఒక వారం రోజులు వ్యవధి ఇచ్చి వలస కార్మికులు వారి స్వస్థలాలకు చేరిపోయే అవకాశం కల్పించి వుంటే బాగుండేది. కరోనా ప్రమాదం తగ్గిన తరువాత, ఆ వలస కార్మికులు ఉపాధి నిమిత్తం తిరిగి వచ్చే అవకాశం వుండేది. 50 రోజుల లాక్‌డౌన్‌ సమయంలో వారు వర్ణనాతీతమైన ఇబ్బందులను అనుభవించి స్వస్థలాలకు చేరిన పిదప తిరిగి పనుల నిమిత్తం వెనుకకు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయి. నిర్మాణరంగం, వస్తూత్పత్తి, సేవారంగం, వ్యవసాయ కార్యక్రమాలపైన దీని ప్రభావం గణనీయంగా వుంటుంది.


పనులు లేనందువలన వున్న డబ్బులు ఖర్చు పెట్టేసుకొని, చేతిలో చిల్లిగవ్వ లేక యిబ్బందిపడుతూ వున్న వలస కార్మికుల దయనీయ పరిస్థితిని గుర్తించకుండా వారుకానీ, వారి తరపున రాష్ట్ర ప్రభుత్వం కానీ రైలు చార్జీలు భరించితే శ్రామిక రైళ్ళు నడపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం సిగ్గుచేటు. కొద్ది నెలల క్రితమే ఉద్దేశపూర్వకంగా బ్యాంకులకు చెల్లించవలసిన రుణం ఎగ్గొడుతూ వున్న ముకుల్‌ చోష్కీ, నీరవ్‌ మోడి, విజయ్‌మాల్యా వంటి 50మంది బడా పారిశ్రామిక వేత్తలకు రూ.68,300 కోట్ల బకాయిలను రద్దుచేసిన కేంద్ర ప్రభుత్వం కడు దయనీయ స్థితిలో వున్న వలస కార్మికుల పట్ల అనుసరిస్తున్న వైఖరి క్షమార్హం కాదు. సాధారణంగా బిహార్‌, ఒరిస్సా, బెంగాల్‌ మున్నగు పొరుగు రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి వచ్చే వలస కార్మికులకు యిక్కడ ఓటు హక్కు వుండదు. ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యత లభించుతూవున్న నేటికాలంలో వలస కార్మికుల ఆక్రందనలు పాలకుల చెవులకు చేరడం లేదు. వలస కార్మికులు ఎదుర్కొంటున్న అమానవీయ దుర్భర పరిస్థితులను పత్రికల ద్వారా గమనించిన వివిధ రాష్ట్రాలలోని హైకోర్టులు వలస కార్మికులను వారి స్వస్థలాలకు పంపే బాధ్యత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని, స్పష్టమైన తీర్పులు యిస్తున్నా మాటలు చెబుతున్నారే తప్ప, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా యిప్పటికీ అందుకు అనుగుణమైన చర్యలను తగినంతగా చేపట్టనందునే యిప్పటికీ భారీ సంఖ్యలో వారు నడిచి వెళుతూ వున్నారు.


దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమలులో వుండగా, కేంద్ర ఆర్థిక మంత్రి వలస కూలీలకు గ్రామాలలో పనులు కల్పిస్తామని ప్రకటించడం హాస్యాస్పదం. మనదేశంలో బియ్యం, గోధుమలు మున్నగు ఆధార ధాన్యాలు కనీస నిల్వ 21 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు వుండాల్సి వుండగా ప్రస్తుతం దాదాపు 75 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులున్నాయి. అందువలన కార్డు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క పేదవానికి నిత్యావసరాలు అందచేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుంది. 


దేశవ్యాప్తంగా 50 లక్షల మంది వీధి వ్యాపారులున్నారు. వీరు సగటున రోజుకు రూ.300 సంపాదించుకొంటారనే లెక్క వేస్తే లాక్‌డౌన్‌ వల్ల ఈ వ్యాపారాలు రోజుకు రూ.150కోట్ల ఆదాయాన్ని కోల్పోయి వుంటారు. అనగా నెలకు 4,500 కోట్లు నష్టపోయారు. కావున వీధి వ్యాపారులు 50 లక్షలమందికి రుణ సహాయంతోపాటు రూ.5,000ల చొప్పున 2,500 కోట్లు నగదు సహాయాన్ని అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వుంది. 


వలస కార్మికులతో పాటు లాక్‌డౌన్‌ వల్ల చాలా ఎక్కువగా నష్టపోయింది రైతాంగం, వ్యవసాయ కార్మికులు. రబీ పంట గోధుమలు, బియ్యం, మొక్కజొన్న, అపరాలు మున్నగు పంటలతోపాటు మిర్చి, పసుపు, ఉల్లి, దానిమ్మ, అరటి, కూరగాయలు, పూలు వంటి ఉద్యానపంటలు రైతు చేతికి వచ్చే సమయం ఇది. దేశవ్యాప్తంగా మార్కెట్ల లోనికి సాధారణంగా వచ్చే సరుకులలో 50శాతంలోపే వచ్చాయని సర్వేలో గమనించారు. మనదేశంలో 2019–-20లో దాదాపు 5లక్షల కోట్ల రూపాయల విలువైన పండు కూరగాయలు పండించబడ్డాయని అంచనా. కొవిడ్‌ హాట్‌స్పాట్‌లకు సమీపంలో వున్న కారణాన మన రాష్ట్రంలో గుంటూరు మిర్చి యార్డు, కర్నూలు మార్కెట్‌ యార్డు మూతపడ్డాయి.


అలాగే అనేకచోట్ల ప్రధాన మార్కెట్‌ యార్డులు పనిచేయకపోవడం, రవాణా చేయడానికి వాహనాలు లభ్యం కాకపోవడం, ఎగుమతి, దిగుమతుల కూలీల కొరత, అధికారుల నుండి అనుమతులు, రాష్ట్ర సరిహద్దుల వద్ద ఆంక్షలు మున్నగు కారణాల వల్ల ఉద్యాన పంటలు పండించిన రైతులకు సగటున నెలకు 20 వేల కోట్ల రూపాయల నష్టపోయినట్టు అంచనా. చిన్న సన్నకారు రైతులకు నాబార్డు ద్వారా రూ.30,000 కోట్లు అత్యవసర మూలధన నిధి సమకూర్చి సహకార బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు అందించుతామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ ప్రకటనలకు, ఆచరణకు పొంతన వుండటం లేదు. గ్రామాలలో సన్న, చిన్న రైతులు వ్యవసాయ కూలీలకు ఎక్కువగా ఉపయోగపడే సహకార బ్యాంకుల నుండి అందిన రుణాలు మొత్తం వ్యవసాయ రుణాలలో 1991లో 50శాతం మేరకు ఉండగా, 2017–-18 నాటికి 13 శాతానికి దిగజారింది. ప్రతి వార్షిక బడ్జెట్‌లోనూ వ్యవసాయ రంగానికి లక్షల కోట్ల రూపాయలు హెచ్చుగా కేటాయిస్తూ వున్నట్లు కేంద్రం ఘనంగా ప్రకటిస్తూ వున్నా ఆచరణలో సన్నకారు, చిన్నరైతులు కౌలు రైతులలో దాదాపు 46% అధిక వడ్డీలకు ప్రైవేట్‌ రుణాలపైనే ఆధారపడుతూ వున్నది వాస్తవం. కనుక లాక్‌డౌన్‌ వల్ల నష్టపోయిన రైతాంగానికి నేరుగా నగదు సహాయాన్ని అందించవలసిన అవసరం ఎంతైనా వుంది. కావున లోగడ ప్రకటించిన రూ.6,000 కాక మరొక రూ.10,000లు చొప్పున రైతుల ఖాతాల లోనికి ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందచేయడం సమంజసం.


మే 15న ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్యాకేజీలోని అంశములు సాధారణ బడ్జెట్‌లో వివిధ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపట్టే పథకాలు, కార్యక్రమాల వంటివే తప్ప ప్రత్యేకంగా కరోనా వలన నష్టపోయిన రైతులకు భరోసా యిచ్చే విధంగా లేవు.

వడ్డే శోభనాద్రీశ్వరరావు

Advertisement
Advertisement
Advertisement