Abn logo
Sep 22 2020 @ 01:18AM

అయాచిత విధేయత

ఒకేఒక్క పార్టీకి మెజారిటీ, అంతకు మించిన స్థానాలు రావడం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 1991 దాకా కొనసాగింది. నిరాఘాటంగా జైత్రయాత్ర సాగిస్తూ వచ్చిన కాంగ్రెస్‌పార్టీకి 1977లో ఎదురుదెబ్బ తగిలింది. అనేక పార్టీలు కలిసి జనతాపార్టీగా రూపొందకపోతే, అప్పుడు కూడా కాంగ్రెస్‌దే విజయభేరి అయి ఉండేది చిన్నా, చితకా, మధ్యరకం పార్టీలు కలిసి ఒకే పార్టీగా విలీనం కావడం వల్ల పెద్ద ఫలితం ఉండదని జనతా ప్రయోగం రుజువు చేయగా, ఏ పార్టీకి ఆ పార్టీ సొంత ఉనికితో ఉంటూనే, కూటమిగా ఏర్పడడం ఆచరణీయమేనని మిశ్రమప్రభుత్వాలు రుజువుచేశాయి. 1996 తరువాతనే మిశ్రమ ప్రభుత్వాలు అన్నది సాంకేతికంగా నిజమే కానీ, 1991–96 మధ్యలో పి.వి.నరసింహారావు అవసరార్థం బయటి మద్దతును ఎప్పటికప్పుడు కూడగట్టుకుంటే కానీ, ప్రభుత్వానికి కావలసిన బలం ఉండేది కాదు. మొత్తానికి ఒక రెండుదశాబ్దాల పాటు, 2014లో నరేంద్రమోదీ నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ సొంతంగా మెజారిటీ సాధించేదాకా, మిశ్రమ ప్రభుత్వాలే కొనసాగాయి. ఏదో ఒక ప్రధాన పార్టీ ఉంటుంది కానీ, బయటి మద్దతులు తప్పవు. ఆరేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వంలో ఇతర పార్టీలు ఉన్నాయి కానీ, వాటి మద్దతు ప్రధాన పార్టీకి అవసరం లేదు. 


ఇక ఈ దేశంలో ఒకే ఒక్క పార్టీ అధికారాన్ని చెలాయించే రోజులు ముగిసినట్టేనని, ప్రాంతీయ, సామాజిక పార్టీల కూటములే అధికారంలో ఉంటాయని ఏర్పడిన అభిప్రాయాన్ని 2014 ఎన్నికలు తుడిచిపెట్టాయి. 1960ల నుంచి మొదలైన ప్రాంతీయ పార్టీల, సామాజిక న్యాయ పార్టీల ప్రయాణం దేశంలో అనేక ముఖ్య, సంచలనాత్మక పరిణామాలకు కారణమైంది. అధికార వికేంద్రీకరణకు, ఫెడరలిజానికి కూడా దోహదం చేసింది. కాంగ్రెస్‌ అయినా, భారతీయ జనతాపార్టీ అయినా పైకి ఫెడరలిజాన్ని జపించినా, కేంద్రీకృత అధికారాన్ని ఇష్టపడే పార్టీలే. మిశ్రమ పార్టీ ప్రభుత్వాన్ని నిర్వహించవలసి వచ్చిన కాంగ్రెస్‌, కొద్దిగా భయభక్తులతో మెలగవలసి వచ్చేది కాబట్టి, కేంద్రీకృత అధికార వ్యాప్తికి దూకుడుగా ప్రయత్నించలేదు. 2014 నుంచి నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక రంగాలలో పరిపాలనను కేంద్రీకరించడానికి ప్రయత్నిస్తున్నది. అందుకు జాతీయ భావనలను ఉపయోగించుకుంటున్నది. ప్రాంతీయ పార్టీలను, సామాజికవాద పార్టీలను బలహీనపరచడానికి ప్రయత్నిస్తున్నది. ప్రాంతీయ, భాషా అస్తిత్వాలు, సామాజిక న్యాయవాదం బలంగా ఉన్న తమిళనాడులో సైతం తన ఉనికిని చొప్పించడానికి బిజెపి తీవ్ర ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ‌అనేక ప్రాంతీయ పార్టీలు, స్వచ్ఛందంగా భారతీయ జనతాపార్టీ పరమాధికారానికి విధేయత ప్రకటించుకుని, తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి. కేంద్రంతో సత్సంబంధాలుండడం వల్ల రాష్ట్రాభివృద్ధికి తగిన దోహదం లభిస్తుందన్న సమర్థనతో పాటు, జాతీయవాదంతో ముడిపడిన మతవాదాన్ని ఎదుర్కొనే శక్తియుక్తులు ఆ పార్టీల వద్ద లేకపోవడం కూడా ఈ లొంగుబాటుకు కారణం. ఒరిస్సాలో, బిహార్‌లో, కొంతకాలం కశ్మీర్‌లో, పంజాబ్‌లో స్థానిక పార్టీలు కేంద్ర అధికార పార్టీతో స్నేహం చేయడంతో పాటు, అధికారంలో వాటా ఇచ్చాయి. వాటాతో మొదలుపెట్టి, మొత్తంగా కైవసం చేసుకోవడం దీర్ఘకాలిక లక్ష్యం కాగా, రాష్ట్ర అధికారంలో భాగం లభిస్తే కేంద్రప్రభుత్వం నడక నల్లేరు మీద సాగుతుందన్నది ఎత్తుగడ. బెంగాల్‌లోను, తమిళనాడులోను అటువంటి భాగస్వామ్యం కోసం బిజెపి ప్రయత్నిస్తున్నది. 


తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడినది, ప్రాంతీయ అస్తిత్వ భావనలు ఇంకా బలంగా కొనసాగుతున్నవి. అక్కడ బలమైన ఉనికి పొందడానికి సమయం పడుతుంది. అయినా, ప్రయత్నం జరుగుతూనే ఉన్నది. మరి ఆంధ్రప్రదేశ్‌ సంగతేమిటి? అక్కడి పాలక పార్టీ సాంకేతికంగా మాత్రమే ప్రాంతీయ పార్టీ. జాతీయ పార్టీ నాయకత్వం మీద కోపగించి, ప్రాంతీయ విభాగాన్ని పార్టీగా ప్రకటించుకుంటే, అది ప్రాంతీయవాద పార్టీ కాబోదు. వైసిపి ప్రాంతీయ భావాలు ఏమిటో, దాని సిద్ధాంతాలు ఏమిటో ఎవరికీ తెలియదు. కేంద్రప్రభుత్వంతో దాని సంబంధాలను ప్రధానంగా నిర్ణయిస్తున్నది, ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మీద విచారణలో ఉన్న కేసులు. కేంద్ర నేరపరిశోధనా సంస్థల విచారణలో ఉన్న కేసుల విషయంలో కేంద్రప్రభుత్వానికి ఉండే వెసులుబాట్లు, అవకాశాలు తెలిసినవే కదా, అందుకని, వైసిపి ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వం, ఆ ప్రభుత్వం పాలించే రాష్ట్రం మొత్తంగా కేంద్ర జాతీయపార్టీకి అణకువగా ఉండవలసిందే. తన ప్రాణరహస్యం తెలిసిపోయిన తరువాత మాయల ఫకీరు భయపడుతూ మెలగక తప్పదు. 


ఆదివారం నాడు వైసిపి ఎంపి విజయసాయి రెడ్డి రాజ్యసభలో చేసిన ప్రసంగం ఆయన పార్టీ బలహీనతను స్పష్టంగా వెల్లడి చేసింది. కేంద్ర విధానాన్ని సమర్థిస్తే సమర్థించుకోవచ్చు. అనుకూలంగా ఓటు వేయవచ్చు. కానీ, వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్న ఇతర పక్షాల మీద ఒంటికాలి మీద లేవడం ఎందుకు? ఎవరిని మెప్పించడానికి? కాంగ్రెస్‌ సభ్యులు అదే ప్రశ్న వేశారు. విద్యుత్‌ సంస్కరణల గురించి కేంద్రం ఇంకా గట్టిగా సూచించక ముందే, రుణలభ్యత పెంచుకోవడం పేరిట, కోరిన సంస్కరణలను అమలుచేయడానికి వైసిపి ప్రభుత్వం ఉత్సాహం చూపింది. జిఎస్‌టి పరిహారం విషయంలో నోరు మెదపకుండా వ్యవహరించింది. రాష్ట్రంలో పెరుగుతున్న వ్యతిరేకత నుంచి ఈ విధేయతలు రక్షిస్తాయా? కేసులు ముంచుకు వచ్చినప్పుడు ఇవి అడ్డుపడతాయా? ఒక విధానం, వైఖరి, సిద్ధాంతం లేకుండా వ్యవహరించే పార్టీకి ఢిల్లీలో ఏమి గౌరవం ఉంటుంది? ఎన్నికల ముందు కలసి పోటీ చేశాయి కాబట్టి, కొన్ని పార్టీలకు ఎన్‌డిఎ ప్రభుత్వంలో చోటు లభించింది. ఆ మిత్రపక్షాల అవసరం లేకున్నా, అది కూటమి నీతి. ఏ మైత్రీ లేకుండా, ప్రాంతీయ పక్షం అవసరం కోసం మాత్రమే, అది కూడా ఏమంత గౌరవప్రదం కాని అవసరాల కోసం మాత్రమే వెంటబడి మరీ విధేయత ప్రకటించడం వైసిపి నీతి.

Advertisement
Advertisement
Advertisement