Abn logo
Oct 6 2021 @ 00:58AM

అధర్మమే నేటి ధర్మం!

భారతదేశంలో ఇప్పుడు అవినీతి గురించి మాట్లాడటమంత హాస్యాస్పద వ్యవహారం మరొకటి లేదు. ఎంత పెద్ద ఆరోపణలు వచ్చినా ఎవరూ పట్టించుకునేవారు లేరు. ఇప్పుడు చాలామందికి రాజకీయాల్లో అవినీతి అనేది అర్హతగా మారింది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు పనామా పేపర్స్ పేరిట బయటపడిన పత్రాల్లో పనామా కేంద్ర కార్యాలయంగా ఉన్న మొస్సాక్ ఫోన్సెకా అనే లా కంపెనీ కార్యకలాపాలు అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించాయి. ఈ కంపెనీ సాయంతో ప్రపంచంలోని సంపన్నులు, అధికారంలో ఉన్న దేశాధినేతలు, మాజీ దేశాధి నేతలు తాము కొల్లగొట్టిన డబ్బును ఏ విధంగా విదేశీ ఖాతాల్లో జమ చేసుకున్నారో ఈ పత్రాలు బయటపెట్టాయి. పన్ను ఎగవేసే వారికి స్వర్గధామాలుగా మారిన అనేక దేశాలు లక్షలాది కోట్లు పలు విదేశీ కంపెనీల పేర్లతోనో, ట్రస్టుల పేర్లతోనో ఖాతాల్లోకి మళ్లించేందుకు దోహదం చేశాయని తేలింది. ఒక జర్మన్ వార్తాపత్రికతో కలిసి అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల కన్సార్టియమ్ చేసిన పరిశోధన దాదాపు కోటి న్నర డాక్యుమెంట్లను, 2 లక్షల 14వేల కంపెనీల బండారాన్ని వెల్లడించాయి. ప్రపంచ వ్యాప్తంగా పన్ను ఎగవేత గురించి మాత్రమే కాదు, ప్రపంచంలో సంపన్నులకూ, పేదలకు మధ్య ఆర్థిక వ్యత్యాసాలు ఏ విధంగా పెరిగిపోయాయో ఈ పనామా పత్రాలు అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. ఫ్రెంచ్ ఆర్థికవేత్త థామస్ పికెటీ, బ్రిటిష్ అమెరికన్ ఆర్థికవేత్త ఆంగస్ స్టెవార్ట్ డీటన్ వంటి ఆర్థిక వేత్తలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై ఈ నల్లధన కేంద్రాలు చూపిస్తున్న ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పత్రాలు బయటకు పొక్కిన తర్వాత ఎన్నో దేశాల ప్రభుత్వాలు కంపించాయి. అనేక దేశాల్లో దేశాధ్యక్షుల, ప్రధానమంత్రుల, మంత్రుల,అధికారుల, వ్యాపారుల, సినిమా ప్రముఖుల లావాదేవీలపై విచారణ జరిగింది. ఐస్ లాండ్ ప్రధానమంత్రి, స్పెయిన్ పరిశ్రమల మంత్రి రాజీనామా చేశారు. న్యూజిలాండ్ పార్లమెంట్‌లో పనామా పత్రాలపై వాడి వేడి చర్చలు జరిగినప్పుడు స్పీకర్ ఆదేశాలను పాటించనందుకు ప్రధానమంత్రినే బయటకు పంపారు. మాజీ బ్రిటిష్ ప్రధానమంత్రి డెవిడ్ కెమరాన్ తన ఆర్థిక వనరుల మూలాల గురించి వెల్లడించి తన పార్టీ పదవిని వదులుకోక తప్పలేదు. పాకిస్థాన్‌లో సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా ఉన్న నవాజ్ షరీఫ్ పై, పదేళ్ల పాటు ఎటువంటి పదవీ స్వీకరించకుండా ఆదేశ సుప్రీంకోర్టు 2017లో నిషేధం విధించింది. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం పడిపోయింది.


కానీ భారత దేశంలో పనామా పత్రాల ప్రభావం ఏమాత్రం లేదు. పనామా పత్రాల్లో 500 మంది భారతీయుల పేర్లు బయటపడ్డాయి. వీరిలో అమితాబ్ బచ్చన్ నుంచి డిఎల్‌ఎఫ్ అధినేత కేపిసింగ్, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ వరకు సినీనటులు, ప్రముఖ న్యాయవాదులు, బిజెపి ఎంపీలు కూడా ఉన్నారు. విదేశాలకు డబ్బులు మళ్లించిన వారందర్నీ అక్రమ సంపాదనా పరులనో, దోపిడీ దారులనో అనలేము కాని అసలు ఈ ఆరోపణలపై కనీసం విచారణ జరిగితే కదా వారు దోషులో కాదో తేలేది? గత అయిదు సంవత్సరాల్లో ఇందుకు సంబంధించి ఎటువంటి విచారణ జరిగిన దాఖలాలు లేవు. పలు ఏజెన్సీలతో కలిసి కమిటీ వేసి విచారణ జరిపిస్తానని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా ప్రకటించారు.బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, బహమాస్, జెర్సీ, మారిషస్, పనామా, హాంకాంగ్, యుఏఇ,సింగపూర్ వంటి అనేక దేశాలతో భారతీయుల సంబంధాల గురించి సమాచారం ఉన్నదని 2017లో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి ఉన్న సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. సిబిడిటి, ఈడీ, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్, రిజర్వు బ్యాంకు తదితర సంస్థలతో కలిసి బహుళ ఏజెన్సీ కమిటీ వేశామని, ఈ కమిటీ ఆరు నివేదికలు సమర్పించిందని ఆయన లోక సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాని ఈ నివేదికల ఆధారంగా తీసుకున్న చర్యల అతీగతీ ఎవరికీ తెలియదు. 2014లో మోదీ తొలి కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా విదేశాల్లో నల్లధనంపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎంబి షా నేతృత్వంలో నియమించిన కమిటీ కూడా ఏడు నివేదికలు సమర్పించింది. ఈ నివేదికల ఆధారంగా కూడా ఎవరిపైనా చర్యలు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. పనామా పత్రాలపై యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ విచారణ కమిటీని నియమించింది. పనామా పత్రాలు యూరోపియన్ దేశాల ఆర్థిక, పన్నుల వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయని, ఇకనుంచైనా పారదర్శకమైన సరళమైన పన్ను వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకోవాలని, సమర్థంగా మనీలాండరింగ్‌ను ఎదుర్కోవాలని, పన్నులు ఎగవేసేందుకు వీలు లేకుండా చూసుకోవాలని ఈ కమిటీ నివేదిక సమర్పించింది. కాని మన పార్లమెంట్‌లో ఇలాంటి కమిటీని నియమించాలన్న ఆలోచనే రాలేదు.


పనామా పత్రాలపై ప్రకటనలు చేయడమే వాటిలో పేర్లు ఉన్న వ్యక్తులపై చర్యలు తీసుకోని ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇదే అంతర్జాతీయ పరిశోధక జర్నలిస్టుల కన్సార్టియమ్ వెల్లడించిన మరిన్నిసంచలనాత్మక కథనాలపై చర్యలు తీసుకుంటుందని ఊహించలేము. పనామా పేపర్లు కేవలం ఒక లాకంపెనీ ద్వారా లీక్ అయన పత్రాల ఆధారంగా బయటపడితే, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ క్లయింట్లకు సేవలందించే 14 గ్లోబల్ కార్పొరేట్ కంపెనీల పత్రాల ఆధారంగా పండోరా పేపర్ల పేరుతో మరిన్నిరహస్యాలు బయటపడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 29 వేలమంది వ్యక్తులు పన్ను ఎగవేతకు స్వర్గధామాలుగా మారిన దేశాల్లో ట్రస్టులు లేదా కంపెనీలు ఏర్పరిచారు. వాటిపని నల్లధనాన్ని తెల్లధనంగా మార్చడమే.వీరిలో భారతీయ సంతతికి చెందిన 380 మంది వ్యక్తులు ఉండగా, వారిలో 60 మంది అత్యంత ప్రముఖులు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీతో పాటు అనేకమంది వ్యాపారులు కూడా వారిలో ఉన్నారు. అనిల్ అంబానీకి పలు దేశాల్లో పదివేల కోట్ల మేరకు పెట్టుబడులు ఉన్నాయని పండోరా పత్రాలు వెల్లడించాయి. ఈయన తాను దివాళా తీశానని, తనకు విదేశాల్లో డబ్బులు లేవని గతంలో లండన్ కోర్టులో వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు రూ.14 వేల కోట్లను ఎగవేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ సోదరి పూర్వీ మోడీ పేరు కూడా ఈ పత్రాల్లో ఉన్నది. భారత్ నుంచి పరారయ్యేందుకు కొద్ది రోజుల ముందే నీరవ్ మోడీ ఆమె పేరుతో వర్జిన్ ఐలాండ్స్‌లో కంపెనీని తెరిచి దానికి రూ.1800 కోట్లు మళ్లించారని పండోరా పత్రాలు వెల్లడించాయి. కొద్ది రోజుల ముందే మన ఏజెన్సీలు దేశంలో రూ.17 కోట్ల ఆస్తులను జప్తు చేసి పూర్వీ మోదీకి మొత్తం వ్యవహారం నుంచి విముక్తి కల్పించారు. ఆమెకు నీరవ్ మోదీతో ఏ మాత్రం సంబంధం లేదని ప్రకటించారు. మరి తాజా పత్రాల వెల్లడి తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఎప్పటిలాగా మరో బహుళ ఏజెన్సీల కమిటీ వేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, తాజా ఆరోపణలను తీవ్రంగా విచారిస్తామని నల్లధనంపై విచారిస్తున్న సుప్రీంకోర్టు కమిటీ ప్రకటించింది.


గత ఏడేళ్లుగా మన దేశంలో పన్నులు ఎగవేసిన వారు,బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగవేసిన వారు విదేశాలకు తమ డబ్బులు తరలిస్తూనే ఉన్నారని, ప్రధానమంత్రి పదవిలో మోదీ ఉన్నా,మరెవరు ఉన్నావారి కార్యకలాపాలు ఆగవని పండోరా పత్రాలు వెల్లడించాయి. ఇప్పటికే వారు దోచుకున్నది చాలదన్నట్లు కార్పొరేట్లకు అన్నీకట్టబెట్టేందుకు, ప్రభుత్వ ఆస్తులను సైతం కూడా ధారాదత్తం చేసే ప్రభుత్వ హయాంలో కట్టలు కట్టలు ఛార్జిషీట్లు నమోదు చేయడం తప్ప సిబిఐ,ఈడీ లాంటి ఏజెన్సీలు ఏమీ చేయగల స్థితిలో ఉండవు. ఏళ్ల తరబడి కేసులు కోర్టుల్లో నడుస్తూనే ఉంటాయి. నేరస్థులు విదేశాలకు పారిపోయో,స్వదేశంలో అధికార పక్షంతో మిలాఖత్ అయి అధికారాన్ని అనుభవిస్తూ తప్పించుకుంటూనే ఉంటారు. జైలుకు తాత్కాలికంగా వెళ్లినా విలాసవంతమైన జీవితం అనుభవిస్తూ ఉంటారు. సంపద సృష్టించేవారిని గౌరవించాలని ధర్మసూత్రాలు చెప్పే ప్రభుత్వానికి సంపదను కొల్లగొట్టి విదేశాలకు తరలించేవారిని నెత్తికెక్కించుకుంటున్నామన్న స్పృహ ఉండదు. మనదేశంలో కొల్లగొట్టిన మొత్తాన్నే విదేశాలకు మళ్లించి సూట్‌కేస్ కంపెనీల ద్వారా మళ్లీ తమ కంపెనీలకే తరలించిన వారు కళ్లముందు కనపడుతున్నా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం తొందరపడదు. ప్రభుత్వానికి అధికారం ప్రధానం. ఆ అధికారాన్ని నిలబెట్టేందుకు దోహదం చేసే శక్తులు పనామా పేపర్లలో కనపడితేనేం, పండోరా పేపర్లలో కనపడితేనేం, తేడా ఏముంటుంది? వాల్మీకి రామాయణంలో ‘ధర్మో రక్షతి రక్షితః’ అన్నారు. అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనను రక్షిస్తుందని తాత్పర్యం. కాని రాముడికి గుడి కట్టి ధర్మాన్ని మరిచిపోయే ఆధునిక కాలంలో సరిపోయే సూక్తి- అధర్మో రక్షతి రక్షితః అని మన నేతలకు బాగా తెలుసు.

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి