Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 09:25AM

TN: మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు అపూర్వ స్పందన

15 లక్షల మందికి టీకాలు

రాత్రి 8-30 గంటల వరకు కొనసాగిన శిబిరాలు


చెన్నై(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన రెండో విడత మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక చర్యలలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. ఒకే రోజు 20 లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకుని ఈ నెల 12న రాష్ట్రమంతటా ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు 40వేల టీకాల శిబిరాలను నిర్వహించింది. ఊహించనివిధంగా శిబిరాలకు విపరీతంగా ప్రజలు తరలిరావటంతో టీకాల శిబిరాలు రాత్రి 8.30 గంటల వరకు కొనసాగాయి. ఆ రోజున 28.91 లక్షలమందికి టీకాలు వేసి రాష్ట్ర ప్రభుత్వం రికార్డు నెలకొల్పింది.


మొదటిసారిగా నిర్వహించిన మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతం కావటంతో ఆదివారం రెండో మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది. చెన్నైలో 1600 చోట్ల టీకాల శిబిరాలను గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ నిర్వహించింది. ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల వరకు 15లక్షల మందికి టీకాలు వేయాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. ఆదివారం మధ్యాహ్నానికే పది లక్షల మందికిపైగా టీకాలు వేసుకున్నారని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. ఈ మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను పొల్లాచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయన ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3.97 కోట్ల మందికి ప్రభుత్వ శిబిరాల ద్వారా టీకాలు వేశారు. ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా 23.74 లక్షలమందికి టీకాలు వేశారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా టీకాలు వేసుకున్నవారి సంఖ్య నాలుగు కోట్లకు చేరింది. వీరిలో 1.90కోట్ల మంది దివ్యాంగులు, 2224 మంది నిర్వాసితులు, 1554 మది మానసికరోగులు కూడా ఉన్నారు.


ఇప్పటివరకు 3.26లక్షలమందికి మొదటి డోసు టీకాలు, 94 లక్షలమందికి రెండో డోసు టీకాలు వేశారు. ఆదివారం ఉదయం నుంచి చెన్నై నగరంలో టీకాల శిబిరాల వద్ద స్థానికులు బారులు తీరారు. ప్రధాన కూడళ్లలో పెద్ద పెద్ద గొడుగుల నీడన ఆరోగ్య కార్యకర్తలు నగరవాసులు టీకాలు వేశారు. టి.నగర్‌, తేనాంపేట, రాయపేట, మైలాపూరు, ట్రిప్లికేన్‌, అడయార్‌, తాంబరం, ఆవడి తదితర ప్రాంతాల్లో టీకాల శిబిరాల వద్ద ఉదయం నుంచే రద్దీ అధికమైంది. సెంట్రల్‌ స్టేషన్‌లోనూ ఆరోగ్యశాఖ కార్యకర్తలు ప్రయాణికులకు టీకాలు వేశారు. నగరంలోని బస్టాండ్ల వద్ద కూడా టీకాల శిబిరాలు నిర్వహించారు. 


స్టాలిన్‌ పరిశీలన

స్థానిక సైదాపేట, ఈకాట్టుతాంగళ్‌ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న టీకాల శిబిరాలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ పరిశీలించారు. సైదాపేట తాండర్‌నగర్‌ సామాజిక కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల శిబిరాన్ని ఆయన పరిశీలించారు. టీకాలు వేసుకునేందుకు వచ్చిన స్థానికులను పలకరించారు. టీకాలు వేసుకోవడం వల్ల ఏవైనా సమస్యలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈకాట్టుతాంగళ్‌లోని కార్పొరేషన్‌ స్కూలులో నిర్వహిస్తున్న టీకాల శిబిరాన్ని కూడా ఆయన పరిశీలించారు. ముఖ్యమంత్రితోపాటు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ (రెవెన్యూ విభాగం) విష్ణుమహాజన్‌ టీకాల శిబిరాలను పరిశీలించారు.


అడయార్‌లో సీఎస్‌

అడయార్‌ జోన్‌ గ్రీన్‌వేస్‌ రోడ్డులోని సమగ్ర శిశుఅభివృద్ధి కేంద్రంలో నిర్వహిస్తున్న టీకాల శిబిరాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వి. ఇరై అన్బు పరిశీలించారు. ఆయనతోపాటు గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ గగన్‌దీప్‌ సింగ్‌ బేదీ, డిప్యూటీ కమిషనర్లు డాక్టర్‌  ఎస్‌. మనీష్‌, విష్ణుమహాజన్‌, సిమ్రన్‌జిత్‌ సింగ్‌ కోహ్లాన్‌, మైలాపూరు శాసనసభ్యుడు డి. వేలు తదితరులు శిబిరాన్ని వున్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement