Abn logo
Jun 19 2021 @ 21:19PM

చర్చలకు రావాలంటూ కశ్మీరీ నేతలను అధికారికంగా ఆహ్వానించిన కేంద్రం

న్యూఢిల్లీ : జమ్మూ కశ్మీర్‌లో రాజకీయ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 24 న చర్చలకు రావాలని జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పార్టీల నేతలను ఢిల్లీకి ఆహ్వానించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కశ్మీరీ నేతలైన ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీకి ఫోన్ చేశారు. వీరితో పాటు మరో 12 మంది నేతలను కూడా చర్చలకు ఆహ్వానించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. అయితే వీరందరూ వచ్చేటపుడు కచ్చితంగా కరోనా నెగెటివ్ రిపోర్టులను కూడా తీసుకురావాలని హోంశాఖ కోరింది. ఈ నెల 24 న మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. 

మాకు ఫోన్లు వచ్చాయి : ప్రకటించిన నేతలు

చర్చలకు రావాలంటూ కేంద్రం నుంచి తమకు ఫోన్లు వచ్చాయని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా ధ్రువీకరించారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చైర్మన్ మెహబూబా ముఫ్తీ కూడా స్పందించారు. చర్చలకు రావాలంటూ తమకు కేంద్రం నుంచి ఫోన్ వచ్చిందని ధ్రువీకరించారు. అయితే సమావేశంలో పాల్గొనాలా? వద్దా? అన్నది నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్ నేతలకు కూడా కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఫోన్ చేసి, చర్చలకు ఆహ్వానించారు.