Abn logo
Dec 1 2020 @ 23:58PM

తోటలు కూల్చేయ్‌...ప్లాట్లు వేసెయ్‌

కవిటి కొబ్బరి తోటలో ప్లాట్లకు సిద్ధం చేస్తున్న దృశ్యం


ఉద్దానంలో అడ్డగోలుగా లేఅవుట్లు!

పుట్టగొడుగుల్లా వెంచర్లు 

 పచ్చని భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం

కొన్నింటికే అనుమతులు

కానరాని నిబంధనలు

కొనుగోలుదారులకు ఇబ్బందులు

దందాకు తెరతీస్తున్న దళారులు


(కవిటి)

పట్టణాల నుంచి పల్లెల వరకూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం విస్తరిస్తోంది. పుట్టగొడుగుల్లా లేఅవుట్లు వెలుస్తున్నాయి. పచ్చని పొలాలు, కొబ్బరి, జీడి, మామిడి తోటలు ప్లాట్లుగా మారుతున్నాయి. కనీస నిబంధనలు పాటించకుండా వెంచర్లు వేస్తున్నారు. ప్రచార ఆర్భాటంతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్లాట్లను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఇదంతా నిబంధనలకు విరుద్ధంగా. ముఖ్యంగా ఉద్దానంలోని కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో లేఅవుట్ల ముసుగులో దందా సాగిపోతోంది. కవిటి మండలం బొర్రపుట్టుగ, గొండ్యాలపుట్టుగ, జగతి, రాజపురం, మాణిక్యపురం, ప్రగడపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం ధర్మపురం, ఈదుపురం, బూర్జపాడు, హరిపురంలో రోజుకో లేఅవుట్‌ పుట్టుకొస్తోంది. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో దాదాపు 100 లేఅవుట్లు వెలిశాయి. కానీ ఒక్కదానికీ అనుమతులున్న దాఖలాలు లేవు. ఎవరూ నిబంధనలు పాటించడం లేదు. 


‘మూరెడు’ మోసం

కొలతల్లో కూడా కనీస ప్రమాణాలు పాటించడం లేదు. సాధారణంగా సెంట్లు, గజాలు, అడుగులు ప్రామాణికంగా కొలతలు వేస్తారు. కానీ ఈ ప్రాంతంలో మూరెల పేరిట కొలతలు వేసి విక్రయిస్తున్నారు. మూరెల లెక్కల్లో ధరలు నిర్ణయిస్తారు. అసలు వ్యాపారులు ఒకరైతే.. దళారులు కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. భూమి ఎంపిక, ధర నిర్ణయం, కొలతలు, రిజిస్ట్రేషన్‌, వివాదాల పరిష్కారం వంటివి వారి కనుసన్నల్లోనే జరిగిపోతున్నాయి. ముందుగా గ్రామాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర దేశాల్లో పనిచేసే యువకులు, ఆర్థికంగా స్థితిమంతులను గుర్తిస్తారు. రకరకాల మాయమాటలు చెప్పి ప్లాట్లను అంటగడుతున్నారు. ఇందుకుగాను వ్యాపారులు కమీషన్‌ రూపంలో భారీగా దళారులకు చెల్లిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేస్తున్న వ్యక్తులు... ఇళ్ల నిర్మాణ సమయంలో అనుమతుల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఏ లేఅవుట్‌లోనూ కాలువలకు... సామాజిక అవసరాలకు వ్యాపారులు స్థలాలు వదలడం లేదు. కేవలం తమ స్థలం మధ్యలో కొంత మట్టిపోసి...అదే రోడ్డుగా నమ్మించి అమ్మకాలకు దిగిపోతున్నారు. 


కనీస నిబంధనలేవీ?

లేఅవుట్లు వేయాలంటే ముందుగా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చాలి. ఇందుకుగాను ఆర్డీవోకు దరఖాస్తు చేసుకోవాలి. స్థానిక మార్కెట్‌ విలువను బట్టి 3 శాతం పన్ను చెల్లించాలి. లేఅవుట్‌లో 10 శాతం స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలి. పార్కింగ్‌ స్థలాన్ని విడిచిపెట్టి లేఅవుట్‌ వేయాలి. 32 అడుగుల వెడల్పుతో రోడ్డు నిర్మించాలి. కాలువ నిర్మాణానికి స్థలం కేటాయించాలి. నాలా పన్ను, పంచాయతీ అనుమతులు పొందిన తరువాత లేఅవుట్‌ నిర్మాణ పనులను ప్రారంభించాలి. కానీ ఎక్కడా కనీస నిబంధనలు పాటించడం లేదని తెలుస్తోంది.  కొనుగోలుదారులు అవగాహన లేక వ్యాపారులు, దళారుల మాయమాటలు నమ్మి కొనుగోలు చేస్తున్నారు. తీరా ఇళ్ల నిర్మాణం చేపట్టిన తరువాత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు రుణంతో పాటు పంచాయతీ కల్పించే మౌలిక వసతుల విషయంలో చుక్కెదురవుతోంది. నాలా పన్ను, ప్రత్యేక అనుమతుల పన్ను, లింకు దస్తావేజులు లాంటివేవీ లేకపోడంతో నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. చివరకు అపరాధ రుసుం చెల్లించాల్సి వస్తోంది. 


నిద్దరోతున్న యంత్రాంగం

కళ్ల ముందే అక్రమంగా లేఅవుట్లు వెలుస్తున్నా... భారీగా విక్రయాలు జరిగిపోతున్నా అధికారులకు పట్టడం లేదు. అధికార యంత్రాంగం తీరు విమర్శలకు తావిస్తోంది. రియల్‌ ఎస్టేట్‌ గొలుసు వ్యాపారంగా మారుతున్నా నియంత్రించాల్సిన యంత్రాంగం నిద్దరోతోంది. వ్యాపారులు, దళారుల దందా సాగుతున్నా అటువైపు చూడకపోవడంతో సామాన్యులు నిలువునా మోసపోతున్నారు. గతంలో రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరతను సాకుగా చూపేవారు. ప్రస్తుతం సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. అన్ని శాఖలకు సహాయ కార్యదర్శులు నియమితులయ్యారు. వారితో అక్రమ లేఅవుట్లను గుర్తించవచ్చు. కానీ అటువంటి ప్రయత్నం జరగడం లేదు. ఎక్కడైనా లేఅవుట్లు వేస్తే అవి సక్రమమా లేదా అన్నది రెవెన్యూ కార్యదర్శి పరిశీలించాలి. సక్రమంగా లేవని తేలితే నోటీసులు జారీ చేయాలి. లేకుంటే సంబంధిత వ్యక్తులు, సర్వే నంబర్ల వివరాలను జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అధికారికి అందించాలి. అక్రమంగా ఉన్నట్టు తేలితే డ్యాష్‌ బోర్డులో పెట్టి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు.   


అక్రమ లేఅవుట్లను గుర్తించాలి

గ్రామస్థాయిలో అక్రమ లేఅవుట్లను సిబ్బంది గుర్తించాలి. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠినచర్యలకు ఉపక్రమించాలి. ముందుగా వారికి నోటీసులు జారీచేయాలి. వారి సమగ్ర వివరాలు అందిస్తే డ్యాష్‌ బోర్డులో పెడతాం. తద్వారా అక్రమ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు అడ్డుకట్ట పడుతుంది. 

- నాయుడు, జిల్లా టౌన్‌ ప్లానింగ్‌ అధికారి


అనుమతులు తప్పనిసరి

లేఅవుట్లకు అనుమతులు తప్పనిసరి. వ్యవసాయ భూములను వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించేటప్పుడు అనుమతులు తప్పకుండా తీసుకోవాలి. లేఅవుట్లు వేసినపుడు ఆ ప్రాంతాల్లో మార్కెట్‌ ధరకు అనుగుణంగా మూడు శాతం పన్ను చెల్లించాలి. మండలంలో లేఅవుట్లపై దృష్టి సారిస్తాం. అక్రమమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం.

-వి.విజయ్‌కుమార్‌, తహసీల్దారు, కవిటి
Advertisement
Advertisement
Advertisement