Abn logo
Sep 21 2021 @ 11:42AM

రెండేళ్ల బాలికకు అరుదైన రక్త రుగ్మత

             - ఎముక మజ్జ దానం చేసిన తండ్రి


చెన్నై: తల్లిపేగు తెంచుకుని బిడ్డ జన్మించడం సహజం. అయితే ఏపీకి చెందిన ఓ చిన్నారి తండ్రి ఎముకను పంచుకుని మరుజన్మ ఎత్తింది. ఇందుకు నగరంలోని రేలా ఆస్పత్రి వేదికైంది. వివరాలిలా వున్నాయి.. అరుదైన రక్త రుగ్మతతో బాధ పడుతున్న ఏపీకి చెందిన రెండేళ్ల బాలికకు ఆమె తండ్రి ఎముక మజ్జ దానం చేసి కాపాడుకున్నాడు. ఈ ఎముక మజ్జ మార్పిడిని నగరంలోని రేలా ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఏపీకి చెందిన ఏలూరి ఆద్య అనే చిన్నారి ‘తలసేమియా’ అనే వ్యాధితో చాలాకాలంగా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. ఆరు నెలల ప్రాయం నుంచే ఆమె ఈ సమస్యలు ఎదుర్కొంటోంది. విజయవాడలోని సప్నా ఫౌండేషన్‌ సూచనల మేరకు ఆమె తల్లిదండ్రులు రేలా ఆస్పత్రిని సంప్రదించారు. ఎముక మజ్జ మార్పిడి మాత్రమే ఆమెకు నివారణ చికిత్స అని నిర్ధారించిన వైద్యులు ఆ మేరకు, ఆ బాలిక తండ్రి నుంచి సేకరించిన ఎముక మజ్జను మార్పిడి చేశారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల మేరకు రేలా ఆస్పత్రితో పాటు పలు సంస్థలు కూడా సాయం చేశాయి. ప్రస్తుతం తండ్రీబిడ్డ క్షేమంగా వున్నారని ఆస్పత్రి సీనియర్‌ కన్సల్టెంట్‌, క్లినియకల్‌ హెమటో అంకాలజీ డాక్టర్‌ దీనదయాళన్‌ తదితరులు తెలిపారు.