Abn logo
Apr 22 2021 @ 05:06AM

ఎస్వీబీసీలో మరో ఇద్దరు ఉద్యోగుల తొలగింపు

  • పోర్న్‌ లింక్‌ కేసులో ఒకరు, ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో మరొకరు

తిరుమల, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): టీటీడీ  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ)లో మరో ఇద్దరు ఉద్యోగులను తొలగించారు. ఎస్వీబీసీ ఛానల్‌లో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమ వివరాల కోసం వెంకటకృష్ణ అనే భక్తుడు గతేడాది నవంబరులో ఛానల్‌కు మెయిల్‌ చేశారు. అయితే ఆ మెయిల్‌కు కార్యక్రమ వివరాలు పంపాల్సిన ఛానల్‌ ఉద్యోగులు దానికి బదులు నీలి చిత్రాలకు సంబంధించిన పోర్న్‌ సైట్‌ లింక్‌ పంపించారు. దీంతో భక్తుడు     టీటీడీ ఈవోకు గత నవంబరు 6న ఫిర్యాదు చేయగా విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా అప్పట్లోనే ఆరుగురు ఉద్యోగులను ఎస్వీబీసీ యాజమాన్యం తొలగించింది. మరో ముగ్గురు ముఖ్య అధికారుల పాత్రపై  టీటీడీ ఈవో ఈ ఏడాది జనవరి 2న నలుగురు సీనియర్‌ అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ ముగ్గురు అధికారులను ఉద్యోగాల నుంచీ తొలగిస్తూ ఎస్వీబీసీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ క్రమంలో ఎస్వీబీసీలో మేనేజర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసరావు ఆఫీస్‌ కంప్యూటర్‌లో కూడా కొన్ని అసభ్యకర వీడియోలు, ఫొటోలతో పాటు సినిమాలున్నట్టు తేలడంతో అతన్ని విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు టీటీడీ  ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎస్వీబీసీలో ఎడిటర్‌గా విధులు నిర్వహిస్తున్న మిట్టపల్లి రవికిరణ్‌ ఇటీవల ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా వ్యవహారంలో పట్టుబడ్డాడు. పోలీసుల నివేదిక ఆధారంగా అతన్ని కూడా ఎస్వీబీసీ నుంచి తొలగించారు. రవికిరణ్‌పై గతంలో క్రిమినల్‌ కేసులు కూడా ఉన్నట్టు పోలీసుల నివేదికలో పొందుపరిచారు.

Advertisement
Advertisement
Advertisement