Abn logo
Jul 11 2020 @ 05:33AM

పదేళ్ల కిందట నాన్న.. ఇప్పుడు అమ్మ...

ఇంటి పెద్ద దిక్కులను వరుసగా కబళించిన రోడ్డు ప్రమాదాలు

శుక్రవారం ఉలవపాడులో  ఆర్టీసీ బస్‌ ఢీకొని మహిళ మృతి

అనాథలైన ఇద్దరు పిల్లలు


భర్త పదేళ్ల కిందటే చనిపోయాడు.. పిల్లలు ఇద్దరూ చిన్నోళ్లు.. ఆమెకు చుట్టూ శూన్యం అనిపించింది.. భవిష్యత్తు తలుచుకుంటేనే కన్నీళ్లు పొంగుతున్నాయి. అయినా సరే కుంగిపోలేదు.! కొండంత ధైర్యాన్ని గుండెల్లో నింపుకుంది. రెక్కలను ముక్కలు చేసుకుంది. ఇద్దరి పిల్లలను ఎక్కదీసింది. చదువులు చెప్పిస్తుంది. ఇంకో రెండుమూడేళ్లు గడిస్తే ఇద్దరు పిల్లలు జీవితంలో కుదురుకుని తనకు చేదోడుగా నిలుస్తారనుకున్న తరుణంలో విధి ఆమెపై కర్కశంగా పగబట్టింది. రోడ్డు ప్రమాద రూపంలో నిలువునా బలితీసుకుంది. కొడుకు, కుమార్తెను దిక్కులేని వారిని చేసి వెళ్లిపోయింది. ఇప్పుడు వారికి నా అనే వారు లేక పొగిలిపొగిలి ఏడుస్తున్నారు.


ఉలవపాడు, జులై 10 : రోడ్డు దాటే క్రమంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన ఉలవపాడు జాతీయ రహదారిపై శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకా రం.. మన్నేటికోట(ఉత్తరం) గ్రామానికి చెందిన చిమ్మిరి మాధవి(43) తన కుమార్తె వైష్ణవితో కలి సి ఉలవపాడుకు బ్యాంకు పనిపై వచ్చారు. మన్నేటికోటలో కంటైన్‌మెంటు ఆంక్షలు అమలులో ఉన్నందున ఆటోల రాకపోకలు ఆగిపోయాయి. దీంతో తల్లీకూతుళ్లు కాలినడకన గ్రామానికి చేరుకునేందుకు ఉత్తర బైపాస్‌ అడ్డరోడ్డు దాటబోయారు. ఆ సమయంలోనే విజయవాడ నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు మాధవిని ఢీకొట్టింది.


క్షతగాత్రురాలిని స్థానిక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. కళ్ల ముందే కన్న తల్లి చనిపోవడంతో ఇరవై ఏళ్ల కుమార్తె వైష్ఠవి నిశ్చేష్టురాలైంది. బోరున విలపించింది. మాధవికి కుమా ర్తెతో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. తండ్రి చనిపోయి తల్లి సంరక్షణలో పెరుగుతున్న ఆ ఇద్దరు పిల్లలకు ఇప్పుడు తల్లిని కూడా మృత్యువు కబళించడం హృదయ విషాదకరం. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ దేవకుమార్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement