Abn logo
Jul 16 2021 @ 12:28PM

HYD : బ్యాంకు నుంచి 1.97 కోట్లు సొమ్ము కొట్టేసిన నైజీరియన్లు.. అరెస్ట్

హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ స్టేట్‌ కో ఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంకు ఖాతా నుంచి రూ. 1.97 కోట్లు మాయమైన ఘటనలో ఇద్దరు నిందితులను సీసీఎస్‌ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 14న బ్యాంక్‌ (ట్రూప్‌బజార్‌) డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ శెట్టి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. బ్యాంకు లావాదేవీల్లో మోసం జరిగిందని, ఐఎంపీఎస్‌ ద్వారా రూ. 1.97 కోట్లు వేలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారమంతా ఈ నెల 9 నుంచి 13 మధ్యలో జరిగిందని, సైబర్‌ నేరగాళ్లు హ్యాకింగ్‌కు పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. డబ్బంతా సికింద్రాబాద్‌, చందానగర్‌ బ్రాంచిలకు సంబంధించిన ముగ్గురు కస్టమర్ల ఖాతాల ద్వారా దారి మళ్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.


నాలుగు రోజుల వ్యవధిలో 102 ట్రాన్సాక్షన్ల ద్వారా ఇతర కార్పొరేట్‌ బ్యాంకుల ఖాతాల్లోకి చేరాయని వివరిస్తూ ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన సైబర్‌క్రైం పోలీసులు చందానగర్‌కు చెందిన యాసీన్‌బాషా (23), మహమ్మద్‌ రఫీ (22)లను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా... టోలీచౌకీలో నివాసముండే నైజీరియన్‌ 10 శాతం కమీషన్‌ ఇస్తానని చెప్పడంతో బ్యాంకు ఖాతాలు తెరిచినట్లు ఒప్పుకున్నారు. నైజీరియన్‌ మోసగాళ్లు వారి ఖాతాల ద్వారా బ్యాంకు మూలధనంపై గురి పెట్టి రూ. 1.97 కోట్లు కొల్లగొట్టి వారిద్దరి ఖాతాల్లోకి డంప్‌ చేశారు. ఆ తర్వాత వారికి 10 శాతం కమీషన్‌ ఇచ్చి డబ్బును తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. అసలు నిందితులు తప్పించుకోగా, అవకాశం కల్పించిన ఇద్దరినీ సైబర్‌క్రైం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.