Abn logo
Apr 26 2020 @ 01:39AM

ఇరవై వసంతాల టీఆర్ఎస్

ఇరవై యేండ్ల క్రింద మొలసిన గులాబీ జెండానే ఇప్పుడు తెలంగాణ ప్రాణం. అణచివేయబడ్డ ప్రజల ఆత్మగౌరవ పతాక. కుట్రల్ని, కుళ్లు రాజకీయాల్ని ఛేదించుకొని ప్రజల అశేషాభిమానాలతో టీఆర్ఎస్ 20వ వసంతంలోకి చేరుకుంది. తెలంగాణలోని ప్రతి గుండెకి, ప్రతి గడపకి కొత్త పండగను తీసుకువచ్చింది.


రాజకీయ, ఆర్ధిక బలహీనతలు లేని నేత కేసిఆర్. ఆయన బలహీనతల్లా ప్రజలకు మంచి చేయాలని, నా తెలంగాణ జాతి తలెత్తుకు నిలబడాలన్నదే. ఈ బలహీనతే కేసిఆర్‌ను బలవంతున్ని చేసింది.


యుద్ధవిజేతల కంటే హృదయ విజేతలు గొప్పవారని   చరిత్ర తెలిసిన విజ్ఞులు అంటారు. కానీ, తెలంగాణ రాష్ట్ర సమితి సంస్థాపకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ‘యుద్ధ’ విజేతే కాదు, హృదయ విజేత కూడా. విశేషమేమిటంటే ఈ రెండు విజయాలనూ కేసిఆర్ ఒకేసారి సాధించారు. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షను ఆవిష్కరించడమే కాదు, వచ్చిన స్వరాష్ట్రాన్ని సురాష్ట్రంగా కేసీఆర్ మలిచారు. ఇన్నేండ్లు కలలు కన్న తెలంగాణ ఇదే కదా అనిపించేలా అబ్బురపరిచే పరిపాలనను ఆయన అందిస్తున్నారు. ఆనాడు విడిపోతే చెడిపోతరని విష ప్రచారం చేసిన గొంతులతోనే విడిపోయి బాగుపడ్డారని ప్రశంసలు అందుకుంటున్నం. ఇదంతా ఒక్క కేసిఆర్ వల్లే సాధ్యమయిందనడం సత్య దూరం కాదు.


భారత దేశ రాజకీయాలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఓ ప్రభంజనం. దేశ స్వాతంత్ర్య పోరాటం చూసిన తరానికి ఆ స్థాయి పోరాటం తెలంగాణ ఉద్యమం. అంతే ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా సాగి, లక్ష్యాన్ని సాధించిన పోరాటమిది. దీనికి జీవం పోసింది టీఆర్ఎస్ పార్టీ. అప్పటివరకు ‘తెలంగాణ నినాదం’ నాయకులకు పదవులనిచ్చింది కానీ ప్రజలకు మాత్రం ఓదార్పునివ్వలేదు. సీమాంధ్ర నాయకుల దుర్మార్గాలు పతాక స్థాయికి చేరాయి. తెలంగాణ సొమ్ములన్నీ సీమాంధ్ర అభివృద్ధికి కేటాయిస్తూ తెలంగాణను బొందల గడ్డగా చేస్తున్న సమయం. బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అన్నట్టుగా తయారైన తెలంగాణ బిడ్డలపై ధరల భారం మోపుతున్న సందర్భం, నిలదీసి అడిగితే లాఠీలతో వాయించి, గుర్రాలతో తొక్కిస్తున్న సీమాంధ్ర అహంకారం. మాటింటే కడుపునిండినట్టు అనిపించే కమ్మనైన తెలంగాణ భాష, యాసపై పరాయిల కీచక క్రౌర్యం, ఎక్కడ


బోయిన ద్వితీయశ్రేణి పౌరులుగా తెలంగాణ బిడ్డల నిర్వేదం.. ఇన్ని ఇబ్బందుల నడుమ, ఇంతమంది బిడ్డల కష్టాలు, కన్నీళ్లు తుడిచేందుకు, తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని నిలబెట్టేందుకు, స్వరాష్ట్రాన్ని సాధించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించింది.


2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవం జరిగిన ఇరవై రోజులకు కేసీఆర్ కరీంనగర్‌లో నిర్వహించిన సింహగర్జన సభ ‘నభూతో నభవిష్యతి’ అన్నట్టుగా జరిగింది. వేలాది వాహనాలతో హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేసిఆర్ వాహనశ్రేణికి రహదారి వెంట తెలంగాణ బిడ్డలంతా హారతులు పట్టి పూలవర్షం కురిపించిన్రు. మమ్మల్ని నిలబెట్టడానికి వచ్చిన వీరునిగా కేసిఆర్‌ను ప్రజలంతా భావించి ఆదరించిన్రు. కోల్పోయిన నమ్మకంలోనే కొత్తదారి వెతుక్కోవాలని భావించిన తెలంగాణ బిడ్డల ఆకాంక్షలకు అద్దంపట్టినట్టు ‘ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా తెలంగాణ సాధిస్తనని’ నిండు సభలో కేసీఆర్ ప్రకటించిండు. రాజకీయ ఉద్యమంతోనే తెలంగాణ సాధిస్తనని విపులీకరించిండు. ‘తెలంగాణ సాధన లక్ష్యం నుంచి నేను పక్కకు తప్పుకుంటే రాళ్ళతో కొట్టి చంపండి’ అంటూ గత నాయకుల మోసాల జ్ఞాపకాలను చెరిపేసిండు. అన్నట్టుగానే ఉద్యమానికి కొత్తదారి వేసిండు. ఈ సభ మాత్రమే కాదు ఆ తరువాత జరిగిన వరంగల్ సభ, సిద్దిపేట ఉద్యోగ గర్జన, అనేక ఇతర సభలు, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన ప్రగతి నివేదన సభలు ఈ దేశంలోని రాజకీయ పార్టీలన్నింటి ప్రచార పంథాను మార్చేసినయి. 


టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేసింది. ‘ఇప్పటి వరకు ఒక లెక్కా.. ఇప్పటి నుంచి ఒక లెక్కా, కేసిఆర్ వచ్చిండని చెప్పు’ అన్నట్టు అప్పటి వరకు చిత్తుబొత్తు రాజకీయాలు, చీకటి లెక్కలు చేస్తున్న కాంగ్రెస్-, టీడీపీ పార్టీల బండారాల్ని బట్టబయలు చేసిండు. తలాపున గోదారి పారుతది – తెల్లారితే మన బతుకు ఎందుకు ఎడారి కావాలంటూ.. ప్రజల్లో ఆలోచనా బీజాలను నాటిండు. నీళ్లు, నిధులు, నియామకాలు మనయి – సోకులు ఆంధ్రోల్లకా అంటూ ప్రశ్నల బాణాల్ని ఎక్కుపెట్టిండు. తెలంగాణవాలే జాగో – ఆంధ్ర దోపిడిదారులారా బాగో అంటూ కన్నెర్ర జేసిండు. అంతేకాదు, అమాయకులైన సీమాంధ్ర సామాన్య జనంతో కాదు– తెలంగాణను దోపిడి చేస్తున్న రాజకీయ నాయకులతోనే మా పోరాటం అని స్పష్టంగా విశదీకరించిండు. తెలంగాణ పోరాటానికి స్పష్టమైన మార్గం వేసిండు.


ఇక పార్టీ పురుడుపోసుకున్న కొన్ని రోజుల్లోనే వచ్చిన స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్ సత్తా చాటింది. రాజకీయ వ్యూహకర్తలకు అంతుబట్టని స్థాయిలో సీట్లు గెలుచుకున్నది. నిజామాబాద్, కరీంనగర్ జిల్లా పరిషత్‌లను సింపుల్‌గా కైవసం చేసుకున్నది. ఇదే ఊపులో పది జిల్లాల్లో సభలు సమావేశాలతో పార్టీని ఉరకలెత్తించిండు. రాజకీయంగా టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని భావించిన ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో సరుకుల్లా కొని టీఆర్ఎస్ పై ఉసిగొల్పిండు. నాటి కాంగ్రెస్ మంత్రి యం.సత్యనారయణ రావు టీఆర్ఎస్ పై అవాకులు, చెవాకులు పేలి కరీంనగర్ ఉప ఎన్నికకు కారకుడయ్యిండు. ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి సామ భేద దాన దండోపాయలు పన్నినా, వందల కోట్లు కుమ్మరించినా ప్రజలు కేసిఆర్ కు బ్రహ్మరథం పట్టిన్రు. రెండు లక్షలకు పైచిలుకు మెజార్టీని అందించిన్రు. అప్పటిదాక కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు రెఫరెండం అన్న వైఎస్ తరువాత తోకముడిచిన సందర్భం చరిత్ర చెరిపేసినా సమసిపోయేది కాదు. ఇలా ఒక్క ఉప ఎన్నిక అని కాదు.. తెలంగాణపై విషం చిమ్మిన ప్రతిసారీ ఉపఎన్నికలకు దిగి ఉద్యమబావుటాను ఎగరేసిండు. ఇక తెలంగాణ వచ్చుడో – కేసిఆర్ సచ్చుడో అన్న మాటకు కట్టుబడి నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రభుత్వ నిర్భంధాన్ని తట్టుకొని పదకొండు రోజులపాటు చేసిన దీక్ష చరిత్ర పుటాల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఈ పరంపరను, కేసిఆర్ నిబద్ధతకు తలొగ్గి యూపీఏ -2 ప్రభుత్వం, డిసెంబర్ 9, 2009న తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేసింది. కానీ సీమాంధ్ర నాయకుల కుట్రలకు భయపడి కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్లింది. అయినా కేసిఆర్ వెనక్కి తగ్గలేదు. 2014 లో తెలంగాణను సాధించేదాక వదిలిపెట్టలేదు. ప్రణబ్ ముఖర్జీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ ఇలా ఎన్ని కమిటీలు వేసినా తెలంగాణ గోసను వినిపించి కాంగ్రెస్ మత్తు వదిలించిండు కేసిఆర్. ఇక కేసిఆర్ అల్లిన ఈ పద్మవ్యూహం నుంచి బయట పడలేమని భావించిన కాంగ్రెస్ తెలంగాణను ప్రకటించింది. ఇదంతా కేసిఆర్ మస్తిష్కం లో సంవత్సరాలపాటు అల్లుకున్న వ్యూహానికి దక్కిన ఫలితం. తెలంగాణ సమస్యలపై ఎంతో నాలెడ్జ్ ఉంటే తప్పా రాబందుల లాంటి నాయకులను తట్టుకొని తెలంగాణను సాధించేవారు కాదు. తెలంగాణ సాధన అనే లక్ష్యం మినహా మదిలో మరో ఆలోచన లేకుండా నిరంతరం తపించకపోయివున్నట్టయితే 1969 రిపీట్ అయ్యేదే. కానీ, రాజకీయ, ఆర్ధిక బలహీనతలు లేని నేత కేసిఆర్. ఆయన బలహీనతల్లా ప్రజలకు మంచి చేయాలని, నా తెలంగాణ జాతి తలెత్తుకు నిలబడాలన్నదే. ఈ బలహీనతే కేసిఆర్‌ను బలవంతున్ని చేసింది. బీళ్లుపడ్డ తెలంగాణ నేలపై పచ్చని పరదా కప్పాలి, నెర్రెలు బారిన నేలల్లో గోదారి, కృష్ణమ్మతో గొంతు తడపాలి, పన్నుల రూపంలో తెలంగాణ బిడ్డలు కడుతున్న ప్రతీపైస తెలంగాణ తల్లి గోస తీర్చాలి.. ఇదే కేసిఆర్ ఆశ, ఆశయం. అందుకే ఇయ్యాల దేశం ముందు తెలంగాణ సగర్వంగా తలెత్తుకు నిలబడింది.


2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచాక ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న ఉదయించింది. అనుకున్న తెలంగాణ తెచ్చిన.. ఇక ఇంతకు మించి ఏం కావాలి అనుకున్న కేసిఆర్‌కు తెలంగాణ పునర్నిర్మాణం పెద్ద సవాల్‌గా నిలిచింది. ఏ పదవి స్వీకరించకుండా తెలంగాణ పునర్నిర్మాణానికి బాటలేయాలని భావించిన కేసిఆర్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు మొదటిసారి వ్యతిరేకించిండ్రు. ఇంత కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఎవ్వరి చేతిలో పెట్టినా కుక్కలు చింపిన విస్తరి అయితదని ఏకరువు పెట్టిండ్రు. తెచ్చిన తెలంగాణను రక్షించమని, నిలబెట్టమని నాయకులు, ప్రజలు నినదించిన్రు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో 2014, జూన్ 2న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేసిఆర్ బ్రహ్మాండమైన సంక్షేమ రాజ్యానికి బాటలేసిండు. బంగారు తెలంగాణ నిర్మాణానికి కూలీ అయి నిరంతరం శ్రమిస్తున్నడు. అందుకే ఇయ్యాల తెలంగాణ అత్యున్నత రాష్ట్రంగా ఎదిగింది.


ఇప్పుడు తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ముక్తకంఠంతో కారుకు, సారూకు చెయ్యెత్తి జైకొడుతుంది జనత. ఇదంతా కేసిఆర్ ఘనత. ఆరోపణలు లేని రాజకీయాలు–ఆశలు లేని రాజకీయ నాయకులను చూడని వ్యవస్థలో నిజాయితీగా, నిబద్ధతగా ప్రజల కోసం పనిచేస్తున్న కేసిఆర్ ఓ మేరు నగధీరుడు. వేలాది సాధారణ కార్యకర్తలను ప్రజా నాయకులుగా తీర్చిదిద్దిన రాజకీయ గురువు. మహామహులనుకునే రాజకీయ నాయకులను సైతం సామాన్య కార్యకర్తలతో మట్టి కరిపించిన రాజకీయ దళపతి. ఇన్ని ఉన్నా ప్రజల దగ్గరికి వచ్చేసరికి పసిపాపలా మారిపోయి, వాళ్ల సంతోషంలో తన చిరునవ్వును వెతుక్కునే మహానుభావుడు. అందుకే తెలంగాణ ప్రజలంతా పిలిస్తే పలికే దేవుడని కొనియాడుతున్నరు. ఏ ఆపద వచ్చినా కేసిఆర్ అనే సూపర్ మ్యాన్ అండగా ఉన్నాడని ధీమాగా బ్రతుకుతున్నరు. ఇరవై యేండ్ల క్రింద మొలసిన గులాబీ జెండానే ఇప్పుడు తెలంగాణ ప్రాణం. అణచివేయబడ్డ ప్రజల ఆత్మగౌరవ పతాక. కుట్రల్ని, కుళ్లు రాజకీయాల్ని ఛేదించుకొని ప్రజల అశేషాభిమానాలతో టీఆర్ఎస్ 20వ వసంతంలోకి చేరుకుంది. తెలంగాణలోని ప్రతి గుండెకి, ప్రతి గడపకి కొత్త పండగను తీసుకువచ్చింది. ఇది కలకాలం కొనసాగాలి. బంగారు తెలంగాణకు బాసటై నిలవాలి.

డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర సమితి

(ఏప్రిల్ 27: టీఆర్ఎస్ ఆవిర్భావదినోత్సవం)

Advertisement
Advertisement
Advertisement