Abn logo
May 15 2020 @ 00:37AM

సత్యానంతర కాలంలో సత్యం

సమూహ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమాజ వనరులను పొదుపుగా ఉపయోగించుకుంటే కష్టనష్టాలను సమష్టిగా ఎదుర్కోవడం సుసాధ్యమవుతుంది. మూహ శ్రేయస్సును విస్మరించి వ్యక్తి ఉన్నతినే లక్ష్యంగా చేసుకుంటే మనుషుల మధ్య సమానతలు పెరుగుతాయి. భయానక కరోనా విలయాన్ని అధిగమించి మానవ నాగరికత మనగలగాలంటే సమూహాలకే ప్రాధాన్యముండాలి. ఇదే 21 వ శతాబ్ది పరమార్థ సత్యం.


మానవ నాగరికతలో సత్యాన్వేషణ చేసిన మొట్టమొదటి దేశం భారత్. భాష్యకారులు, ప్రవచన కారులు, మేధావులు సత్యం గూర్చే మాట్లాడారు. సత్యాన్వేషణను మన సంస్కృతిలో భాగంగానే గుర్తిస్తాం. బౌద్ధులు, శంకరాచార్య తెలిపిన మూడు సత్యాల గురించి తెలిపారు. అవి : పరమ సత్యం, వ్యవహార సత్యం, పరమార్థ సత్యం. నేటి ప్రపంచ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే కొంత తాత్త్విక ఆలోచన ఉండాలి. అక్షర రూపంలో సత్యాలను తెలియజేసే ‘ప్రింట్’ మీడియాను పక్కకు నెట్టి వాస్తవాలతో సంబంధం లేని కథనాలను, భాష్యాలను, ప్రవచనాలను, చర్చలను నిర్వహిస్తున్న సోషల్ మీడియా వచ్చిన తరువాత సత్యం రూపమే మారిపోయింది. అందుకే దీన్ని ‘సత్యానంతర కాలం’ అంటున్నారు.


ఈ సత్యానంతర కాలంలో కొవిడ్- 19 గురించిన సత్యాన్వేషణ ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనల ద్వారా కంటే ట్రంప్, మోదీ, జాన్సన్ వంటి మహాశయుల కథనాల ద్వారానే సాధ్యమవుతోంది! ఇంతకు మునుపు ఇలాంటి ఉపద్రవాలు మనం చూడలేదా? చూశాం. అయితే చాలా అరుదుగా. 1918లో స్పానిష్ ఫ్లూ మూలంగా సుమారు 10 కోట్ల మంది మరణించారు. అయితే, ఇప్పటిలా ప్రపంచమంతా అది విస్తరించలేదు. ఈ కొవిడ్- 19 ద్వారా కొన్ని వాస్తవాలను తెలుసుకుందాం. 


గత శతాబ్దంలో వచ్చిన మార్పుల్లో ప్రధానమైనవి.. మానవులంతా ఒకటే, మానవులందరూ సమానులే అన్న భావోదయాలు. అసమానతలు, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం ద్వారా ఆ మహోన్నత భావాలు ఆచరణలో సుసాధ్యమవుతాయని రష్యాలో 1917లో ప్రారంభమైన విప్లవాత్మక నవ నిర్మాణ ప్రయోగం చాటింది. ఆ మౌలిక కృషి చైనా, వియత్నాం, క్యూబా వంటి మరికొన్ని దేశాలకు విస్తరించింది. అప్పటికే మార్కెట్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలు గల దేశాలు, వలసవాద దోపిడీతో కొవ్విన యూరప్ లోనూ జరిగిన పారిశ్రామిక, విజ్ఞాన పరమైన మార్పులతో ప్రజల్లో చైతన్యమేకాక, అసమానతలు, అమానవీయతలూ ఉన్నాయి. అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి మానవీయ దృక్పథం గల మేధావి వర్గం, పాలకులు కొంత ప్రయత్నం చేశారు. మొదటి నుంచి అమెరికా చరిత్రే వేరు.


నా ఉద్దేశంలో అమెరికా ప్రత్యేక దేశం కాదు. అది యూరప్ కు పొడిగింపే. అందుకే అమెరికాలో నాటి యూరోపియన్ దేశాల ప్రజలు కనిపిస్తారు. అది యూరప్ దేశీయుల మూలంగానే స్వర్గంగా ఉంది. అమెరికా నిర్మించిన ఆర్థిక వ్యవస్థ సామ్యవాదానికి, సమానత్వ భావనకు పోటీగా తయారైంది. దాని సిద్ధాంతం, ఉద్దేశం అందరికీ తెలిసిందే. ఆ వ్యవస్థను సమర్థించిన మేధావులు, ఆర్థిక శాస్ర్తవేత్తలు చెప్పింది ఒక్కటే. మానవ మనుగడకు, అభివృద్ధికి స్వార్థ చింతన అవసరం. ఆ స్వార్థ చింతనతో సాధించిన సంపద, నైతికంగా ఆ వ్యక్తికే చెందుతుంది. అది కష్టార్జితంగా, పిత్రార్జితంగా వచ్చి ఉంటే అది అతని హక్కు. తద్వారా ఎంతటి అసమానతలకు దారి తీసినా అది ధర్మమే అవుతుంది. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలనీ, అవకాశాలు లేక నెట్టి వేయబడ్డ జనసమూహానికి, కులం, వర్గం, జాతి, జెండర్ ఆధారంగా ఎవరైతే దిగువ స్థాయిలో ఉన్నారో వారికే ముందు ఎక్కువ అవకాశాలివ్వడమే న్యాయం అన్నారు మరి కొంత మంది. మార్కెట్ ఆధారంగా నిర్మించిన వ్యవస్థల్లో మనుషుల సామర్థ్యాలను పెంచేదిగా అవి ఉండాలి. సమానావకాశాలు కల్పించటం ద్వారా ఏ దేశమూ నష్ట పోలేదని, పైగా మానవాభివృద్ధి జరిగిందని కొం తమంది ఆర్థిక వేత్తలు, మేధావులు 20వ శతాబ్దంలో చెప్పారు. 


వైద్య రంగానికొస్తే ప్రపంచంలో అతి దౌర్భాగ్యమైన ఆరోగ్య భద్రతా వ్యవస్థ అమెరికాలోనే ఉంది. దేశ ఆదాయంలో సుమారు 18 శాతం అందుకు వెచ్చిస్తున్నాఅది ప్రైవేట్ కార్పొరేట్, ఇన్సూరెన్స్, ఫార్మసీ లాబీల ఆధీనంలో ఉండి సామాన్యులకు, సమూహాలకు వైద్య సదుపాయాలను అందించలేక పోయింది. అక్కడ జరిగే పరిశోధనలు, పెద్దపెద్ద హాస్పిటల్స్, మార్కెట్ అనుకూల వ్యవస్థలు వ్యక్తుల కోసమే. అందుకే, కరోనా సోకిన తరువాత లక్షల మంది రోడ్డున పడితే టెంపరరీగా టెంటుల్లో సదుపాయాలు కల్పించారు. మన దేశంలో కూడా కొంత మంది అటువంటిదే కొంత వరకు చేశారు. అయితే, ప్రభుత్వ రంగ వైద్య వ్యవస్థే మనలను కాపాడుతున్నదని తెలుగు రాష్ట్రాల్లో అందరికీ అర్థమవుతున్నది. గాంధీ, ఉస్మానియా, కేజీహెచ్, రంగరాయ ఆస్సత్రులన్నీ ప్రభుత్వ రంగం లోనివే. అందులో డాక్టర్లుగా, నర్సులుగా, పారిశుద్ధ్య కార్మికులుగా వృత్తి ధర్మం నిర్వహిస్తున్న సామాజిక వర్గాలు ఎవరో అందరూ చూస్తున్నారు. సామ్యవాద దేశాలు లేక ప్రజాస్వామ్య సామ్యవాదం అంటూ ప్రభుత్వ రంగ వ్యవస్థలను ప్రోత్సహించిన దేశాల్లో కొవిడ్- 19 ప్రభావం తక్కువగా ఉంది. 


కొవిడ్- 19 సమస్య తీవ్రతను అర్థం చేసుకోవాలంటే దాని వెనుక గల కారణాలను, సిద్ధాంతాలను తెలుసుకోవాలి. వంద సంవత్సరాలలో ఒకసారి మాత్రమే ఇటువంటి సమస్య వస్తుంది అనుకున్నా, నాటి పరిస్థితులు, వ్యవస్థలు, సాంకేతిక పరిజ్ఞానం, నాగరికతలో ముందంజ ఒకటి కావు. సమూహ అవసరాలు, సమాజ అభివృద్ధి, అసమానతల నిర్మూలన, వివక్షల రద్దు అందరికీ అన్నీ సమకూర్చే వ్యవస్థ ఒకటి సామ్యవాదం పేరుతో కొంత కాలం కొనసాగింది. వ్యక్తివాదం, వైయక్తిక చింతన, వ్యక్తి స్వాతంత్ర్యం ఆ మానవీయ వ్యవస్థను సాగనంపాయి. ఫలితంగా మానవాళి మళ్ళీ ఝ పెను సమస్యల్లో కొట్టు మిట్టాడుతున్నాయి. పేదరిక నిర్మూలన, మానవ హక్కులు కల్పన పేరు మీద సామూహిక సామ్యవాద వ్యవస్థలపై గురి చూసి దాడి చేయటం ప్రారంభించారు. పెట్టుబడి దారీ వ్యవస్థలు పెరగడానికి ఉన్న అవకాశాలను అందుకోవాలనే కొద్ది మంది స్వార్థ పరత్వం, కొన్ని ప్రతికూల పరిస్థితులు, ముఖ్యంగా టెక్నాలజీ, ఇతర వ్యవస్థల సహాయంతో ప్రచారంతో కొద్ది మందికి అవకాశాలు కల్పించి వైరుధ్యాలు పెం చారు. 1990 దశకంలో ప్రారంభమైన ప్రపంచీకరణ, పెట్టుబడి విస్తరణ, సేవారంగం ద్వారా కొద్ది మందికి అన్ని అవకాశాలు కల్పించి, మానవ నాగరికత గమనాన్ని వెనుకకు నెట్టే యత్నాలు జరిగాయి. కొవిడ్- 19 లాంటి ఉపద్రవం కొద్ది రోజుల్లోనే ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేసిందంటే దానికి కారణం పెట్టుబడిదారీ ప్రపంచీకరణే.


ఒక్క భారత దేశంలోనే 30 లక్షల మంది వలస కార్మికులు స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. యూఎన్ డీపీ రిపోర్ట్ ప్రకారం పదేళ్ల క్రితమే 20 కోట్ల మంది ప్రజలు వివిధ దేశాల్లో వలస కార్మికులుగా ఉన్నారు. అది ప్రపంచీకరణ మూలంగా ఏర్పడిందే. ఇందులో చైనా కూడా ఉంది. చైనా తెలివైన దేశం. తమ దేశంలో ఎస్ఈజెడ్‌లు ఏర్పరచి విదేశీ కంపెనీలను ఆహ్వానించి టెక్నాలజీ వాడు కున్నది కానీ భూమిపై మాత్రం వాటికి హక్కు కల్పించక, 30 ఏళ్ల తరువాత దేశం విడిచి పోవాలి అని షరతు పెట్టింది. రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా ఆ టెక్నాలజీని నేర్చుకొని, దాన్ని మరింత పెంచి ఆ టెక్నాలజీ తమ సొంతమే అని చెప్పుకునే స్థాయికి ఎదిగింది. చైనా గత మూడు దశాబ్దాలుగా అపార సంపదను సంచితం చేసుకుని, పెట్టుబడులు భారీగా పెట్టి అమెరికాకు సవాలుగా నిలిచింది. అమెరికాకు అన్నిటా గట్టి  పోటీ నిస్తున్న చైనా ఇంకా తన ప్రభావ ప్రాబల్యాలను విస్తరించుకొంటోంది. అలాగే అవకాశాలనూ పెంచుకుంటోంది. అయితే, మనం చైనా నుంచి మనం ఏమైనా నేర్చుకున్నామా? ఏమీ లేదు. అమెరికాను అనుకరించి జాతీయ వాదంతో సేవా రం గం ద్వారా ఆదాయం చూపిస్తూ వ్యవసాయం, పారిశ్రామిక రంగాలను వదిలేశాము. అమెరికాలో సేవా రంగం నుండే 77 శాతం ఆదాయం వస్తుంది.


అంటే, బ్యాంకులు, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, టూరిజమ్, ఎంటర్ టెయిన్ మెంట్, హోటళ్లు, సాఫ్ట్ వేర్ వంటి కొద్ది మందికే సంపదనిచ్చే సంస్థలను పెంచి పోషించటమే అమెరికా ఆర్థిక వ్యవస్థ సాధిస్తున్న ‘ఘనత’. ట్రిలియనీర్లను పెంచి ఒక శాతం ప్రజలు, 99 శాతం సంపదను పొందే అమానుష, అమానవీయ, యాంత్రిక నాగరికతను, సంస్కృతిని పెంచింది. దీన్ని అనుసరిస్తున్న మన దేశం లో, విమర్శకులు అన్నట్లు గుజరాత్ వ్యాపారులకు, కులీనులకు అవకాశాలు కల్పించి, 47 కోట్ల మందిని అసంఘటిత కార్మికులుగా పరాధీనులుగా చేశారు. ఆకలేస్తే తిరుగుబాటు చేయకుండా చేతిలో ఫోన్ పెట్టి, ముష్టి గింజలు పడేసి అస్తిత్వమూ, ఆత్మ గౌరవం లేని జాతిని తయారు చేశారు. ఇది భారత దేశ చరిత్రకు, సంస్కృతికి ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే ఆర్యోక్తికి ప్రత్యక్షంగా గొయ్యి తియ్యటమే. 21వ శతాబ్దపు పరమార్థ సత్యం, వ్యవహార సత్యం ఒకటే... సమూహ అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా సమాజ వనరులను పొదుపుగా ఉపయోగించుకోవాలి.


తద్వారా కష్టనష్టాలను సమష్టిగా ఎదుర్కోవడం సుసాధ్యమవుతుంది. ఒక్కడి కోసం అందరూ నిలుస్తారు, అందరి కోసం ప్రతి ఒక్కడూ కలిసివస్తాడు. సమాజ శ్రేయస్సుకు నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు సామాజిక అజమాయిషీ గల వ్యవస్థలు అందుకు ఎంతైనా దోహదం చేస్తాయి. అలా కాకుండా సమూహాన్ని విస్మరించి వ్యక్తి ఉన్నతినే లక్ష్యంగా చేసుకుంటే మనుషుల మధ్య అసమానతలు పెరుగుతాయి. పరస్పర అనుమానాలు, అసహనాలు పెరుగుతాయి. అవకాశాల మూలంగా కొంతమంది తెలివైన వారు, సమర్థులు, విజ్ఞానులుగా కనపడినప్పటికీ మానవులంతా ఒకటే. కొవిడ్ -19 ద్వారా ఈ వాస్తవం మరో సారి రుజువైంది. మానవ నాగరికత మనగలగాలంటే సమూహాలకే ప్రాధాన్యముండాలి. అలా కాకుండా, కొద్ది మంది భూగోళం నాశనమయ్యాక ఇంకో గ్రహానికి వెళ్లడానికి ఏర్పా ట్లు చేసుకుంటాం అనుకుంటే అప్పుడు భూగోళమూ ఉండదు, చరిత్రా ఉండదు. ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేస్తే వారే తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. ఏమైనా కొవిడ్- 19 మానవాళికి ఒక పెద్ద సవాలును, ఒక మెరుగైన అవకాశాన్ని ఇచ్చింది. ఏం జరుగుతుందో చూద్దాం!

ఆచార్య కె.ఎస్. చలం


Advertisement
Advertisement
Advertisement