Abn logo
Jun 4 2020 @ 02:03AM

మీ తండ్రికి అర్థమయ్యేలా చెప్పంటూ.. టిఫనీ ట్రంప్‌కు సూచిస్తున్న నెటిజన్లు..!

వాషింగ్టన్: జార్జి ఫ్లాయిడ్ మరణంపట్ల అమెరికా అధ్యక్షుడు చిన్న కుమార్తె టిఫనీ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..జార్జి ఫ్లాయిడ్ అనే నల్లజాతి వ్యక్తిని.. శ్వేత‌జాతి పోలీసు అధికారి అతికిరాతకంగా కాలితో తొక్కి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జాతి వివక్షపై అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయులు నిరసనలకు దిగారు. వేలాది మంది వీధుల్లోకి వచ్చి ఆందోళనలనలు చేస్తున్నారు. కాగా.. జార్జి ఫ్లాయిడ్ మృతిపట్ల డొనాల్డ్ ట్రంప్ చిన్న కూతురు స్పందించారు. పోలీసుల చర్యను వ్యతిరేకిస్తూ.. ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రాంలో తన నిరసనను వ్యక్తం చేశారు. ఫ్లాయిడ్‌కు న్యాయం జరగాలని కోరుకున్నారు. ఫ్లాయిడ్ హత్య తర్వాత.. ‘బ్లాక్ఔట్‌ట్యూస్‌డే’ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు నల్లటి స్క్రీన్‌ఫొటో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఈ నేపథ్యంలో టిఫనీ ట్రంప్ తన ఇన్‌స్ట్రాగ్రాం‌లో నల్లటి స్క్రీన్‌ఫొటో పోస్ట్ చేశారు. అంతేకాకుండా #blackoutTuesday #justiceforgeorgefloyd‌ లను ఆ ఫొటోకు జత చేశారు. వీటితో పాటు హెలెన్ కెల్లర్‌కు సంబంధించిన ఓ ఫేమస్ కొటేషన్‌ను కూడా ఆమె తన ఇన్‌స్ట్రాగ్రాంలో పోస్ట్ చేశారు. అయితే శ్వేతసౌధం ముందు ఆందోళనలు చేస్తున్న నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించిన కొద్ది సమయానికే టిఫనీ ట్రంప్ ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఇదిలా ఉంటే.. టిఫనీ ట్రంప్ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘నిరసనకారుల ఆవేదనను మీ తండ్రికి అర్థమయ్యేలా చెప్పు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా.. నిరసనకారులను అదుపు చేయడానికి సైన్యాన్ని దింపుతానంటూ ట్రంప్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 



Advertisement
Advertisement
Advertisement