Abn logo
Dec 5 2020 @ 01:42AM

ట్రక్కుల కోసం.. ఎన్నో ట్రిక్కులు

  • అంచనాకు మించి దరఖాస్తులు 
  • అనుచర గణానికి ఇప్పించుకోడానికి అధికార పార్టీ చోటా నాయకుల పైరవీలు 
  • ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకోడానికి ఎత్తులు 
  • ఎంపిక జాబితాలో స్థానం కోసం ఎన్నో  ప్రయత్నాలు 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కొత్త సంవత్సరం జనవరి నుంచి బియ్యం కార్డులున్న ప్రతీ ఇంటికి నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  రేషన్‌ సరుకులు ఇంటికి పట్టుకెళ్లి వలంటీర్ల ద్వారా సరఫరా చేస్తామని వెల్లడించింది. సరకు రవాణాకు సంబంధించి ఎస్సీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, క్రైస్తవ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు మినీ ట్రక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో అభ్య ర్థులు ట్రక్కుల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తు చేశారు. జిల్లాకు 1,076 ట్రక్కులు మంజూరు కాగా, 13,785 మంది పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో ట్రక్కుల కోసం పలువురు వారి స్థాయి లో ఎన్నెన్నో ట్రిక్కులు అమలుచేస్తున్నారు. అంచనాకు మించి దరఖాస్తులు రావడంతో ఎలాగైనా తమ అనుచర గణానికి ఇప్పించుకోడానికి అధికార పార్టీ చోటా నాయకులు పావులు కదుపుతున్నా రు. జిల్లావ్యాప్తంగా ఎంపీడీవో, మునిసిపల్‌ కార్యాలయాల్లో అభ్య ర్థులకు శుక్రవారం ముఖాముఖి ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాము ఎలాగైనా ట్రక్కు దక్కించుకోవాలని, ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే క్రమంలో పలువురు ఎత్తులు వేస్తున్నారు. తదనుగుణంగా ఎంపిక జాబితాలో స్థానం కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. రేషన్‌ పంపిణీలో అక్రమాలు అరికట్టడానికి గత ప్రభుత్వాలు అమల్లోకి తెచ్చిన ఈ పోస్‌ విధానమే ఈ ప్రభుత్వంలోనూ అమలవుతోంది. అయితే దొడ్డిదారిన రేషన్‌ సరుకుల అనధికారిక తరలింపు ఎక్కడా ఆగడం లేదు. దీంతో అక్ర మాలు సమూలంగా అరికట్టాలని, దీనికి జనవరి 1 నుంచి లబ్ధిదారుల ఇంటికే సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే జిల్లాలో ఉన్న 2,642 రేషన్‌ డిపోల పరిధిలో 15,79,555 మంది కార్డుదారులున్నారు. వీరందరికీ ప్రతీనెలా 23,493 మెట్రిక్‌ టన్నుల బియ్యం కిలో 1 రూపాయి చొప్పున పంపిణీ చేస్తున్నారు. ఇళ్లకు తీసుకెళ్లి సరుకులు ఇవ్వడానికి జిల్లాకు 1,076 మినీ ట్రక్కులను అవసరమని గుర్తించి వాటిని ప్రభుత్వం మంజూరు చేసింది. కార్పొరేషన్‌ల ద్వారా అర్హులైన వారికి ట్రక్కులు ఇవ్వడానికి గత నెలాఖరు దాకా దరఖాస్తులు తీసుకున్నారు. అయితే అంచనాకు మించి 13 వేల మంది దరఖాస్తు చేశారు. ట్రక్కు ఖరీదులో లబ్ధిదారుడు 10 శాతం తన వాటా చెల్లించాలి. అలాగే ట్రక్కు పొందిన వారంతా రేషన్‌ సరుకులను ఇళ్లకు తీసుకెళ్లే క్రమంలో ప్రభుత్వం వారికి నెలకు రూ.10 వేల వేతనం చెల్లిస్తుంది. దీంతో వాహనాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రస్తు తం జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్నారు. అక్కడ నుంచే కొందరు ట్రక్కులు మంజూరు చేసే సంబంధిత అధికారులకు ఫోన్ల ద్వారా సిఫారసు చేయించుకునే పనిలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. మొత్తం 1076 ట్రక్కులకు గాను, జిల్లావ్యాప్తంగా అన్ని సామాజికవర్గాల నిరుద్యోగులు సుమారు 13 వేల మంది దరఖాస్తు చేశారు. ఇందులో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 262 ట్రక్కులు ఇవ్వనున్నారు. కానీ 4,154 దరఖాస్తులొచ్చాయి. బీసీ కార్పొరేషన్‌ ద్వారా 467 మందికి, ఈబీసీ కార్పొరేషన్‌ ద్వారా కేవలం ఈ పథకానికి సంబంధించి మాత్రమే కాపు, వైశ్య,బ్రాహ్మణ, రెడ్డి, రాజు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులకు 246, క్రిస్టియన్‌, ముస్లింలకు 25, గిరిజనులకు 76 ట్రక్కులు ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ దరఖాస్తులను మినహాయించగా ఇతర సామాజిక వర్గాలవారు 9,631 మంది దరఖాస్తు చేశారు. ఇక్కడ అనుభవాన్ని చూస్తారా, సిఫారసులకు ప్రాధాన్యమిస్తారా అనేది చూడాలి.

Advertisement
Advertisement
Advertisement