Abn logo
Jan 18 2021 @ 00:51AM

తిరుగు ప్రయాణాలతో రహదారులపై రద్దీ

హైదరాబాద్‌కు 100 ఆర్టీసీ బస్సులు 

24 ప్రత్యేక రైళ్లలో కిక్కిరిసిన ప్రయాణికులు 

విమానాశ్రయాలకూ సంక్రాంతి కళ 


సంక్రాంతి సంతోషాలను మూటకట్టుకుని, నగరవాసులు స్వగ్రామాల నుంచి తిరుగు పయనమయ్యారు. దీంతో రహదారులన్నీ వాహనాలతో రద్దీగా మారాయి. ఫాస్టాగ్‌ ఉన్నా, టోల్‌ ప్లాజాల దగ్గర వాహనాలు బారులు తీరాయి. బస్సులు, రైళ్లు కిటకిటలాడాయి. ఈ ఏడు విమానాశ్రయానికి కూడా పండగ కళ వచ్చింది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) 

సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చిన నగరవాసుల తిరుగు ప్రయాణాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ మార్గంలో సాయంత్రానికే 20 వేల వాహనాలు, చెన్నై మార్గంలో 18 వేల వాహనాలు విజయవాడ మీదుగా వెళ్లినట్టు టోల్‌ప్లాజాల గణాంకాలు చెబుతున్నాయి. ఆర్టీసీ ఆదివారం రికార్డు స్థాయిలో స్పెషల్‌ సర్వీసులను నడిపింది. పండగ ముందు పది రోజుల్లో హైదరాబాద్‌ నుంచి 97 బస్సులను నడిపిన ఆర్టీసీ కృష్ణా రీజియన్‌, తిరుగు ప్రయాణంలో ఆదివారం ఒక్క రోజే 100 స్పెషల్‌ బస్సులను ప్రవేశపెట్టింది. సొంతూళ్లలో ఇంతకాలంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్న ఐటీ ఉద్యోగులు తిరుగు ప్రయాణాలకు సిద్ధం కావడం కూడా హైదరాబాద్‌ రూట్‌లో ఆర్టీసీ బస్సులకు ఒక్క రోజులోనే ఇంత డిమాండ్‌ పెరగడానికి ఒక కారణమని భావిస్తున్నారు. పండగ తర్వాత ఆఫీసులకు రావాలంటూ ఐటీ కంపెనీలు ఈ మెయిల్స్‌ పంపించటంతో ఎక్కువ మంది ఉద్యోగులు ఆదివారం బయలుదేరినట్టు తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ ఈ రూట్‌లో మొత్తం 130 బస్సుల వరకు సిద్ధం చేసుకుంది. 100 బస్సులకు రిజర్వేషన్‌ కల్పించగా, సాయంత్రానికే దాదాపు అన్ని బస్సులకూ రిజర్వేషన్‌ పూర్తయింది. హైదరాబాద్‌కు విజయవాడతో పాటు జగ్గయ్యపేట, నూజివీడు, తిరువూరు, అవనిగడ్డ, గుడివాడ, మచిలీపట్నంల నుంచి కూడా స్పెషల్‌ బస్సులను నడిపారు.    


అంతర్రాష్ట్ర రూట్లలో విమానాలకూ డిమాండ్‌

విజయవాడ నుంచి అంతర్రాష్ట్ర రూట్లు అయిన హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, డిల్లీ, ముంబయిలకు భారీ సంఖ్యలో విమానాలు నడుస్తున్నాయి. శనివారం రికార్డు స్థాయిలో 56 విమానాలు నడవగా, ఆదివారం కూడా ఇదే రద్దీ కొనసాగింది. విదేశీ విమానాలు కూడా మూడు నడిచాయి. రీజియన్‌ పరంగా విశాఖపట్నం, తిరుపతి, కడపలకు కూడా విమానాలు రద్దీగా నడిచాయి. 


20 స్పెషల్‌ రైళ్లలో తిరుగు ప్రయాణాలు

 రైల్వే శాఖ 24 ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆదివారం అదనంగా నాలుగు ప్రత్యేక రైళ్లు నడిచాయి. సికింద్రాబాద్‌ - నర్సాపూర్‌,  కాకినాడ పోర్టు - తిరుపతి, సికింద్రాబాద్‌ - కాకినాడ పోర్టు, సికింద్రాబాద్‌ - చెన్నై, లింగంపల్లి - కాకినాడ పోర్టు, విశాఖపట్నం - హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ - బెంగళూరు, సికింద్రాబాద్‌ - కాకినాడ పోర్టు, హైదరాబాద్‌ - నర్సాపూర్‌లకు స్పెషల్‌ ఫెస్టివల్‌ రైళ్లు రాకపోకలు సాగించాయి. రెగ్యులర్‌ రైళ్లు లేకపోవటంతో స్వల్పంగా నడిపిన ఫెస్టివల్‌ స్పెషల్‌ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంది. 


కార్లు.. బారులు 

పండగకు హైదరాబాద్‌ నుంచి సొంత ప్రాంతాలకు వచ్చిన వారిలో ఎక్కువగా  సొంత కార్లు, క్యాబ్‌లు మాట్లాడుకుని వచ్చినవారే ఉన్నారు. తిరుగు ప్రయాణంలో కూడా వీరంతా సొంత వాహనాల్లో, క్యాబ్‌ల్లో ప్రయాణాలు సాగించడంతో జాతీయ రహదారుల మీద కార్లు పరుగులు పెట్టాయి. పాస్టాగ్‌ ఉన్నా, టోల్‌ప్లాజాల దగ్గర కూడా బారులు తీరాయి. 


Advertisement
Advertisement
Advertisement