Abn logo
Sep 18 2021 @ 01:23AM

35 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు రేపు 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

చిత్తూరులోని పీవీకేఎన్‌ కళాశాలలోని లెక్కింపు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ రాజాబాబు

ఇన్‌చార్జి కలెక్టర్‌ రాజాబాబు


చిత్తూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 17: జిల్లాలో 35 జడ్పీటీసీ, 419 ఎంపీటీసీ స్థానాలకు 11 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును ఆదివారం కొవిడ్‌ నిబంధనలను అనుసరించి పకడ్బందీగా నిర్వహిస్తామని ఇన్‌చార్జి కలెక్టర్‌ రాజాబాబు తెలిపారు. శుక్రవారం అమరావతి నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి పాల్గొన్న ఇన్‌చార్జి కలెక్టర్‌ జిల్లాలో  చేసిన ఏర్పాట్లను తెలియజేశారు. ఇప్పటికే ఆర్వో, ఏఆర్వోల నియామకం పూర్తయిందని చెప్పారు. 13 నియోజకవర్గాలకు సంబంధించి 11 ప్రాంతాల్లో స్ర్టాంగ్‌రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటికి అనుసంధానంగా కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో ఎంపీటీసీ సెగ్మెంట్‌కు ఒక్కో టేబుల్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియకు వచ్చే ఏజెంట్లకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించి, అనుమతిస్తామన్నారు. పోలీస్‌శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లా కేంద్రంలో కంట్రోల్‌ రూమ్‌ ఉంటుందన్నారు. కౌంటింగ్‌కు వచ్చే వారినుంచి వ్యాక్సిన్‌ వేసుకున్న సర్టిఫికెట్‌ను పొందేలా అధికారును  ఆదేశిస్తామన్నారు. జేసీలు వీరబ్రహ్మం, రాజశేఖర్‌, జడ్పీసీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా.. సాయంత్రం పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన లెక్కింపు కేంద్రాన్ని రాజాబాబు తనిఖీ చేశారు. అలాగే ఓట్ల లెక్కింపునకు పర్యవేక్షణ, నోడల్‌ అధికారులను నియమించారు. డివిజన్‌ వారీగా (చిత్తూరుకు వీరబ్రహ్మం, మదనపల్లెకు వెంకటేశ్వర, తిరుపతికి రాజశేఖర్‌) పర్యవేక్షణాధికారులుగా జేసీలు నియమితులయ్యారు.