Abn logo
Oct 21 2020 @ 01:29AM

అమరులారా వందనం..శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా..

Kaakateeya

విధి నిర్వహణ కోసం పోలీసుల ప్రాణత్యాగం 

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం 


సమాజంలో పోలీసుల సేవలు వెల కట్టలేనివి.. శాంతి భద్రతల పరిరక్షణ, తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించడంలో పోలీసుల పాత్ర అసాధారణమైంది. విధి నిర్వహణలో ప్రజల కోసం ఎందరో పోలీసు అధికారులు ప్రాణాలను పణంగా పెట్టారు. మావోయి స్టుల దాడుల్లో ఎందరో పోలీసులు అమరులయ్యారు. నేడు పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారం దరినీ స్మరించు కుంటూ ప్రత్యేక కథనం..


ఇబ్రహీంపట్నం : పాతికేళ్ల క్రితం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం అంటేనే మావోయిస్టుల అడ్డాగా పేరుండేది. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి జిల్లాల సరిహద్దు రాచకొండను స్థావరంగా చేసుకొని మావోయిస్టులు తమ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగించేవారు. మావోయిస్టుల ప్రాబల్యం కారణంగా ఇబ్రహీంపట్నం అభి వృద్ధిలో ఎక్కడో ఆగి పోయింది. అలాం టిది పోలీసు యం తాంగ్రం చర్యలతో ఇబ్రహీం పట్నం పేరు ప్రస్తుతం జాతీయస్థాయిలో మార్మోగుతోంది. 


మొట్టమొదటగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల అలజడి 1997లో మొదలైంది. ఆ ఏడాది పోలీస్‌ స్టేషన్‌ను పేల్చివేసిన మావోయిస్టులు మడుపు రాజేశ్వర్‌రావు, జమీల్‌అహ్మద్‌ అనే ఇరువురు కానిస్టేబుళ్లను తుపాకీతో కాల్చి చంపారు. అంతేగాక 2001లో మంచాల మండలం బండలేమూర్‌లో మందుపాతరలు పేల్చి ఎస్సై సైదయ్య, కానిస్టేబుల్‌ సాయిల్‌ను హతమార్చారు. 2004-05లో ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో టీడీపీ నేత కాంటేకార్‌ కిషన్‌జీని, మంచాల మండలం ఆరుట్లలో కాంగ్రెస్‌ నేత వి.ఎస్‌.పాపిరెడ్డిని, తాల్లపల్లిగూడకు చెందిన బీజేపీ నాయకుడు మునుకుంట్ల మహేందర్‌గౌడ్‌ను, తిప్పాయిగూడకు చెందిన పొలమోని నగేష్‌గౌడ్‌, తుమ్మల రాంరెడ్డిలను, యాచారం మండలం మంథన్‌గౌరెల్లికి చెందిన టీడీపీ నేత కర్నాటి నారాయణగౌడ్‌ను మావోయిస్టులు కాల్చి చంపడంతో ప్రజలు, రాజకీయనాయకులు ఉలిక్కిపడ్డారు. ఇలా వరుసదాడులతో అలజడి సృష్టించిన మావోయిస్టుల చేతుల్లో ఎందరో పోలీసులు, ప్రజాప్రతినిధులు నేలకొరిగారు. దీంతో పోలీసు యంతాంగ్రం మావోయిస్టుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి పలు కార్యక్రమాలను చేపట్టింది. 


జనజీవన స్రవంతిలోకి..

ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న మహేంద్‌రెడ్డి.. అప్పట్లో సైబరాబాద్‌ కమిషనర్‌గా పనిచేసేవారు. ఆ సమయంలో అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న దండుమైలారం లాంటి గ్రామాల్లో మావోయిస్టు కుటుంబసభ్యులు, యువకులు, గ్రామస్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి మార్పు కోసం ప్రయత్నించారు. మావోయిస్టు కుటుంబ సభ్యులకు ఆర్థికసాయం చేశారు. సానుభూతిపరులు, మిలిటెంట్లను గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. 


అలాంటి మాయిస్టుప్రాబల్యం ఉన్న ఇబ్రహీంపట్నం ప్రాం తం ఇప్పుడు పెట్టుబడులకు సేఫ్‌ జోన్‌గా మారిందంటే పోలీసు శాఖ కృషి ఎంతో ఉందని చెప్పవచ్చు. పలు ఐటీ రంగ సంస్థలు, ఎన్‌ఎస్‌జీ, ఆక్టోపస్‌ లాంటి భద్రతా సంస్థలు ఇక్కడ కొలువయ్యాయి. ఆదిభట్లలో టీసీఎస్‌, ఎయిర్‌ క్రాఫ్ట్‌ విడిభాగాల తయారీ యూనిట్‌ టాటా లాకీడ్‌ మార్టీన్‌, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టంలాంటి అంతర్జాతీయ సంస్థలు ఏర్పాటయ్యాయి. 


ఈ మధ్యకాలంలో ఈ ప్రాంత యువత పోలీస్‌ శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు పొందారు. టెక్నాలజీపరంగా అనేక మార్పులు చోటుచేసుకోగా పోలీస్‌ వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పవచ్చు.


తీవ్రవాద భావజాలాన్ని విడనాడాలి.. - యాదగిరిరెడ్డి, ఏసీపీ, ఇబ్రహీంపట్నం

శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీస్‌ కుటుంబాలకు పోలీస్‌ శాఖ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎవరు నేరాలకు పాల్పడినా, తీవ్రవాద భావజాలంతో ఉన్నా వారి భవిష్యత్‌ అంధకారమనే విషయం తెలుసుకోవాలి. ఎవరైనా సరే కష్టపడే మనస్థత్వాన్ని అలవరచుకోవాలేగాని.. తప్పుదోవలో వెళ్లరాదు.

Advertisement
Advertisement