న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార తృణమూల్ కాంగ్రెస్ను విడిచిపెడుతున్న నేతల జాబితా పెరుగుతోంది. మమతా టీమ్ నుంచి మరొక ఎమ్మెల్యే బయటకు వచ్చేశారు. శాంతిపూర్ ఎమ్మెల్యే అరిందర్ భట్టాచార్య బుధవారంనాడు బీజేపీలో చేరారు. న్యూఢిల్లీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ పశ్చమబెంగాల్ ఇన్చార్జి కైలాష్ విజయవర్గీయ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అనంతరం మీడియాతో భట్టాచార్య మాట్లాడుతూ, తనలాంటి యువనేతలను టీఎంసీ నాయకత్వం ఎదగనీయడం లేదని విమర్శించారు.
'ఎన్నో ఆశలతో టీఎంసీలో చేరాను. నా ప్రాంతానికి ఎంతో చేయాలని అనుకున్నాను. ప్రజలకు చేతనైనంత సేవ చేసే ప్రయత్నం చేశాను. అయితే నాలాంటి వారిని ఎదగనీయడం లేదు. పార్టీ మా చేతులు కట్టేసింది. తమ ప్రాంతాలను అభివృద్ధి చేయగలిగే సమర్ధ నాయకులున్నా వారిని పార్టీ ఉపయోగించుకోవడం లేదు' అని భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్లో పరిశ్రమలు లేవనీ, ప్రజలకు ఉద్యోగాలు లేవని, టీఎంసీ ప్రభుత్వాన్ని భవిష్యత్ వ్యూహాలు లేనే లేవని తప్పుపట్టారు. పశ్చిమబెంగాల్ ప్రజలు మోదీకి, బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరారు.