Abn logo
Aug 7 2020 @ 03:24AM

కరోనాతో తిరుమల అర్చకుడి మృతి

టీటీడీలో ఇది రెండో మరణం..

250 మందికి పైగానే పాజిటివ్‌లు

భయం గుప్పిట్లో సిబ్బంది,అర్చకులు..

దర్శనాల రద్దుకు పెరిగిన డిమాండ్‌


తిరుపతి/తిరుమల, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేస్తున్న అర్చకుడు(50) కరోనా సోకి మరణించారు. తిరుపతిలోని పద్మావతి కొవిడ్‌ ఆస్పత్రిలో ఆయనకు కొద్దిరోజులుగా వైద్యం అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే గురువారం సాయంత్రం ఆయన మృతి చెందారు. టీటీడీలో ఇది రెండో కరోనా మరణం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో పనిచేసే ఈ అర్చకుడిని గతనెలలో డిప్యుటేషన్‌పై శ్రీవారి ఆలయానికి టీటీడీ బదిలీ చేసింది. ఆయన తిరుపతి నుంచి రోజూ తిరుమలకు రాకపోకలు సాగించే క్రమంలో కరోనా బారిన పడ్డారు. ఈ నెల 2న పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వెంటనే ఆయన పద్మావతి ఆస్పత్రిలో చేరారు. కరోనాకు తోడు బీపీ, షుగర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులుండడంతో ఆరోగ్య పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. కాగా, టీటీడీలో పనిచేసే ఉద్యోగులు, అర్చక స్వాముల్లో ఇప్పటి వరకూ కరోనా వైరస్‌ బారిన పడిన వారిసంఖ్య 250 మందికి పైగానే ఉంది.


గతనెల 24న శ్రీవారి ఉత్సవాలకు కాగడా వెలిగించి పట్టుకునే ఉద్యోగి ఒకరు కరోనాతో మరణించారు. టీటీడీలో నమోదైన తొలి కరోనా మరణం అదే. గతనెలలోనే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు సైతం కరోనాతో మృతిచెందిన సంగతి తెలిసిందే. అర్చకుడి మృతి ననేపథ్యంలో గురువారం రాత్రి డాలర్‌ శేషాద్రి ఇంట్లో అర్చకులంతా సమావేశమయ్యారు. కేసులు పెరిగిపోతున్న క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయాలపై చర్చించారు. ఇలానే సాగితే మిగిలినవారూ ప్రమాదంలో చిక్కుకుంటారని, కొంతకాలం దర్శనాలను రద్దుచేసి ఏకాంతంగా కైంకర్యాలు నిర్వహించాలనే విన్నపాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. సుప్రభాత సేవను ఉదయం 5కు, ఏకాంత సేవను రాత్రి 7 గంటలకే జరిపించాలనే సూచనలు వ్యక్తమైనట్టు సమాచారం. నిత్యకల్యాణోత్సవ సేవను తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈ వినతులపై శుక్రవారం టీటీడీ ఉన్నతాధికారులను అర్చకులు కలవనున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
Advertisement