Abn logo
Mar 26 2020 @ 03:27AM

లాక్‌డౌన్‌: విపక్షాల మూడు బాధ్యతలు

కరోనా మహమ్మారిపై నిర్ణయాత్మక పోరుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను మనం సమర్థించి తీరాలి. ఎందుకు? రాజ్య వ్యవస్థ ఆవిర్భావం గురించి ప్రాచీన గ్రీకు దార్శనికుడు అరిస్టాటిల్ రెండు న్నర సహస్రాబ్దాల క్రితం ఏమన్నాడో మననం చేసుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఆ విజ్ఞుడు ఇలా అన్నాడు: ‘జీవితం నిమిత్తమే రాజ్యం ఉనికిలోకి వచ్చింది. మంచి జీవితాన్ని నిర్మించడం కోసమే అది మనుగడలో కొనసాగుతున్నది’. ఈ వివేక శీల ప్రకటనలోని మొదటి భాగం, మనం కరోనా పై యుద్ధంలో ప్రధాని మోదీని ఎందుకు సమర్థించాలో స్పష్టం చేస్తుంది. అవసరమైనప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేందుకే రాజ్యం ఉనికిలో ఉన్నది.


నేనేమీ మోదీ సర్కార్ మద్దతుదారుడిని కాను. అది ‘ఎన్నికల నిరంకుశాధికార వాదం’కు ప్రతీక అని నేను పదే పదే విమర్శించాను. మన మహోన్నత ప్రజా స్వామ్య, లౌకిక గణతంత్ర రాజ్యం క్రమంగా కూలి పోతుండడానికి బాధ్యత మోదీ ప్రభుత్వానిదేనని నేను భావిస్తున్నాను. మత పరమైన అంతరాలను స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అది ఉపయోగించు కొంటోంది. ఆ ప్రయోజనాల కోసమే ఈ దేశ పౌరులైన ముస్లింల పట్ల విద్వేషాన్ని రెచ్చగొడుతున్నది. ఇది దేశ ద్రోహం మినహా మరేమీ కాదు. మన భారీ, సంక్లిష్ట ఆర్థిక వ్యవస్థను మోదీ ప్రభుత్వం సమర్థంగా నిర్వహించలేక పోతోంది. భారతీయ సమాజ స్వతస్సిద్ధ లక్షణమైన వైవిధ్యంలోని ఏకత్వాన్ని సంరక్షించడంలో కూడా ఈ ప్రభుత్వం గర్హనీయంగా వ్యవహరిస్తోంది. 21 వ శతాబ్దంలో భారత్‌కు అవసరమైన సమర్థ నాయకత్వం ఈ ప్రభుత్వం నుంచి సమకూరదనేది నా సునిశ్చిత విశ్వాసం. నరేంద్ర మోదీ వలే ఏ ప్రధానమంత్రి కూడా సత్యాన్ని కాలరాచివేయలేదు. నా యీ అభిప్రాయాలను మార్చుకోవల్సిన అవసరముందని నేను భావించడం లేదు.


అయినప్పటికీ, ప్రస్తుత కరోనా మహమ్మారి సందర్భంలో మోదీ ప్రభుత్వం పట్ల మన వ్యతిరేకతను అదుపు చేసుకోవాలి. ఆయన ప్రకటించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు మద్దతు నిచ్చితీరాలి. ఆ మద్దతు యథాలాపంగా ఇవ్వడం కాదు. లాక్‌డౌన్ ప్రయోజనకరంగా, విజయవంతంగా అమలయ్యేందుకు మనం చురుగ్గా, క్రియాశీలంగా వ్యవహరించాలి. మాటల్లో కాక, చేతల్లో మన మద్దతును తెలపాలి. ప్రతికూల రాజకీయాలకు ఇది సమయం కాదు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు భారత ప్రజలకు ప్రభుత్వ తోడ్పాటే కాదు, ప్రతిపక్షాల సహాయ సహకారాలూ అత్యంత అవసరం. ఈ విధ్యుక్త ధర్మాన్ని విపక్షాలు విస్మరించకూడదు.


దేశ వ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చినంత మాత్రాన కరోనా సంక్షోభ సందర్భంలో అది మాత్రమే అర్థవంతమైన నిర్ణయమని భావించనవసరం లేదు. కోవిడ్ -19 తో వాటిల్లే ప్రమాదాలను అంచనా వేయడంలో పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల ఆరోగ్యానికి ఆ వైరస్ వల్ల కలగనున్న పెను ముప్పును ఎలా తగ్గించాలనే విషయమై కూడా విస్తృత చర్చ జరుగుతోంది. మరణాల సంఖ్య భయపడినంతగా లేనందున కరోనా ఉపద్రవాన్ని అతిగా అంచనా వేస్తున్నారని కొంత మంది నిపుణులు అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా ఆ విషక్రిమి వెన్వెంటనే కాకపోయినా సత్వరమే యావత్ దేశ ప్రజలకు సోకే ప్రమాదం లేకపోలేదు. కరోనా వ్యాప్తిని తగ్గించడం వల్ల సమకూరే లబ్ధి కంటే లాక్‌డౌన్ ఆర్థిక, మానవ మూల్యాలే అధికమన్న భావనే పై అభిప్రాయంలో వున్నదని చెప్పవచ్చు. కరోనా వైరస్ సోకిందని శంకిస్తున్న ప్రజా సమూహాలలో ప్రతి ఒక్కరికీ వ్యాధి నిర్ధారిత పరీక్షలు నిర్వహించడం, విస్తృత స్థాయిలో యాదృచ్ఛిక పరీక్షలు నిర్వహించడమే దేశ వ్యాప్త లాక్‌డౌన్ కంటే వివేకవంత మైన కార్యాచరణలని పలువురు భావిస్తున్నారు.


కరోనా వైరస్ వెన్వెంటనే కాకపోయినప్పటికీ సత్వరమే యావత్ దేశ ప్రజలకు సోక వచ్చని మోదీ సర్కార్ భావించడం వల్లే లాక్‌డౌన్ నిర్ణయాన్ని తీసుకున్నదని చెప్పవచ్చు. ఈ భావన ప్రకారం పూర్తిస్థాయిలో నిరోధక చర్యలు చేపట్టకపోతే ఇటలీ, స్పెయిన్‌లలో వలే మన దేశంలోనూ భారీ ప్రాణనష్టం వాటిల్లగలదని అధికార వర్గాలు భయపడ్డాయి. అందునా ప్రజారోగ్య సదుపాయాల నాణ్యత ఏమాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో లేనందున కరోనా ప్రభంజనం మన దేశంలో లక్షలాది ప్రజలను బలిగొనదనడంలో సందేహం లేదు. కనుక ముందస్తు నిరోధమే కరోనా ను ఎదుర్కొవడానికి సరైన మార్గమని ప్రభుత్వం భావించింది.


ప్రస్తుత దశలో లాక్‌డౌన్, దేశ జనాభాలో అత్యధికులకు కరోనా వైరస్ సోకకుండా నిరోధించలేక పోయినప్పటికీ ఆ వ్యాప్తి ప్రక్రియను జాప్యం చేసే అవకాశం ఎంతైనా వున్నది. దీనివల్ల ఆస్పత్రులకు కరోనారోగులు ఒక్కసారిగా వెల్లువెత్తే ప్రమాద ముండదు. అలా రోగులు వెల్లువెత్తితే వారందరికీ చికిత్స చేయగల సామర్థ్యం మన ఆరోగ్య భద్రతా వ్యవస్థకు లేదన్నది మరి చెప్పనవసరం లేదు. కరోనా వ్యాప్తికి దీర్ఘకాలం పడితే, ఆ వ్యాప్తిని సమర్థంగా ఎదుర్కొనేందుకు ఆస్కారమున్నది. వ్యాక్సిన్లను అభివృద్ధిపరచుకోవడానికి, చికిత్సా సదుపాయాలను మెరుగుపరచేందుకు అవసరమైన వ్యవధి లభిస్తుంది. దేశ వ్యాప్త లాక్‌డౌన్ విచారకరమే అయినప్పటికీ భారత్ భవిష్యత్‌కు అది అనివార్యమైన నిర్ణయం. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు.


కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో వీటిలో ఏది సరైన మార్గమో ఇప్పుడే చెప్పలేము. ఎందుకంటే ఇది కనీవినీ ఎరుగని సంక్షోభం. మేధావులు కాని డోనాల్డ్ ట్రంప్, బోరిస్ జాన్సన్ లాంటి వారిని అటుంచితే అత్యుత్తమ రాజకీయ నాయకులు సైతం చరిత్ర దర్పణంలో ప్రకాశవంతంగా కన్పించరు. కరోనా లాంటి సంక్షోభ సందర్భాలలో వాటి నివారణకు బాధ్యులైన రాజకీయ నాయులు తీసుకునే నిర్ణయాలకు మనం మద్దతు నివ్వక తప్పదు సంక్షోభ పరిష్కారానికి వారు అనుసరిస్తున్న మార్గం దేశానికి వినాశనకరమైనదని మనం నమ్మినప్పటికీ మద్దతునివ్వక తప్పదు లాక్‌డౌన్ నిర్ణయం సరైనదని మోదీ విశ్వసిస్తున్నారు. కనీసం, అది సరైన నిర్ణయమని ప్రజలు భావించాలని ఆయన ఆశిస్తున్నారు. 2016లో నోట్ల రద్దు నిర్ణయం వలే ఇది ఒక సమస్యకు పరిష్కారాన్వేషణ కాదు. రాజకీయ ప్రయోజనాలను సాధించుకోవడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టం లాంటిదీ కాదు. కరోనా సందర్భంలో ప్రభుత్వం పట్ల ప్రతికూల ప్రతిస్పందనలు పై రెండు సందర్భాలలో వలే వుండవు. వుండకూడదు కూడా. 


కరోనా వైరస్ లాంటి సంక్షోభాల పరిష్కారానికి స్పష్టమైన, సాధికార నిర్ణయాలు తీసుకోవలిసిన అవసరం ఎంతైనా వున్నది. నిజానికి, మానవులకు రాజ్యవ్యవస్థ ఎందుకు అవసరమో ప్రస్తుత సంక్షోభం స్పష్టం చేస్తుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కంటే నిర్ణయరాహిత్యం మరింత ఘోరమైనది. తీసుకున్న నిర్ణయాన్ని అరకొరగా అమలుపరచడం మరింత ప్రమాదకరమైన విషయం. కనుక ఒక నిర్ణయం తీసుకున్నాక దాన్ని పూర్తి స్థాయి లో అమలుపరచితీరాలి. ఎటువంటి వెనుకడుగు వేయడానికి వీలులేదు. మరో ముఖ్యమైన విషయమేమిటంటే జాతీయ విపత్తు నిర్వహణా చట్టం కింద లాక్‌డౌన్‌ను ప్రకటించడం శాంతిభద్రతల విషయంలో రాష్ట్రాల అధికారాలను అతిక్రమించడమే అవుతుంది. కనుకనే లాక్‌డౌన్ నిర్ణయం చట్టపరమైన సంశయానికి తావిస్తున్నది. అయితే మన రాజ్యాంగ విధానంలో కరోనా మహ మ్మారి లాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడమే ఉత్తమ మార్గం అనడంలో సందేహం లేదు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్ నిర్ణయం సఫలమవ్వడమనేది ప్రతిపక్షాలపై ఆధారపడివున్నది. ఆ నిర్ణయం అమలుకు ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యనూ ప్రతిపక్షాలు ఆమోదించవలసిన అవసరం లేదు. బ్రిటిష్ రాజ్యాంగ వ్యవస్థలో రాజు హక్కుల గురించి వాల్టర్ బాగేహాట్ (సుప్రసిద్ధ ‘ది ఎకనామిస్ట్’ పత్రిక సంస్థాపక సంపాదకుడు) ఇలా రాశారు: ‘బ్రిటిష్ సార్వభౌమునికి సంప్రదించే హక్కు, ప్రోత్సహించే హక్కు, హెచ్చరించే హక్కు ఉన్నాయి’. అదే విధంగా ప్రస్తుత సంక్షోభ సందర్భంలో మన ప్రతిపక్షాలకు కూడా అడిగే హక్కు, అప్రమత్తం చేసే హక్కు, బహిరంగపరిచే హక్కు ఉన్నాయి.


మన ప్రతిపక్షాలు ఈ హక్కులను సంపూర్ణంగా వినియోగించవలసిన అవసరం ఎంతైనా వున్నది. భారత ప్రజల శ్రేయస్సుకు ఇది చాలా ముఖ్యం. మోదీ సర్కార్ నిర్ణయానికి యథాలాపంగా మద్దతు నిచ్చి వదిలివేస్తే ఎటువంటి భద్రతలు కల్పించకుడానే లాక్‌డౌన్ నిర్ణయాన్ని అమలుపరచడానికి అది పూనుకోవడం ఖాయం. ఇది దేశానికి వినాశనకరం కావడమే గాక అసలు లాక్‌డౌన్ నిర్ణయమే విఫలమవ్వచ్చు. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాలు నిర్మాణాత్మకంగా వ్యవహరించి తీరాలి. లాక్‌డౌన్ మూలంగా ప్రజలు ముఖ్యంగా సామాన్య ప్రజలు భారీ మూల్యాన్ని చెల్లించవలసివస్తుంది. నిరుపేదలు, సమాజంలోని ఇతర దుర్బల వర్గాలు చాలా నష్టపోతారు. వారిని అన్ని విధాలా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను తప్పించుకొంటోంది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ప్రకటించిన టాస్క్ ఫోర్స్ ను ఇంతవరకు ఏర్పాటు చేయనేలేదు. అందరూ వేచి చూస్తున్న ఆర్థిక ప్యాకేజీ విషయం ఏమయిందో ఎవరికీ తెలియదు. అది కనుచూపు మేరలో కన్పించడం లేదు. లాక్‌డౌన్ మూలంగా తమ జీవనాధారాలను కోల్పోయే లక్షలాది శ్రామిక ప్రజలకు ఎటువంటి తక్షణ సహాయాన్నీ ప్రధాని మోదీ ప్రకటించనేలేదు. ప్రతిపక్షాలు వీటి గురించి పట్టించుకోకుండా మౌనంగా వుంటే నోట్ల రద్దు సందర్భంలో వలే ఇప్పుడూ ప్రజల సమస్యలను ప్రభుత్వం తప్పక ఉపేక్షిస్తుందనడంలో సందేహం లేదు.

కరోనా వైరస్ సోకిన వారి ఆరోగ్య భద్రత విషయంలో మరింత బాధ్యత తీసుకునేలా ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఒత్తిడి చేయాలి. మహమ్మారి విజృంభించిన వేళ నిస్సహాయులైన వ్యక్తులను వారి మానాన వారని వదిలివేయడం ఏ నాగరీక ప్రభుత్వానికి తగదు. ముఖ్యంగా ప్రైవేట్ వైద్య సేవలు పొందలేని పేదలను పూర్తిగా ఆదుకోవడం ప్రభుత్వ విధ్యుక్త ధర్మం. అలాగే కరోనా పీడితులను ఆదుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేయడం కూడా ఏమాత్రం సముచితం కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిధుల కొరతతో సతమతమవుతున్నాయి. కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రుల సహాయసహకారాలను తీసుకోవడానికి సైతం ప్రభుత్వాలు వెనుకాడ కూడదు. ప్రజాస్వామిక హక్కులను హరించివేయడం మోదీ ప్రభుత్వ సహజ లక్షణంగా ఉన్నందున ఈ జాతీయ ఆరోగ్య అత్యవసరపరిస్థితి దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై ఉన్నది. ఈ విషయంలో అవి సదా అప్రమత్తమై వుండాలి. ప్రజాస్వామిక హక్కులను హరించి వేసేందుకు, రాజ్యాంగేతర అధికారాలను చెలాయించేందుకు మోదీ ప్రభుత్వం పూనుకోకుండా చూడాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి; వివిధ స్థాయిల్లో అధికార వర్గాలను అప్రమత్తం చేయాలి; మాటకు, చేతకు మధ్య ఉన్న అంతరాన్ని బహిర్గతం చేయాలి. ప్రతి పక్షాలు ఇలా వ్యవహరించినప్పుడు మాత్రమే లాక్‌డౌన్‌ను ప్రజాప్రయోజనకరంగా అమలుపరచడం సుసాధ్యమవుతుంది.


వ్యాసకర్త స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు

Advertisement
Advertisement
Advertisement