Abn logo
Jul 10 2020 @ 04:54AM

కారు బోల్తా ముగ్గురి దుర్మరణం

రాప్తాడు జూలై 9 : మండలంలోని గోళ్లపల్లి సమీపాన జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున కారు బో ల్తాపడింది. ఈ ప్రమాదంలో శింగనమల మండ లం ఆకులేడు గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. చిన్నమ్మ (65), ఆమె కుమారుడు అమర్‌నాథ్‌ (40), అతని బావమరిది రాజు (28) మృతి చెందిన వారిలో ఉన్నారు. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాలివి. అమర్‌నాథ్‌ బెంగుళూరులోని మున్సిపాలిటీలో, అతని బావమరిది రాజు ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా కొన్నాళ్లుగా స్వగ్రామమైన ఆకులేడులో ఉంటున్నారు. లాక్‌డౌన్‌ సడలింపులు, పలు పనుల నిమిత్తం స్వగ్రామం ఆకులేడు నుంచి తెల్లవారుజామున ముగ్గురు కారులో బెంగళూరుకు బయలుదేరారు. గోళ్లపల్లి సమీపాన జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.


ఘటనా స్థలంలోనే ముగ్గురు చనిపోగా, డ్రైవర్‌ మారుతి గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న ఇటుకలపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్‌, ఎస్‌ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన మారుతి చికిత్స పొందుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతితో బాధితుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతులు చిన్మమ్మకు భర్త, అమర్‌నాథ్‌కు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. రాజుకు వివాహం కాలేదు. ఇదిలాఉండగా కారు ప్రమాదానికి అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement