Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 27 2021 @ 16:53PM

మనం అరిచి గోల చేసినా మరణించినవారు తిరిగి బ్రతుకరు : హర్యానా సీఎం

రోహ్‌తక్ : హర్యానా ముఖ్యమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కోవిడ్-19 సంబంధిత మరణాల గురించి ఆందోళన చెందడంలో అర్థం లేదన్నారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ, ఇలాంటి సంక్షోభ సమయంలో మనం గణాంకాలపై ఆందోళన చెందకూడదన్నారు. ప్రజలు కోలుకుని, ఆరోగ్యవంతులవడానికి మనం ఎలా సహాయపడగలమో ఆలోచించాలన్నారు. వారికి ఎలా ఉపశమనం కలిగించాలనే విషయం గురించి ఆలోచించాలని చెప్పారు. గగ్గోలు పెట్టినప్పటికీ మరణించినవారు మళ్ళీ బతకబోరని చెప్పారు. ప్రజలను కాపాడటం కోసం అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. దీనికోసం ప్రతి ఒక్కరి సహాయం అవసరమని, రోగుల సహకారం కూడా అవసరమని తెలిపారు. 


హర్యానాలో ఆక్సిజన్ లభ్యత గురించి మాట్లాడుతూ, రాష్ట్రానికి ఆక్సిజన్ కోటాను 162 మెట్రిక్ టన్నుల నుంచి 240 మెట్రిక్ టన్నులకు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందిని తాము ఎదుర్కొనడం లేదన్నారు. ప్రస్తుత ధోరణిని పరిశీలించి, కోటాను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జంషెడ్‌పూర్ నుంచి అదనంగా 20 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను తెప్పించినట్లు తెలిపారు. 


హర్యానాలోని హిసార్, పానిపట్‌లలో తాత్కాలిక ఆసుపత్రుల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు అక్కడి ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్లను సందర్శిస్తానని చెప్పారు. ఈ ప్లాంట్ల వద్ద 500 పడకలతో ఆసుపత్రులను నిర్మిస్తామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. వీటి నిర్మాణం బుధవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. మూడు, నాలుగు రోజుల్లో నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపారు. Advertisement
Advertisement