Abn logo
Sep 23 2021 @ 18:40PM

ఆ ఉద్యోగులు... క్షణాల్లో కోటీశ్వరులయ్యారు...

న్యూఢిల్లీ : అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజ్ ’నాస్‌డాక్‌’లో చేరిన ఓ  భారతీయ సాఫ్ట్ వేర్ కంపెనీ... కొద్ది సమయంలోనే తన ఉద్యోగులు, మదుపరులకు విపరీతమైన లాభాలను తెచ్చిపెట్టింది. భారతీయ వ్యాపార సాఫ్ట్‌వేర్ తయారీదారు ఫ్రెష్‌వర్క్స్ కు చెందిన 500 మంది ఉద్యోగులు క్షణాల్లో కోటీశ్వరులు  అయ్యారు. యుఎస్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్‌డాక్‌లో ఫ్రెష్‌వర్క్స్ షేర్లు జాబితా అయ్యాయి. ఈ క్రమంలో ఉద్యోగులు అందుకున్న షేర్ల ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఐపీఓ ద్వారా కంపెనీ 1.03 బిలియన్ల డాలర్లను సమీకరించుకుంది. తమిళనాడులోని తిరుచ్చిలో 700 చదరపు అడుగుల గిడ్డంగితో ఈ కంపెనీ ప్రారంభమైంది. ఆ తర్వాత... దీని కార్యాలయాలు చెన్నై, కాలిఫోర్నియాల్లో ఏర్పాటయ్యాయి. 


ఫ్రెష్‌వర్క్‌ నిన్న(బుధవారం)... నాస్‌డాక్‌లో ప్రతీ షేరుకు 36 డాలర్ల ధరతో జాబితా అయింది. ఈ స్టాక్ ఆ తర్వాత...  25 %లాభంతో 48 డాలర్ల ధరకు చేరుకుంది. మరోవైపు... కంపెనీ మార్కెట్ క్యాప్‌ను 13 బిలియన్ డాలర్లకు పెంచింది. అంతేకాదు... ఉద్యోగులందుకున్న షేర్ల ధరలను కూడా పెంచివేసింది. కంపెనీ... ఐపీఓలో లో 2.85 కోట్ల షేర్లను రూ. 36 ధరతో విక్రయించడం గమనార్హం. కంపెనీ ముఖ్యకార్యనిర్వహణాధికారి గిరీష్ ఈ లిస్టింగ్ ద్వారా  కంపెనీ పెట్టుబడిదారులు, ఉద్యోగులకు  లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పారు. కంపెనీలోని దాదాపు 500 మంది ఉద్యోగులు ఈ క్రమంలో కోటీశ్వరులయ్యారు. 


సంస్థలో 76 శాతం మంది ఉద్యోగులకు వాటాలు...

సంస్థలోని 76 శాతం((4,300) మండి ఉద్యోగులకు వాటాలున్నాయి. లక్షాధికారులుగా మారిన 500 మంది ఉద్యోగుల్లో 70 మంది 30 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. ఈ ఉద్యోగులు తమ కళాశాల డిగ్రీలను పూర్తి చేసిన తర్వాత కొన్నేళ్ళ క్రితం కంపెనీలో చేరారు. సీక్వోయా, యాక్సెల్ వంటి పెట్టుబడిదారుల నుండి 3.54 బిలియన్ డాలర్ల విలువతో కంపెనీ 2019 నవంబరులో 154 మిలియన్ల డాలర్లను సేకరించింది. 


అమెరికాలో జాబితా అయిన మొదటి భారతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి సంస్థ ఫ్రెష్‌వర్క్స్... 

అమెరికా నాస్‌డాక్ స్టాక్ ఎక్స్ఛేంజిలో జాబితా అయిన మొదటి భారతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి సంస్థ ఫ్రెష్‌వర్క్స్. కంపెనీ ఐపీఓ  నుండి సేకరించిన డబ్బును వర్కింగ్ క్యాపిటల్, నిర్వహణ ఖర్చులు, ఇతర ఖర్చులకు ఉపయోగిస్తోంది. కొంత సొమ్మును మరో కంపెనీ కొనుగోలు కోసం కూడా ఉపయోగిస్తోంది.