Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇక్కడెన్నో తలపులెన్నో!

అస్తమించిన సిరి వెన్నెల 

మూగబోయిన రాజమహేంద్రవరం 

ఆవేదనలో ఆప్తమిత్రులు 

చదువు కాకినాడలో.. ఉద్యోగం రాజమహేంద్రవరంలో..

తొలి నాటి నుంచి చివరకు వరకు ఎన్నో గురుతులు

తన స్నేహితునితోనే వియ్యమొంది మరింత బంధం

సాహిత్యపరంగా జిల్లాతో అల్లుకున్న అనుబంధం

‘సిరివెన్నెల..’  తొలిసారి ఇక్కడే వెలుగులీనింది. మన కాకినాడలోనే ఇంటర్‌ విద్య.. పదవ   తరగతి అర్హతతో రాజమహేంద్రవరంలోనే బీఎస్‌ఎన్‌ఎల్‌లో ఉద్యోగం. సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రిలోనే తన తమ్ముడి ప్రోత్సాహంతో కవిత్వం వైపు అడుగులు. ఈ వీధుల్లోనే మిత్రులతో కలసి సాహితీ చర్చలు.. కాకినాడలో సభలు సమావేశాలు. గేయ రచయితగా తొలి అడుగు పడిందీ ఇక్కడి నుంచే. ఆ తర్వాతా  సహచరులతో అనుబంధం, సాహితీమిత్రులతో పెనవేసుకున్న బంధం.. ఒకటా రెండా జిల్లాలో ఎన్నెన్నో జ్ఞాపకాలు.

రాజమహేంద్రవరం సిటీ/ దివాన్‌చెరువు/ కాకినాడ (భానుగుడి), నవంబరు 30 : తన పదునైన అచ్చతెలుగు పదాలతో తెలుగు సినీ జగత్తును ఏలిన ప్రముఖ గేయ రచయత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారన్న వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. నిగ్గదీశి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అంటూ జన చైతన్యాన్ని తన రచనతో ఆలోచింపజేసిన సిరివెన్నెల మరణంతో రాజమహేంద్రవరం మూగబోయింది. ఆయన అనకాపల్లిలో జన్మించినా, ఎక్కువకాలం మన జిల్లాలోనే గడిపారు. తండ్రి సీవీ యోగి కాకినాడకు ఉద్యోగరీత్యా రావడంతో ఇక్కడే ఐడియల్‌ కాలేజీలో 1973లో సీతారామశాస్త్రి ఇంటర్‌ చదివారు. తదుపరి విద్యాభ్యాసానికి విశాఖ వెళ్లారు. కానీ తండ్రి మరణించడం, కుటుంబ బాధ్యతలు తన మీదే పడడంతో పదో తరగతి అర్హతతో రాజమహేంద్రవరంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థలో ఉద్యోగం రావడంతో అందులో చేరిపోయారు. అప్పటికే కవితలు రాస్తుండడం, ఆశువుగా సొంతంగా గేయాలు పాడుతుండడంతో ఆయన తమ్ముడు గేయ రచయితగా ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. అలాగే స్థానికంగా ఉన్న మిత్రులూ ప్రోత్సహించడంతో శాస్త్రి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. ఏడాదిన్నర రాజమహేంద్రవరంలోను, ఆరు నెలలు తాడేపల్లిగూడెంలోను ఉద్యోగం చేసిన ఆయ న 1976 లో కాకినాడకు బదిలీపై వచ్చారు. తన సాహితీ ప్రస్థానం ఇక్కడ మరింత మెరుగులు దిద్దుకుంది. అప్పట్లో ప్రతి నెలా వెన్నెల పేరుతో ట్రైబల్‌ అధికారి ఈవీ కృష్ణారావు నిర్వహించే వెన్నెల సాహి తీ సభలో ఆయన పాల్గొనేవారు. వెన్నెల పేరుతో నిర్వహించే ఈ సాహితీ సభలో ప్రతి నెలా తను రాసే సాహిత్యాన్ని ఒక పాటగా మలిచి పాడేవారట.  కాకినాడలో ఉద్యోగిగా పనిచేస్తూనే ఆయన సినీ పరి శ్రమలో అడుగుపెట్టారు. కాకినాడ వచ్చినప్పుడు మిత్రుల ఇంటికి వెళ్లి యోగక్షేమాలు తెలుసుకునే వారు. కాకినాడ సాహితీ సభల్లో చిటికెలు వేస్తూ పాటలు పాడుతుంటే సాహిత్యప్రియులు సీతారామ శాస్త్రిని చప్పట్లతో అభినందించేవారు. జిల్లాకు ఎప్పు డొచ్చినా తనకు ఇష్టమైన ప్రాంతాలనుచుట్టి సుబ్బ య్య హోటల్‌లో భోజనం చేసి తిరిగి వెళ్లేవారని స్నేహితులు గుర్తుచేసుకున్నారు. ఇక రాజమహేంద్రవరంలో ఉన్న తన స్నేహితుడు, వియ్యంకుడు అయిన వీటీ కాలేజీ రిటైర్డ్‌ అధ్యాపకుడు చాగంటి శరత్‌బాబు ఇంటికి వచ్చి సరదా గడిపి కింద చాపవేసుకుని పడుకుని టెలివిజన్‌ చూస్తూ, వేదాలు చదువుతూ గడిపేవారు. శరత్‌బాబు కుమార్తెను సిరివెన్నెల తన కుమారుడికి ఇచ్చి వివాహం చేయ డంతో  వీరి బంధం మరింత దగ్గరైంది. ఇక్కడకు వచ్చినప్పుడు తన మిత్రులు గంధం నాగసుబ్రహ్మణ్యం, వాడ్రేవు చిన్న వీరభద్రరావు, సన్నిధానం శర్మలను కలిసి వెళ్లేవారు. అలాగే గౌతమి గ్రంథాలయాన్ని సందర్శించి అక్కడ పురాతన గ్రంథాలను చదివేవారు. 2017 మార్చి 9న ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో జరిగిన వెయ్యేళ్ల తెలుగు సాహిత్య సమాలోచన సదస్సుకు ముఖ్య అతిఽథిగా సిరివెన్నెలను అప్పటి వైస్‌ చాన్సలర్‌ ముత్యాలనాయుడు ఆహ్వానించి సత్కరించారు. సరిగ్గా నెల కిందట సిరివెన్నెల వియ్యంకుడు, స్నేహితుడు అయి న శరత్‌బాబు అనారోగ్యంతో మరణించడంతో ఆయ న తల్లడిల్లిపోయారు. అక్టోబరులో వీటీ కాలేజీలో జరిగిన వియ్యంకుడి సంస్మరణ సభలో సిరివెన్నెల పాల్గొన్నారు. ఇక కాకినాడకు చివరిసారి 2019లో ఆయనకు సాహితీవేత్తలు నిర్వహించిన సన్మాన సభకు వచ్చిన ఆయన చాగంటి కోటేశ్వర్రావు ప్రవ చనాలు వినడంతోపాటు కాకినాడ గాంధీ భవన్‌ సందర్శిం చారు. స్నేహితులతో రంగరాయ ఆడిటోరి యంలో ఆనాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. 

సిరివెన్నెలకు.. ఇలా శ్రీకారం!

ద్రాక్షారామ/ అమలాపురం టౌన్‌, నవంబరు 30: చేంబోలు సీతారామశాస్త్రిని సిరివెన్నెలగా లోకానికి పరిచయం చేసిన చిత్రం ‘సిరివెన్నెల’. కాకినాడలో టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లో ఉద్యోగం చేస్తున్న సీతారామశాస్త్రిని ఆయన మిత్రుడు, రచయిత ఆకెళ్ల దర్శకుడు కె.విశ్వనాథ్‌కు పరిచయం చేశారు. దీంతో ఆయన సిరివెన్నెల చిత్రంలో పాటల రచయితగా సీతారామశాస్త్రికి అవకాశం ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాతలు రామచంద్రపురం పక్కనున్న పసలపూడికి చెందిన గీతాకృష్ణ మూవీ కంబైన్స్‌ అధినేతలు యు.చినవీర్రాజు, చింతా రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి భాస్కరరె డ్డి. సిరివెన్నెల చిత్రంతోపాటు ‘సిరిసిరిమువ్వ’కూ  వీరే నిర్మాతలు. కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన స్వాతికిరణం సినిమాలో శివానీ... భవానీ పాటను కూడా సిరివెన్నెల రాశారు. ఈ పాటను రామచంద్రపురంలోని రాజుగారి కోటలో చిత్రీకరించారు. విధాత తలపున ప్రభవించినది.. అంటూ సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్ర్తి తొలిపాట రాయగా ఆ పాటపై చర్చల్లో పాల్గొనడం నా జీవితంలో మరపు రాని అనుభవమని అమలాపురం పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత డాక్టర్‌ పైడిపాల పేర్కొన్నారు. సాహితీవనంలో సిరివెన్నెలలు పంచిన సీతారామశాస్ర్తి లేరన్నమాట జీర్చించుకోలేక పోతున్నామని విధాత తలంపు ఇదేనేమో అని కన్నీటి పర్యంతమయ్యారు.  అమలాపురం ఎస్‌కేబీఆర్‌ కళాశాలలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాలకు, 2012లో అమలాపురంలో జరిగిన తన కుమారుడైన శశికాంత్‌రెడ్డి వివాహానికి శాస్ర్తి దంపతులు హాజరై ఆశీర్వదించారని చెప్పారు. 

Advertisement
Advertisement