Abn logo
Sep 18 2021 @ 00:55AM

ఈ పరిషత్‌ ప్రత్యేకం!

ఒంగోలులోని జడ్పీ కార్యాలయం

చరిత్రలో సుదీర్ఘ ఎన్నికలు 

ఏడాదిన్నరలో పలు మార్పులు

లెక్కకు మించి ఆరోపణలు, 

సిబ్బందికీ టెన్షన్‌..టెన్షన్‌..

కోర్టు వ్యాజ్యాలు, తీర్పులు కూడా సంచలనమే

41 జడ్పీటీసీలకు బరిలో 153 మంది

367 ఎంపీటీసీలకు 940మంది పోటీ

ఐదేళ్లకోసారి ఎన్నికల తంతు మామూలే. కానీ ఈ సారి పరిషత్‌ ఫైట్‌ మాత్రం పూర్తి భిన్నంగా చరిత్ర గుర్తుంచుకునేనా నిలిచిపోతోంది. నోటిఫికేషన్‌ విడుదల కావడం, నామినేషన్ల ప్రక్రియ ముగిసి ఉపసంహరణలు, ఏకగ్రీవాలు, తుదిగా పోటీలో ఉండే అభ్యర్థుల ప్రకటన తర్వాత కరోనా ఉగ్రరూపం దాల్చింది. దీంతో వాయుదా ప్రకటన. ఉధృతి కొనసాగుతుండటంతో వరుసగా పొడిగింపులు. మధ్యలో ఎస్‌ఈసీల మార్పు. దాంతో మరికాస్త జాప్యం. మళ్లీ నోటిఫికేషన్‌, కోర్టు తీర్పులతో అది కాస్తా ఏడాదిన్నర అయింది. అంటే సాంకేతికంగా చూస్తే ఈ ఎన్నికలకు ఏడాదిన్నర వయసు. ఈ సమయంలో రోజూ ఏదో ఒక రూపేణా జనంలో గానీ, పార్టీల్లో గానీ, ఇక కోర్టుల్లో లెక్కకు మించి వ్యాజ్యాల రూపంలో చర్చ నడుస్తూనే ఉంది. ఈ సమయంలో జిల్లావ్యాప్తంగా ఏడుగురు ఎంపీటీసీ అభ్యర్థులు కన్నుమూశారు. బరిలో ఉన్న అభ్యర్థుల ఆర్థిక పరిస్థితీ తారుమారైంది. ముగ్గురు ఎస్‌ఈసీలు... ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికల బహిష్కరణ... ఇలా ఎన్నో చిత్రవిచిత్రాలకు చిహ్నంగా ఈ పరిషత్‌ ఎన్నికలు చరిత్రలో నిలిచిపోయాయి. రేపటితో సుదీర్ఘ ప్రక్రియకు తెరపడనుంది.

ఒంగోలు(జడ్పీ), సెప్టెంబరు 17 : ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కావడం.. తదనుగుణంగా ప్రక్రియ పూర్తవడం తర్వాత అభ్యర్థుల ప్రచారాలు, పంపకాలు.. అంతా ముగిసిన పిదప లెక్కింపు, ప్రమాణ స్వీకారోత్సవాలు ఇదీ స్థానిక ఎన్నికల వరుస. ఈ వ్యవహారం మొత్తం నెలలోపే ముగిసిపోయేది. పరిషత్‌ ఎన్నికలకు గతేడాది ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పుడు కూడా ఎస్‌ఈసీ ఇదే వ్యవధి కేటాయించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసి ఉపసంహరణలు, ఏకగ్రీవాలు, తుదిగా పోటీలో ఉండే అభ్యర్థుల ప్రకటన తర్వాత కరోనా ఉగ్రరూపం దాల్చడంతో ఈసీ ఎన్నికలను వాయుదా వేస్తూ ప్రకటన చేశారు. తర్వాత పొడిగిస్తూ వచ్చారు. ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ ఆగిన దగ్గర నుంచి కొనసాగేలా పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. 8న ఎన్నికల నిర్వహణ, 10న లెక్కింపు అని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇక్కడా ట్విస్టే. నోటిఫికేషన్‌ విడుదలలో సుప్రీంకోర్టు ఆదేశించిన నాలుగు వారాల ప్రవర్తనా నియమావళిని పరిగణనలోకి తీసుకోలేదని కోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. దీంతో కేవలం ఎన్నిక జరుపుకోవడానికి మాత్రమే అనుమతిచ్చిన కోర్టు కౌంటింగ్‌పై స్టే విధించింది. పలు విచారణల తర్వాత మే 21న ఏప్రిల్‌ 8న జరిగిన పోలింగ్‌ను రద్దుచేస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇది ఒక సంచలనం. మళ్లీ ఎస్‌ఈసీ తీర్పును డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేయగా కోర్టు కౌంటింగ్‌కు తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎట్టకేలకు పరిషత్‌ ఎన్నికల క్రతువుకు త్వరంలోనే శుభంకార్డు పడనుంది. 19న లెక్కింపు పూర్తయిన తర్వాత పాలకవర్గం ఏర్పాటుతో ప్రక్రియ ముగియనుంది. 

 

సిబ్బందికి టెన్షన్‌.. టెన్షన్‌...

సహజంగా ఎన్నికలంటే బరిలో నిలిచిన అభ్యర్థులకు గెలుపోటములపై టెన్షన్‌ ఉంటుంది. లేదంటే రాజకీయ పార్టీల అధినాయకత్వానికి ఫలితాలపై ఆందోళన ఉంటుంది. కానీ విచిత్రంగా పరిషత్‌ ఎన్నికల్లో ఆ ఒత్తిడి ఎదుర్కొంది మాత్రం విధులు నిర్వహించే సిబ్బంది. ఏప్రిల్‌ 8న పోలింగ్‌ అయితే ఏప్రిల్‌ 7 మధ్యాహ్నం 2గంటల వరకు కూడా ఎన్నికల నిర్వహణపై స్పష్టతరాని గందరగోళ స్థితిని ఉద్యోగులు అప్పట్లో  అనుభవించారు. అంతెందుకు ప్రస్తుతం కౌంటింగ్‌కు కూడా ఈసీ ఇచ్చిన రెండురోజుల వ్యవధిలోనే ఏర్పాట్ల కోసం కిందమీద పడుతున్నారు. ఈ విధంగా అభ్యర్థులకు కాకుండా ఆనవాయితీకి భిన్నంగా ఉద్యోగులకు టెన్షన్‌ క్రియేట్‌ చేసిన ఎన్నికలుగా ఇవి నిలిచిపోతాయి.