Abn logo
Sep 4 2020 @ 04:34AM

ఈ ఉద్యోగం చేయలేం?

Kaakateeya

పంచాయతీ కార్యదర్శుల ఆవేదన

15రోజుల్లో 75శాతం పన్నుల వసూళ్లు

40వేల మొక్కలు నాటేందుకు లక్ష్యం విధింపు

సెప్టెంబరు 15వ తేదీ వరకు గడువు

వందశాతం పన్నుల వసూళ్లకు కార్యదర్శుల నుంచి

సంజాయిషీ రాయించుకున్న అధికారులు


తాండూరు : పక్షం రోజుల్లో 75శాతం పన్నుల వసూళ్లు.. 40వేల మొక్కలు నాటాలి.. లేకుంటే ఉద్యోగానికి గండమే.. అంటూ పరోక్ష హెచ్చరికలు.. ఇవీ పంచాయతీ కార్యదర్శులకు ఉన్నతాధికారులిచ్చిన ఆదేశాలు. దీంతో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం, ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో నలిగిపోతున్నారు. కరోనా కష్టకాలం, గ్రామాల్లో  పాజిటివ్‌ కేసుల పెరుగుదలతో 70శాతం పన్నులు ఈనెల 15లోగా ఎలా వసూలు చేయాలని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు వసూలు కాకుంటే జీతాలు వేయడం కష్టమేనని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలిస్తున్నారు. తాజాగా, పంచాయతీరాజ్‌ శాఖ జారీచేసిన ఆదేశాలతో కార్యదర్శులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


ఇన్ని రోజులు హరితహారం మొక్కలపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం ఇప్పుడు హడావిడిగా ప్రతి గ్రామంలో 40వేల మొక్కలు నాటాలని, అందుకు పంచాయతీ కార్యదర్శులదే బాధ్యత అని ఆదేశించింది. పల్లెప్రకృతి వనాల నిర్వహణ, ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ వంటి కొత్త బాధ్యతలను మోపడంతో ఉద్యోగం చేయడమే కష్టంగా మారిందని పలువురు వాపోతున్నారు. మండలస్థాయి అధికారులు రాచి రంపాన పెడుతున్నారని మరింత కుంగిపోతున్నారు. ఉద్యోగంలో తక్కువ అనుభవం, ఎక్కువ పనిభారం ఉండటంతో మానసిక ఆందోళనతో ఉద్యోగాలు మానుకునే పరిస్థితి ఏర్పడిందని కొందరంటున్నారు. ఎంపీడీవో కార్యాలయంలో సమావేశాల పేరిట రాత్రి వరకు సమీక్షలతో సతమతమవుతున్నా రు. ఇటీవల ఉపాధి పనులను కూడా వారిపైనే పెట్టడంతో కూలీల కోసం కూడా వెతికే పరిస్థితి ఏర్పడింది. 


కార్యదర్శుల నుంచి సంజాయిషీ

గత ఆగస్టు నెల 26వరకు 75శాతం కన్నా తక్కువ పన్నులను వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులతో ఉన్నతాధికారులు సం జాయిషీ రాయించుకున్నారు. ఈనెల 5లోపు నూరుశాతం పన్నులు వసూలు చేస్తామని సంజాయిషీలో పేర్కొని, వసూళ్ల వివరాలను డీసీబీపైన సంతకం చేసి, దాని కాపీని జిల్లా పంచాయతీ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా పంచాయతీ అధికారుల నుంచి కూడా ఆదేశాలు అందాయి. కరోనా సమయంలో పన్నుల  వసూళ్లకు వెళితే ప్రజలు తిరగబడుతున్నారని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాయింట్‌ చెక్‌ పవర్‌ కూడా కార్యదర్శులకు లే కుండా ఉపసర్పంచ్‌కు కట్టబెట్టారు. అడ్డగోలు నిబంధనలు, 3నెలలకోసారి వేతనాలు రావడంతో ఇబ్బందులు పడుతున్నామని కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు.

Advertisement
Advertisement