Abn logo
Sep 24 2021 @ 00:15AM

ఈ అవ్వ పింఛన్‌ తీసేశారు

రేకులు కప్పిన పాత మట్టి మిద్దె బయట.. ఎవరి కోసమో ఎదురు చూస్తున్న ఈ అవ్వ పేరు గర్జమ్మ. ఆదోని మండల పరిధిలోని చాగి గ్రామం. వయసు 80 ఏళ్లకు పైగానే ఉంటుంది. ఈమె భర్త చంద్రారెడ్డి 10 సంవత్సరాల క్రితమే చనిపోయారు. ఉన్న ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశారు. కొడుకులు లేరు. 80 సెంట్ల పొలం ఉంది. కానీ తాను సాగు చేయలేదు. అందుకే బీడువారింది. ఒంటరిగా జీవిస్తున్న ఈ అవ్వకు ప్రభుత్వ పింఛనే ఆధారం. నెలకు రూ.70 పింఛన్‌ వచ్చే కాలం నుంచి తీసుకుంటోంది. ఆ సొమ్ముతో రేషన్‌ సరుకులు, నిత్యావసరాలు కొని కడుపు నింపుకునేది. కానీ మూడు నెలల నుంచి పింఛన్‌ అందడం లేదు. కారణం తెలియక ఎంపీడీవో, తహసీల్దారు కార్యాలయాల చుట్టూ తిరుగుతోంది. ఓసారి ఎమ్మెల్యే ఇంటి వద్దకు కూడా వెళ్లి సమస్య చెప్పుకుంది. ఆటో చార్జీలకు అప్పు చేయడమేగాని, సమస్య పరిష్కారం కాలేదు. మూడు నెలల నుంచి ఇరుగు పొరుగువారు దయ తలచి ఓ ముద్ద పెడితే తింటోంది. లేదంటే పస్తులు ఉంటోంది. ఈ నేపథ్యంలో మరోమారు గురువారం చేతికి ఓ సంచి తగిలించుకుని ఎంపీడీవో కార్యాలయానికి వచ్చింది. ఆధార్‌, రేషన్‌, ఓటరు ఐడీ కార్డులు, పింఛన్‌ పుస్తకాన్ని అధికారులకు చూపించి.. రెండు చేతులు జోడించించి తన పరిస్థితిని వివరించింది. ఇంటికి తిరిగి వెళ్లడానికి కూడా తన వద్ద డబ్బులు లేవని కంటతడి పెట్టుకుంది. అక్కడే ఉన్న చాగి పంచాయతీ కార్యదర్శి కృష్ణ, అవ్వకు కొంత డబ్బు ఇచ్చి పంపారు. పింఛన్‌ ఐడీ, ఓటరు ఐడీ కార్డులో అవ్వ వయసు 80 సంవత్సరాలు చూపుతోందని, కానీ ఆధార్‌ కార్డులో 56 ఏళ్లు చూపిస్తోందని, అందుకే పింఛన్‌ కట్‌ అయ్యిందని కార్యదర్శి తెలిపారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అవ్వకు పింఛన్‌ వచ్చేలా చూస్తామని అన్నారు.


ఎప్పుడు కూలిపోతుందో తెలియనట్లుండే పాత ఇంటి ముందు నిలబడి.. ఈ అవ్వ ఎదురు చూస్తున్నది పింఛన్‌ డబ్బుల కోసం మాత్రమే కాదు, ప్రభుత్వం నియమించిన వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, అధికారులు తమ విధులను ఎప్పుడు సక్రమంగా నిర్వర్తిస్తారా..? తనలాంటి వారి సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుందా..? అని కూడా..!


- ఆదోని రూరల్‌