Abn logo
Aug 2 2021 @ 00:55AM

నత్తతో ‘ఈ క్రాప్‌’ పోటీ

ఈ క్రాప్‌ నమోదుచేస్తున్న సిబ్బంది

పనిచేయని యూడీపీ యాప్‌ 

ఒక్కొ రైతు వివరాల   నమోదు అర గంట 

తలబాదుకుంటున్న   క్షేత్రస్థాయి సిబ్బంది

హిందూపురం టౌన్‌,  ఆగస్టు 1 : వ్యవసాయశాఖ కొత్తగా తీసుకొచ్చిన యూడీపీ (యూనిఫైడ్‌ డిజిటల్‌ ప్లాట్‌ ఫాం) యాప్‌లో ఈ క్రాప్‌ నమోదుకు  క్షేత్రస్థాయి సిబ్బంది పడరాని పాట్లు పడుతోంది.  గత ఏడాది జరిగిన తప్పులు, అవాంతరాలు అదిగమించేందుకు సరి కొత్తగా ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ కూడా సిబ్బందికి చుక్కలు చూ పిస్తోంది. పంట నమోదు వివరాలు సక్రమంగా కాకపోవడంతో ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది.  ప్రభుత్వ పథకాలు, రాయితీలు పొందాలంటే పంట సాగుచేసిన రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్‌ చేయించు కోవాల్సి ఉంది. గత యేడాది ఈక్రాప్‌లో తలెత్తిన లోపాల కారణంగా కొంతమంది రైతులు నష్టపోయారు. మరికొంత మంది రైతులైతే పంటలు సాగు చేయకుండానే ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. దీన్ని గుర్తించిన అధికారులు నిబంధనలు కఠినతరం చేశారు. అయినా అక్రమాలను కట్టడి చేయలేకపోయారు. ఈ తరుణంలో ఈ క్రాప్‌ మరింత పకడ్బందీగా చేయాలని నిర్ణయించారు. రైతు తన పొలం వద్ద నిలుచున్న చిత్రం తీసి క్షేత్రస్థాయిలో వివరాలు నమోదు చేయాలి. అప్పుడే ప్రభుత్వ పథకాలు రైతులకు వర్థిస్థాయి. దీనిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. ఫలితంగా పథకాలకు ప్రభుత్వ సాయం పొందలేకపోతున్నారు. 


ఈ సారైనా అధిగమించేరా 

గత ఏడాది ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం సరికొత్తగా  ఈ యాప్‌ను రూ పొందించింది.  సచివాలయాల్లో పనిచేసే వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్‌ సహాయ కులకు ఈక్రాప్‌ నమోదు బాధ్యతలను ప్రభుత్వం అప్పజెప్పింది. అయితే ఈ యాప్‌పై సరైన అవగాహన లేకపోవడం, రెవెన్యూ సిబ్బంది లేకపోవడంతో వివరాల నమోదులో చాలా ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. గతంలో ఆధార్‌కానీ, పట్టాదారు నంబరు కానీ నమోదుచేస్తే వివరాలు పూర్తీగా కనిపించేవి. రైతు ఫోటో తీసుకుని జియో ట్యాగింగ్‌ చేసేవారు. కొత్తగా వచ్చే యాప్‌లో అలా చేయడం కుదరలేదు. ఖాతా నంబరు నమోదు చేసినప్పుడు ఆ రైతు వివరాలు రావడం లేదు. ఆ రైతు స్థానంలో ఇతర రైతుల పేర్లు కనిపిస్తు న్నాయి. భూములొకచోట.. రైతులు నివాసం మరోచోట ఉండటంతో సర్వే సిబ్బందికి ఇబ్బందిగా మారింది. రెవెన్యూ గ్రామాలు మారితే పట్టాదారు పాసుపుస్తకం క్రమ సంఖ్య మారిపోతుంది. దీంతో నమోదు ప్రక్రియలో ఎడతెగని జాప్యం జరుగుతోంది. 


  గత ఏడాది రోజుకు 50 మందికిపైగా రైతుల సర్వే నంబర్లు నమోదు చేసేవారు. ప్రస్తుతానికి రోజుకు 15 నుంచి 20 మందివి కూడా ఈక్రాప్‌ నమోదు చేయలేకపో తున్నారు. యూడీపీ యాప్‌లో అనసవ రమైన ప్రశ్నలు ఉండటంతో అన్ని పూర్తీచేస్తేతప్ప నమోదు కాదు. ప్రతి రైతుకు నమోదుకు 25 ప్రశ్నలు పూర్తీ చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా ఒక రైతుకు అరగంట పాటు సమయం పడు తోంది. దీనికితోడు వర్షన్‌ కూడా మార్చాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా ఆలస్యం కావడంతో ట్యాబ్‌లో చార్జింగ్‌ త్వరగా అయిపోతోందని సిబ్బంది వాపోతోంది. 


 నమోదు 2 వేల ఎకరాలే 

హిందూపురం వ్యవసాయశాఖ పరిధిలోని ఐదు మండలాల్లో అత్యధికంగా వేరుశనగ, మొక్కజొన్న సాగు చేస్తారు. ఆ తరువాత కంది, తెల్లజొన్న, రాగి, వరి, ఆముదం పంట, ఉలవలు, పొద్దుతిరుగుడు సాగు చేస్తారు. అన్ని పంటలు కలిపి సుమారు 80 వేల ఎకరాల్లో సాగు అవుతుంది. 40 వేల మందికిపైగా రైతులు ఉన్నారు. కానీ శనివారం నాటికి 2 వేల ఎకరాలలోపే నమోదైనట్లు వ్యవసాయాధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ ప్రక్రియ సెప్టెంబరు వరకు ఉంటుందని అధికారులు అంటు న్నారు. అయినా కానీ ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి లక్ష్యం చేరుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే. 

 

76 ట్యాబ్‌లతో నమోదు : రవి, ఏడీ 

హిందూపురం వ్యవసాయశాఖ డివిజన్‌ పరిధిలో హిందూ పురం, పరిగి, లేపాక్షి, చిలమ త్తూరు, గోరంట్ల మండలాల్లో 80 వేల ఎకరాల వరకు ఉంది. ఇందుకోసం 76 ట్యాబ్‌ లతో ఈక్రాప్‌ నమోదు చేస్తు న్నారు. ఈ ప్రక్రియ సెప్టెంబరు వరకు కొన సాగుతుంది. అయితే కొత్తగా వచ్చిన యూ డీపీ యాప్‌లో కొన్ని సాంకేతిక సమస్యలు న్నాయి. వాటిని సరిదిద్దాలని ఉన్నతాధికా రులకు నివేదించాం. అవి పూర్తీ అయితేనే ఈ క్రాప్‌ పూర్తవుతుంది.