Abn logo
Sep 30 2020 @ 05:28AM

తిరుమల కాటేజీల పునరుద్ధరణ టెండర్లలో టీటీడీకి రూ. 67.13 కోట్ల ఆదాయం

Kaakateeya

13 అతిధి గృహాలకు టెండర్లు పిలిస్తే 11 గృహాలకు బిడ్లు దాఖలు

నామినేషన్‌ పద్ధతికి బదులు ఓపెన్‌ టెండర్లతో పెరిగిన ఆదాయం

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌


తిరుపతి, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో గడువు ముగిసిన అతిధి గృహాల పునరుద్ధరణకు టీటీడీ పిలిచిన టెండర్లలో దేవస్థానానికి రూ. 67.13 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. దాతలు నిర్మించి ఇచ్చిన పలు అతిధి గృహాలకు గడువు సమీపిస్తుండడంతో వాటిని పునర్నిర్మించేందుకు నామినేషన్‌ ప్రాతిపదికన కావాల్సిన ప్రముఖులకు, సంస్థలకు కేటాయించే దిశగా దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంటోందని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. దాంతో టీటీడీ యంత్రాంగం నామినేషన్‌ ప్రాతిపదికన కాకుండా ఓపెన్‌ టెండర్లు పిలవాలని నిర్ణయించడం, ఆ మేరకు టెండర్లు కూడా పిలవడంతో పలువురు వ్యక్తులతో పాటు సంస్థలు ముందుకొచ్చి పోటాపోటీగా బిడ్లు దాఖలు చేశాయి. దీంతో దేవస్థానానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. 

 

తిరుమలలో సాధారణ కాటేజీలతో పాటు అధిక అద్దెలు వసూలు చేసే అతిధి గృహాల వరకూ అన్నీ దాదాపుగా దాతలు కట్టించి ఇచ్చినవే. శ్రీవారి భక్తులు దేవస్థానానికి తమ కానుకగా తమ పేరిట భవనాలు నిర్మించి టీటీడీకి అప్పగిస్తుంటారు. వాటిని ఏడాదికి కొన్ని రోజుల పాటు దాతలకు కేటాయించి మిగలిన రోజుల్లో భక్తులకు అద్దెలపై కేటాయించడం జరుగుతుంది. భవన నిర్మాణాన్ని బట్టి ఇంజనీరింగ్‌ అధికారులు నిర్ణయించే గడువు ముగిశాక వాటి పునరుద్ధరణ లేక కూల్చివేసి పునర్నిర్మాణం చేపట్టాల్సిన సందర్భం వచ్చాక టీటీడీ పూర్వపు దాతలనే సంప్రదిస్తుంది.ముందుకు రాకపోతే వారి స్థానంలో అవకాశాన్ని ఇతరులకు కల్పిస్తారు. అయితే తిరుమలలో అతిధి గృహాలు నిర్మించి ఇవ్వడానికి  శ్రీవారి భక్తులు పోటీ పడుతుంటారు.


ఆ డిమాండును దృష్టిలో వుంచుకుని టీటీడీ భవన నిర్మాణ వ్యయం భరించడంతో పాటు టీటీడీకి భారీ మొత్తంలో నగదు డిపాజిట్‌ చేయాలంటూ దాతలకు  నిబంధన విధించింది. అయినా కూడా అతిధి భవనాల నిర్మాణానికి దాతల నుంచీ పోటీ తగ్గడం లేదు. వీటిలో రాజకీయ ఒత్తిళ్లు కూడా వుంటున్నాయి. ఆ క్రమంలో ఇటీవల తిరుమలలో పూర్వపు దాతలు నిర్మించిన పలు అతిధి గృహాల గడువు ముగిసింది. వాటి పునరుద్ధరణకు కొందరు ముందుకు రాగా 13 అతిధి గృహాలకు పూర్వపు దాతలు ఆసక్తి చూపలేదు.


దాంతో వాటిని తమకు కావాల్సిన వారికి కట్టబెట్టేందుకు టీటీడీ పాలకమండలిలో కొందరు ప్రయత్నించారన్న ఆరోపణలు వచ్చాయి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు, దేవస్థానానికి సుదీర్ఘ కాలంగా భారీ మొత్తాల్లో కానుకలు సమర్పిస్తున్న వారెందరో వున్నప్పటికీ వారిని కాదని రాజకీయంగా పలుకుబడి కలిగిన వారికి అవకాశం కల్పిస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది. దీంతో టీటీడీ నామినేషన్‌ ప్రాతిపదికన కాకుండా ఓపెన్‌ టెండర్లు పిలవాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకుంది.


11 అతిధి గృహాలకు రూ. 67.13 కోట్ల డిపాజిట్లు

13 అతిధి గృహాల పునరుద్ధరణ లేదా పునర్నిర్మాణానికి టీటీడీ ఓపెన్‌ టెండర్లు పిలవగా 11 అతిధి గృహాలకు దాతల నుంచీ బిడ్లు దాఖలయ్యాయి. అత్యధికంగా శ్రీపతి రెస్ట్‌ హౌస్‌కు రూ. 7.11 కోట్లు దాఖలు చేయగా, అత్యల్పంగా కరమ్‌ నివాస్‌ రెస్ట్‌ హౌస్‌కు రూ. 5 కోట్లు దాఖలైంది. అతిధి గృహాల వారీగా చూస్తే శ్రీపతి రెస్ట్‌ హౌస్‌ కోసం మూడు బిడ్లు దాఖలయ్యాయి. వీటిలో ఫీనిక్స్‌ పవర్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ అత్యధికంగా రూ. 7.11 కోట్లకు దాఖలు చేయగా, రాజేశ్‌ శర్మ అనే వ్యక్తి మరికొందరితో కలసి సంయుక్తంగా రూ. 6.50 కోట్లకు బిడ్‌ దాఖలు చేశారు. అదే అతిధి గృహానికి ఓంప్రకాష్‌ అగర్వాల్‌ అనే భక్తుడు 5 కోట్లా 11 వేల రూపాయలకు బిడ్‌ వేశారు. లక్ష్మీ నిలయం రెస్ట్‌ హౌస్‌ కోసం పిచ్చమ్మాల్‌ ఎడ్యుకేషనల్‌ అండ్‌ ఛారిటబుల్‌ ట్రస్టు రూ. 7 కోట్లకు బిడ్‌ వేసింది. గోదావరి సదన్‌ అతిధి గృహానికి ఎస్‌.భాగ్యశ్రీ అనే భక్తురాలు రూ. 5.99 కోట్లకు బిడ్‌ దాఖలు చేశారు.


మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అనే సంస్థ విద్యాసదన్‌, వకుళ, శ్రీనికేతన్‌, గోదావరి రెస్ట్‌ హౌస్‌లలో ఏదైనా ఒకదానికోసమంటూ రూ. 5.50 కోట్లు దాఖలు చేసింది. అలాగే గోదావరి, శ్రీనికేతన్‌ రెస్ట్‌ హౌస్‌లలో ఏదైనా ఒకదానికోసమంటూ పి.శరత్‌చంద్రారెడ్డి అనే భక్తుడు రూ. 5.98 కోట్లకు బిడ్‌ దాఖలు చేశారు. కరమ్‌ నివాస్‌ రెస్ట్‌ హౌస్‌ కోసం ఎం.ఎస్‌.రక్షా రామయ్య, ఎం.ఎస్‌.సుందర్‌ రామ్‌ అనే వ్యక్తులు సంయుక్తంగా రూ. 5 కోట్లకు బిడ్‌ వేశారు. మై హోమ్స్‌ సంస్థ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వరరావు సన్నిహిత బంధువైన జూపల్లి శ్యామ్‌రావు ఫలానా అతిధి గృహాన్ని తర్వాత ఎంపిక చేసుకుంటామని పేర్కొంటూ రూ. 7 కోట్లకు బిడ్‌ వేశారు. అలాగే బూదాటి లక్ష్మీనారాయణ అనే భక్తుడు సైతం ఇదే ప్రాతిపదికన రూ. 6.80 కోట్లకు టెండర్‌ కోట్‌ చేశారు. తిరుపతిలో స్మార్ట్‌ సిటీ కింద ఫ్లై ఓవర్‌ పనులు చేపట్టిన ఆఫ్కాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ అనే సంస్థ ఏదో ఒక అతిధి గృహం కేటాయిస్తే చాలంటూ రూ. 5.25 కోట్లకు బిడ్‌ వేసింది.


ఈ బిడ్లలో అత్యధిక మొత్తం దాఖలు చేసిన వారికి అతిధి గృహాలను ఎంపిక చేసుకోవడంలో తొలి అవకాశం కల్పిస్తారు.మొత్తంమీద బిడ్‌ దాఖలు చేసిన అందరికీ ఏదో ఒక అతిధి గృహం దక్కే అవకాశముంటుంది. మొత్తానికీ ఈ ఓపెన్‌ టెండర్ల వల్ల దేవస్థానానికి రూ. 67.13 కోట్లు ఆదాయం సమకూరడంతో పాటు ఆయా దాతలు అదనంగా భవన నిర్మాణాలను సొంత ఖర్చు మీద చేపట్టి టీటీడీకి అప్పగించాల్సి వుంటుంది. గతంలో దాతలకు ఏడాదిలో 60 రోజుల పాటు అతిధి గృహాలను కేటాయించేవారు. ఇప్పుడు ఆ విధానంలో మార్పు తీసుకొచ్చి కేవలం 30 రోజులు మాత్రమే కేటాయించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement
Advertisement