Abn logo
Jul 10 2021 @ 08:49AM

హైదరాబాద్‌లో దొంగల హల్‌చల్‌.. వాళ్ల పనేనా..!?

  • రాచకొండ పరిధిలో మూడు ఇళ్లల్లో చోరీ 
  • 17.5 తులాల బంగారం అపహరణ  
  • చెడ్డీగ్యాంగ్‌గా అనుమానం

హైదరాబాద్‌ సిటీ : నగర శివారులో దొంగలు రెచ్చిపోయారు. కీసర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఒకేరోజు రాత్రి మూడు ఇళ్లలో చోరీ చేశారు. మొత్తం రూ.9లక్షల విలువైన 17.5 తులాల బంగారు ఆభరణాలు దోచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బృందాలుగా ఏర్పడి దొంగలకోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను బట్టి చోరీలకు పాల్పడింది చెడ్డీ గ్యాంగ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు. 


తలపాగా.. ముఖానికి ముసుగు..

దుండగులు ముఖానికి ముసుగులు, తలపాగా ధరించారు. చేతులు వెనక్కి పెట్టుకొని వంగి వంగి నడుస్తూ ఇళ్లలో వెళ్తున్నట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. వారి నడకను బట్టి చెడ్డీగ్యాంగ్‌గా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు..

శివారు ప్రాంతంలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన దుండగులు విలువైన బంగారు ఆభరణాలు దోచేశారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మెయిన్‌ డోర్‌లకు సెంట్రల్‌ లాకింగ్‌ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని, ఇంటి సమీపంలో సీసీటీవీ ఫుటేజీలు, ఖరీదైన ఇంటికి అలారం సిస్టంను పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. బంగారం, నగదు వంటి ఖరీదైన వస్తువులు ఇళ్లలో ఉన్నప్పుడు సరైన జాగ్రత్తలు పాటించాలి. దొంగల గురించి ఏదైనా సమచారం తెలిసినా, చోరీ చేయడానికి ప్రయత్నించినా వెంటనే డయల్‌-100 కు, 9490617111 కు సమాచారం ఇవ్వాలని రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు.