Abn logo
Apr 7 2020 @ 09:22AM

ఇబ్బందే... కానీ ఆందోళన వద్దు!

ఆంధ్రజ్యోతి(07-04-2020)

క్లినిక్‌లు బంద్‌. ఆసుపత్రుల్లో సాధారణ సేవలు బంద్‌!క్లినికల్‌ లేబరేటరీలు తెరుచుకోవడం లేదు. కావలసిన మందులు దొరకడం లేదు! లాక్‌డౌన్‌తో షుగర్‌, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల పరిస్థితి అగమ్యగోచరమైపోయింది! అయితే ఆందోళన ఆరోగ్యంపై మరింత దుష్ప్రభావం చూపిస్తుంది! తగిన జాగ్రత్తలు పాటిస్తే లాక్‌డౌన్‌ సమయంలోనూ ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు!


ప్రాణాంతక కరోనా వైర్‌సను కట్టడి చేయడానికి విధించిన లాక్‌డౌన్‌ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో ఆందోళన పెంచుతోంది. మధుమేహం, రక్తపోటు ఉన్నవారిపైనా, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీవ్యాధులు, క్యాన్సర్‌ బాధితులలో వైరస్‌ వ్యాప్తిచెందే అవకాశాలు ఎక్కువగా ఉండడం అందుకు కారణం.


జీవనశైలిపై ప్రభావం!

ఉదయం, సాయంత్రం నడిచే అలవాటు ఉన్న షుగర్‌, బిపి ఉన్నవారు ప్రస్తుతం వీధుల్లోకి వెళ్ళి నడిచే అవకాశం లేదు. అలాగే ఇంటికే పరిమితం అవడంతో అవసరానికి మించి ఆహారం తీసుకుంటూ ఉంటారు. శరీరానికి స్వల్ప వ్యాయామం కరువవడం, ఆహారం పెరగడం వల్ల శరీరంలోని చక్కెర, రక్తపోటు స్థాయిలు పెరిగే అవకాశం లేకపోలేదు. అలాగే మధుమేహం, రక్తపోటు సంబంధిత మందులకు కూడా కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిలో ఏం చేయాలి?


ఈ జాగ్రత్తలు పాటిద్దాం!


ఒకటి, రెండు నెలలు ఫరవాలేదు: ఎంతో కాలంగా షుగర్‌, బీపీలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకొని, మందులు వాడి ఉంటారు. కాబట్టి ఒకటి రెండు నెలలు పరీక్షలు చేయించుకోకపోయినా అంతగా నష్టం ఉండదు. అనవసరంగా ఆందోళన చెంది, కొత్త సమస్యలు తెచ్చుకోకూడదు.


వ్యధకు గురికావద్దు: ప్రస్తుతం నెలవారీ ఆరోగ్య పరీక్షలకు వీలు లేకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఆహారమార్పుల వల్ల షుగర్‌, బీపీ స్థాయులు పెరిగినట్టు అనిపించడం సహజం. కంగారు పడకూడదు. 


వాటినే కొనసాగించాలి: బీపీ, షుగర్‌ స్థాయుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇదివరకు వాడుతున్న మందులనే కొనసాగించాలి. అవి దొరక్కపోతే అదే కాంబినేషన్‌ ఉన్న వేరే మందులు వేసుకోవచ్చు. అనుమానాలు పెట్టుకోనవసరం లేదు.


తక్కువ ఆహారం ఎక్కువసార్లు: వ్యాయామం లోపించింది కాబట్టి శరీర కనీస అవసరాలకు అవసరమైన క్యాలరీలు ఇచ్చే ఆహారాన్నే తీసుకోవడం మంచిది. అందుకోసం తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి. 


ఇవి తినాలి: జీర్ణక్రియకు ఎక్కువ సమయం తీసుకునే రాగి, జొన్న, సజ్జ, కొర్రలు వంటి చిరుధాన్యాలు ఆహారంగా తీసుకోవడం మంచిది. షుగర్‌ బాధితులు పంచదార పూర్తిగా మానేసి బెల్లం, తాటిబెల్లం లాంటివి తీసుకోవచ్చు. పంచదారకు బదులుగా ఉపయోగించే స్టీవియా వాడడం ఇంకా మంచిది. స్వీట్స్‌ మానేయాలి. నూనెలు బాగా తగ్గించాలి. బీపీ బాధితులు ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. 


ఇంట్లోనే వ్యాయామం: పగటి సమయంలో ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా ఇంట్లోనే అటూ, ఇటూ తిరుగుతూ వ్యాయామం చేయవచ్చు. యోగా, ధ్యానం కూడా చేసుకోవచ్చు.


పదే పదే పరీక్షలు వద్దు: చాలామంది ఇంట్లో ఉండే గ్లూకో మీటర్‌తో బ్లడ్‌షుగర్‌ను, డిజిటల్‌ బిపి ఆపరేటర్‌తో రక్తపోటు స్థాయులనూ పదే పదే చెక్‌ చేసుకుంటూ ఉంటారు. వచ్చిన ఫలితాలు చూసి ఆందోళన చెందవద్దు. ఒకటి రెండు నెలలు బీపీ, షుగర్‌ స్థాయిల్లో పెరుగుదల ఉన్నా నష్టం ఏమీ లేదు. కాంప్లికేషన్స్‌ అంత త్వరగా రావు. 


సొంత వైద్యం వద్దు: వైద్యుడిని ఫోన్‌ ద్వారా సంప్రతించి సలహాలు తీసుకోవచ్చు. అత్యవసరం అయితే 108 సేవలను ఉపయోగించుకోండి. ఏదో జరిగిపోతుందన్న భయంతో సొంత వైద్యం చేసుకోకూడదు. లాక్‌డౌన్‌ ముగిశాక మీ వైద్యుణ్ణి కలిసి, అవసరమైన పరీక్షలు చేయించుకోండి. 


- డాక్టర్‌ టి. సేవకుమార్‌

సర్వీస్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌, గుంటూరు

Advertisement
Advertisement
Advertisement