Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘‘రాసే వరకు మనశ్శాంతి లేదు. రాసినా మనశ్శాంతి రాదు.’’

అమెరికా జీవనవిధానం మీకు కొత్త కథావస్తువులనిచ్చిందా, లేక సమాజం, సమస్యలెక్కడైనా ఒకేలా ఉన్నాయంటారా?

నేను రాసిన కథల్లో కేవలం అమెరికాకే పరిమితమైన ప్రత్యేక కథలంటూ ఏమీ లేవు. ఇవన్నీ ఎక్కడైనా జరిగే కథలే. అయితే ఈ కథల్లోని వాతావరణం మొత్తం అమెరికా. అలాగే కొన్ని అమెరికన్‌ పాత్రలు. స్థలాన్ని ఇండియా చేసి, పాత్రల పేర్లు మారిస్తే ఇవన్నీ ఇండియా కథలు కూడా అవుతాయి. గే మ్యారేజీ, లెస్బియన్‌ రిలేషన్‌షిప్‌, ‘కోట్‌ హేంగర్‌’ కథలోని సెల్ఫ్‌ అబార్షన్‌ చేసుకున్నందుకు జైల్లో ఉన్న ప్రీతి- ఇలాంటి కొన్ని విషయాల్లోని తీవ్రత అమెరికాకు ప్రత్యేకం కావచ్చు. LGBT  సమస్యలు ఇండియాలో కూడా ఉన్నాయి. కానీ ఈ అంశం గురించి లోతైన పరిశీలనతో ఇండియా నేపథ్యంతో మరిన్ని కథలు రావాల్సి ఉంది. అంతేతప్ప ఈ ఇతివృత్తాలు కేవలం అమెరికాకు పరిమితమైనవి కాదు. నా కథలు పూర్తిగా కొత్త కథావస్తువులని నేను క్లైమ్‌ చేయటం లేదు. నేను కథనీకరించిన పద్ధతి, చర్చకు పెట్టిన పద్ధతి అమెరికా లోని తెలుగు రచయితల కంటే భిన్నంగా చేశానని చెప్పగలను. అమెరికా మీద ఉన్న అపోహల్ని నా కథలు కొంతమేరకైనా తొలగి స్తాయని నమ్ముతున్నాను. స్వేచ్ఛకు మారుపేరైన అమెరికాలో కూడా ఉన్న ఈ సమస్యలని చర్చకు పెట్టడమే కథల ఉద్దేశ్యం. గ్లోబలైజేషన్‌ తర్వాత ఇండియా, అమెరికాల జీవన విధానంలో తేడా క్రమేపీ తగ్గిపోతూ వస్తోంది. సమస్యల్లో సార్వజనీనత స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికాకు మాత్రమే సంబంధించిన కథలు మరింత స్పష్టతతో మరింత ఎక్కువగా వచ్చే సందర్భం తొందరలోనే ఉంది. 


అయిదోగోడ సంకలనంలోని కథలు రాసే క్రమంలో మిమ్మల్ని ఎక్కువ బాధపెట్టిన కథ ఏది?

‘టింకూ ఇన్‌ టెక్సాస్‌’, ‘హోమ్‌ రన్‌’ తప్ప మిగతా కథల్లో అంతర్లీనమైన బాధ గూడుకట్టుకొని ఉంది. ‘ఇట్స్‌ నాట్‌ ఓకే’, ‘కోట్‌ హేంగర్‌’ కథలు రాసేటప్పుడు, రాసిన తర్వాత మరింత బాధపెట్టాయి. రాస్తున్న ప్పుడే నన్ను ఏడిపించిన కథలు ఆ రెండూ. ‘క్రైమ్‌ సీన్‌’ ఇతివృత్తం ఎన్నేళ్లుగా నలిగిందో! కొన్ని కథలు రాయట మంటే మరింత బాధ పడటమని తెలిసి కూడా రాసిన కథలు. నేను మళ్ళీ చదవలేని నా కథ మాత్రం ‘కోట్‌ హేంగర్‌’. Incest మీద ‘మర్ల పులి’ పేరుతో కథ ‘Me Too’కి ఎన్నో ఏళ్ల ముందు నుంచే మనసును పిండేస్తున్నా రాయలేకపోయాను. బహుశా ఎప్పటికీ రాయలేనేమో కూడా. కాలం గడిచే కొద్దీ కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశపడటం సహజం. కానీ రేప్‌, అబార్షన్‌, గృహ హింస, ఇంట్లో నుంచి గెంటివేత గురించి ఇప్పటికీ కథలు రాయాల్సిన పరిస్థితులు ఉండటం మరింత బాధాకరం. అవన్నీ రాసే వరకు మనశ్శాంతి లేదు. రాసినా మనశ్శాంతి రాదు. ఎవరికీ అర్థం కానీ అదో రకమైన బాధ ఇది. 


‘ఈస్ర్టోజన్‌ పిల్‌’ కథలో చిన్నప్పుడు ఏ ఆచారాలని విసుక్కుందో పెద్దయ్యాక అవిచ్చే తీరిక సమయాన్ని అంతే కోరుకుంది లలిత. ప్రపంచవ్యాప్తంగా పీరియడ్‌ లీవ్‌ ఇచ్చినా వాడుకునే పరిస్థితి ఉద్యోగినులకు ఉందా?

ఇది చాలా అవసరమైన ప్రశ్న. అలాగే స్త్రీల గురించి వెక్కిరింతగా నవ్వుకోవటానికి కూడా అవకాశమిచ్చే అంశం. పీరియడ్‌ లీవ్‌ - ఈ మాట వినడానికి బావుంది. కానీ ఆచరణలో ప్రాక్టికల్‌గా సాధ్యమయ్యే అంశం కాదేమో. గత ఏడాది గుజరాత్‌లోని విద్యా సంస్థలో ఆడపిల్లలకు ‘Menstrual check’ చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. పీరియడ్‌ పేరుతో స్త్రీలు అడిగేది ఉద్యోగంలో సెలవు లేదా ఇంట్లో శారీరక పని భారం తగ్గటం మాత్రమే కాదు. జ్వరంగా ఉందని చెప్పినంత సులభంగా, సులువుగా పీరియడ్‌లో ఉన్నానని స్త్రీలు చెప్పగలిగే స్వేచ్ఛ రావాలి. ఆ పీరియడ్‌కి ముందూ, వెనుక వచ్చే మూడ్‌ స్వింగ్స్‌ కానీ, మానసిక శారీరక బాధలు కానీ స్త్రీలను మరో బాక్స్‌లో పెట్టి చూడటానికి కాదన్న అవగాహన మగవాళ్ళల్లో పెరగాలి. పి.ఎం.ఎస్‌. గురించి తెలిసిన మగవాళ్లకు పీరియడ్‌ గురించి తెలియదా? తెలుసు. ఆడవాళ్ళు ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళటం గురించి Sheryl Sandberg  రాసిన ‘Leanin’ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగినులు చదవాల్సిన పుస్తకం అంటాను. ఎందుకంటే ఎన్ని మాట్లాడినా పిల్లల పెంపకం ఇప్పటికీ స్త్రీల ప్రధాన బాధ్యత అయినప్పుడు పీరియడ్‌ లీవ్‌ ప్రారభమవ్వాల్సింది మొదట ఇళ్ళల్లో. అది సాధ్యమైతే, అది స్త్రీల హక్కుగా మారినప్పుడు, ఆఫీసుల్లో సెలవు గురించి మాట్లాడుకోవచ్చు. 


కథాశిల్పంకంటే వస్తువుకే మీ ప్రాధాన్యత అన్నారు. రెండూ ఒకే కథలో సాధ్యం కావంటారా?

అవుతాయి. అవ్వాలి కూడా. వస్తువు శిల్పాన్ని ఎన్నుకుంటుంది. అది చాలా సహజంగా జరిగిపోతుంది. రచయితలందరికీ స్వానుభవమే ఆ విషయం. సమస్య ఎక్కడంటే కొంతమంది సాహిత్య విమర్శకులు బోలెడు ఇంగ్లీషు పుస్తకాలు చదివి, ఆ విమర్శనా పద్ధతులను తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ, శిల్పం మరింత మెరుగుపరచటానికి, కొత్త ప్రయోగాలు చేయటానికి ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. శిల్పపరంగా కొత్తగా రాస్తే, లేదా ప్రయోగాత్మకంగా రాస్తే దానికి గొప్ప లేదా మంచి కథ లాంటి ట్యాగ్‌లు తగిలిస్తున్నారు. దానివల్ల కొందరు శిల్పం మీద ఎక్కువ దృష్టి లేదా సమయం పెడుతున్నారు. నేను రాసే కథలకు ఒక ప్రత్యేక ప్రయోజనం ఉంది. అది స్త్రీల జీవితాల్లోని భిన్న శకలాలను చూపించటం. నా శ్రద్ధ తప్పనిసరిగా వస్తువు మీద ఉంటుంది. కాబట్టి నాకు శిల్పం సెకండరీ అన్నాను. శిల్పం, వస్తువు విషయంలో ప్రతి రచయిత ఆలోచన, అవగాహన, కథను డీల్‌ చేసే విధానం ప్రత్యేకంగా ఉంటాయి. తెలుగు కథని ఒక వైపుకి తీసుకెళ్ళి నోరు తిరగని పేర్లున్న విదేశీ రచయితల పక్కన నిలబెట్టి తూచాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం.

ప్రశ్నలు: సుస్మిత (సాహిత్యాభిమాని, బ్లాగర్‌)

Advertisement
Advertisement