Abn logo
May 27 2020 @ 04:30AM

ట్రాన్స్‌కోలో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం

స్తంభాలు, లైన్ల ఏర్పాటులో ప్రమాణాలకు పాతర

కొరవడిన అధికారుల పర్యవేక్షణ 

కొద్దిపాటి గాలులకే విరుగుడు, ఒరుగుడు

చాలాచోట్ల చేతికందే ఎత్తులో వైర్లు

అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు 

సొమ్ము చేసుకుంటున్న గుత్తేదారులు


విద్యుత్‌ లైన్లు, స్తంభాల ఏర్పాటులో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యమైంది. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపం ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తోంది. టెండర్లు లేకుండా నామినేషన్‌పై పనులు చేయించడం కూడా విద్యుత్‌ లైన్ల నిర్మాణంలో అవకతవకలకు తావిస్తోంది. విద్యుత్‌ స్తంభం తయారీ నుంచి లైన్ల ఏర్పాటు వరకూ అంతా కాంట్రాక్టర్ల ద్వారా జరగడంతో అనేక అక్రమాలు జరుగుతునాయి. విద్యుత్‌ లైన్‌లు నిర్మాణంలో ప్రమాణాలకు పాతరేస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. స్తంభాల తయారీలో కాంట్రాక్టర్ల కక్కుర్తి కారణంగా ఒక మోస్తరు గాలివీస్తేనే విరిగిపడుతున్నాయి. ఇటీవల నాగులుప్పలపాడు మండలం మాచవరం వద్ద జరిగిన ప్రమాదం విద్యుత్‌ స్తంభాల ఏర్పాటులో డొల్లతనానికి నిదర్శనంగా నిలుస్తోంది. దీనిపై నేరుగా విద్యుత్‌ శాఖ మంత్రికి సీపీఎం నేతలు ఫిర్యాదు చేశారు. విద్యుత్‌ స్తంభం బలహీనంగా ఉన్న కారణంగానే ప్రమాదం జరిగి పదిమంది మృతి చెందారని ఆరోపించారు. 


ఒంగోలు (క్రైం), మే 26 :  విద్యుత్‌ స్తంభాలు తయారీలో వినియోగించే సిమెంట్‌, ఇనుము తక్కువరకం వినియోగించడం వలన ఎక్కువ కాలం మన్నికగా ఉండటం లేదు అనేది ఇటీవల మాచవరం ప్రమాదం తర్వాత వచ్చిన వాదన. అంటే గతంలో 12ఎంఎం ఇనుపరాడ్‌లు వినియోగించే వారు. 20ఏళ్లుగా 4 ఎంఎం రాడ్లను వినియోగిస్తున్నారు. అతేకాకుండా విద్యుత్‌ స్తంభాలు తయారీ బయట కాంట్రాక్టర్లకు ఇవ్వడంతో వారు ఇష్టానుసారంగా తయారుచేస్తున్నారు. విద్యుత్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే స్తంభాల తయారీ జరుగుతుంది. అయనప్పటికీ దీనిపై అధికారుల పర్యేవేక్షణ ఉండటం లేదనే ఆరోపణలున్నాయి. ఒక్కో స్తంభం ధర రూ.1700పైన విద్యుత్‌ శాఖ కాంట్రాక్టర్‌కు చెల్లిస్తుంది. దీంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా తయారీచేస్తూ నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు.


స్తంభాలు, లైన్ల ఏర్పాటులో లోపాలు 

విద్యుత్‌ లైన్ల నిర్మాణం, స్తంభాల ఏర్పాటులో అనేక లోపాలు జరుగుతున్నాయి. ఇవి కాంట్రాక్టర్లకు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి కరెంటు స్తంభానికి ఐదు అడుగుల లోతు గుంత తీయాలి. స్తంభం నిలబెట్టిన తర్వాత చుట్టూ రెండు అడుగుల వెడల్పులో కాంక్రీట్‌ చేయాలి. కానీ అలా ఎక్కడా జరగడం లేదు. కాంట్రాక్టర్‌ పని ఏవిధంగా చేసినా విద్యుత్‌ శాఖ అధికారులు అందుకు పచ్చజెండా ఊపుతారు. దీంతో వారు చేసిన పనికి బిల్లులు చేసుకుంటారు. దీంతో కాస్తంతా పెద్ద గాలి వీస్తే చాలు స్తంభాలు విరిగిపోవడం, లేదా పక్కకు ఒరిగిపోవడం, వైర్లు వేలాడటం జరుగుతుంది. తిరిగి మరలా అదే పద్ధతిలో మరమ్మతులు పేరుతో అధికారులు, కాంట్రాక్టర్లు లబ్ధి పొందుతున్నారు. 


చిన్నపాటి గాలులకే నేలకు

స్తంభాల, లైన్ల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోవడంతో అవి చిన్నపాటి గాలులకే విరిగిపోతున్నాయి. కొన్ని చోట్ల నేలకు ఒరుగుతున్నాయి. ఇటీవల వీచిన గాలులకు పశ్చిమ ప్రాంతంలో 216 కరెంట్‌ స్తంభాలు దెబ్బతిన్నాయి. వీటిలో 33 కేవీ స్తంభాలు తొమ్మిది పూర్తిగా విరిగిపోవడంతో వాటిని మార్చారు. నేలకు వాలిన ఏడింటిని పైకి లేపారు. అలాగే 11 కేవీ విద్యుత్‌ స్తంభాలు మొతం 200 దెబ్బతినగా అందులో 140 మార్చారు. 60 స్తంభాలను తిరిగి పైకి లేపేరు. వీటితోపాటు చీరాల, అద్దంకి ప్రాంతాల్లోనూ పలు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అంటే చిన్న పాటి గాలివాన వస్తే స్తంభాలు ఒరగడం, విరగడం సర్వసాధారణమైంది. ట్రాన్స్‌ఫార్మర్లు 15 దెబ్బతినడంతో వాటిని మార్చివేశారు. ఇలా కాంట్రాక్టర్లకు గాలికొడితే పండగలా తయారైంది. 


ప్రమాదాలకు హేతువులు

గాలికి స్తంభాలు విరిగి ఒరిగిన విద్యుత్‌ లైన్లు ప్రమాదాలకు హేతువులగా మారుతున్నాయి. అనేక ప్రాంతాల్లో ఒరిగిన విద్యుత్‌ లైన్లు మూలంగా విద్యుత్‌ షాక్‌ గురైన సంఘటనలు ఉన్నాయి. కొన్నిప్రాంతాల్లో వాహనాలకు విద్యుత్‌ షాక్‌ తగలగా, మరికొన్ని ప్రాంతాలలో నడిచి వెళుతున్న వారికి విద్యుత్‌ తీగలు తగిలిన సందర్భాలు లేకపోలేదు. ఇలా మొత్తంగా కరెంటు తీగలు ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయి.


స్తంభాలు అరటన్ను బరువును తట్టుకోగలవు ..పి. వెంకట్రామయ్య, విద్యుత్‌శాఖ ఏడీఈ(సివిల్‌)

స్తంభాలు ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నారు. 4ఎంఎం హెచ్‌టీ స్టీల్‌ వినియోగిస్తారు. విద్యుత్‌ స్తంభానికి అరటన్ను బరువు వరకు తట్టుకొనే శక్తి ఉంటుంది. అయితే మాచవరంలో జరిగిన ప్రమాదంలో ట్రాక్టర్‌ మూడు టన్నులు కంటే పైన బరువు ఉంటుందని కనీసం 10కి.మీ వేగంతో వస్తున్న దాని బరువు 30 టన్నులు అవుతుందని అందువలనే ప్రమాదం జరిగింది. స్తంభాలు భారీ గాలులకు విరుగుతున్నాయి. అలాగే ప్రతి స్తంభం ఐదు అడుగులు లోతు తవ్వాలి. దాని చుట్టూ కాంక్రీట్‌ చేయాల్సి ఉంది. అలా చేసిన చోట గాలికి ఒరిగే అవకాశం లేదు. 

Advertisement
Advertisement
Advertisement