Advertisement
Advertisement
Abn logo
Advertisement

పేరూరు చెరువు నీళ్లు పాతకాల్వ వైపే

గ్రామం చుట్టూ నీట మునిగిన పొలాలే 

రాకపోకలకూ అవస్థే


తిరుపతి రూరల్‌, నవంబరు 26: అనుకున్నట్లే తిరుపతి రూరల్‌ మండలం పేరువు నీటిని పాతకాల్వ వైపే మళ్లించారు. గ్రామంలోకి నీళ్లు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. చుట్టుపక్కల పొలాలు నీటితో నిండిపోయాయి. పేరూరు చెరువు నిండటంతో పాతకాల్వ చెరువుకు నీటిని మళ్లించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం అర్ధరాత్రి గ్రామస్థులు నిరసన తెలపడం, పోలీసుల లాఠీచార్జీతో మహిళ తలకు గాయమైన విషయం తెలిసిందే. చివరకు ఆ నీటిని ఇటువైపే వదలడంతో పాతకాల్వ చుట్టు పక్కల ఎక్కడ చూసిన నీరే కనిపిస్తోంది. పాతకాల్వతో పాటు సి.గొల్లపల్లె, రామానుజపల్లె గ్రామాల పంట పొలాలు నీట మునిగాయి. పాతకాల్వ గ్రామస్థులు గ్రామం వెలుపలకు వచ్చి.. పోవడానికి తీవ్ర అవస్థలు పడుతున్నారు. తాగునీరు, నిత్యావసరాలకు కొంత వరకూ అవస్థ ఉండటంతో కొందరు దాతలు ముందుకు వచ్చారు. దాతల సహాయంతో గ్రామస్థులకు టిఫిన్‌, భోజన సదుపాయం కొంత వరకు కల్పించారు. వకుళామాత ఆలయం వద్ద కూడా భారీగా నీరు నిలిచి పోయింది. ఈ ఆలయానికి సంబంధించిన కోనేరు నీట మునిగింది. గ్రామం నుంచి వెలుపలకు రావాలంటే ఏ వైపు వెళ్ళాలన్నా మోకాళ్ళ లోతు కంటే ఎక్కువగానే నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. పిల్లలు, మహిళలు రోడ్డెక్కాలంటే భయ పడుతున్నారు. దీంతో బాధితులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. తమను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతున్నారు. తమ గ్రామాల వైపున ప్రవహిస్తున్న వరద నీటి ఉధృతిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

Advertisement
Advertisement