Abn logo
Jun 29 2020 @ 05:28AM

కథ ఎక్కడా ఆగింది లేదు!

సమకాలీన సామాజిక పరిణామాలతో ప్రధాన స్రవంతి కథ ఏ మాత్రం ప్రభావితం కాలేదు అనడంలో విమర్శకుడు వెల్దండి శ్రీధర్‌ ఆంతర్యం ఏమిటో నాకే కాదు చాలామంది కథాప్రియులకు బోధ పడలేదు. వారు ఆశించిన స్థాయిలో కథలు రాకపోవచ్చు కానీ మార్పు కలిగిన కథలైతే చాలా వచ్చాయి. కథకులు సమాజంలో మారిన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తమ కథావస్తువులుగా స్వీకరించారు. కథలుగా మలిచారు. 


‘తెలుగు రాష్ట్రాలు ముందుకు పోయాయి, కథ అక్కడే ఆగిపోయింది’ అనే వ్యాసంలో (జూన్‌ 8- వివిధ) విమర్శకుడు వెల్దండి శ్రీధర్‌ ‘‘తెలంగాణ ప్రాంతం స్వరాష్ట్రంగా ఆవిర్భవించి అప్పుడే ఆరేళ్లయింది. ఈ ఆరేళ్ళలో తెలంగాణ సమాజంలో వచ్చిన మార్పుల్ని తెలంగాణ కథకులు అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు.... తెలం గాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా తెలంగాణ కథకుల వస్తు స్వీకరణలో పెద్దగా మార్పులేదు. పాత ధోరణిలోనే కథలు వస్తున్నాయి,’’ అని ఆరోపించారు. ఈ వ్యాసం చదివిన కథకులు, కథాభిమానుల మనసు నొచ్చుకోక మానదు. సమకాలీన సామాజిక పరిణామాలతో ప్రధానస్రవంతి కథ ఏ మాత్రం ప్రభావితం కాలేదు అనడంలో విమర్శకుడి ఆంతర్యం ఏమిటో నాకే కాదు చాలామంది కథాప్రియు లకు బోధపడలేదు. విమర్శకుడు ఆశించిన స్థాయిలో కథలు రాకపోవచ్చు కానీ మార్పు కలిగిన కథలైతే చాలా వచ్చాయి. కథకులు సమాజంలో మారిన పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కథావస్తువులుగా స్వీకరించారు. కథలుగా మలి చారు. విమర్శకుల అభిప్రాయాన్ని విభేదిస్తూ నేను ప్రధానంగా తెలంగాణలోవచ్చిన సామాజిక మార్పు లను అక్షరబద్ధంచేసిన కథలను కొన్నింటిని పేర్కొంటున్నాను.


2015 నుంచి 2019 వరకు ప్రతి సంవత్సరం తెలంగాణ తేజోమూర్తుల స్మారకార్థం నవతెలంగాణ దినపత్రిక ప్రతి ఏడు కథల పోటీలు నిర్వహిస్తూనే ఉంది. ముల్కనూరు ప్రజా గ్రంథాలయం - నమస్తే తెలంగాణ దిన పత్రిక సంయుక్త నిర్వహణలో కథా పోటీలు 2019 నిర్వహించింది. గతం లో ఎన్నడూలేని విధంగా ప్రథమ బహుమతిగా యాభైవేల రూపా యల నగదు పురస్కారాన్ని అందజేశారు. మొదటి కథకు యాభైవేల రూపాయలు ప్రక టించారు. పెద్దింటి అశోక్‌ కుమార్‌ గారి ‘విత్తనం’ కథకు లభించింది. ఈ కథ రైతు బంధు స్కీంను చర్చిస్తుంది. ఈ పోటీలో వివిధ కోణాల్లో కథలు వచ్చాయి. ఈనాడు పత్రిక కథావిజయం 2019 పేరున పోటీలు నిర్వహించారు. తెలంగాణలో ప్రాజెక్టు నిర్మిస్తుంటే భూనిర్వాసితుల బాధల్ని స్వయంగా చూసి అనుభవించి రాసిన కథలు ఎన్నో ఉన్నాయి. ఒక్కసారిగా ఉన్న ఊరిని వదలాల్సి వచ్చినప్పుడు వయస్సు మళ్ళిన ముసలావిడ సంధించే ప్రశ్నల్ని చిత్రించిన కథ సిద్దెంకి యాదగిరి ‘ఆఖరి కోరిక’. ఉన్న జాగ కాలువకు సేకరిస్తే ఎలా బతకాలో తెలియని రైతు కథ ఎన్నవెల్లి రాజమౌళి ‘గుండె పగిలింది.’ ఈ రెండు కథలు కూడా పోటీలో ప్రోత్సాహక బహుమతులు అందుకున్నాయి. ఇంకా నెలవంక నెమలీక, మల్లెతీగ, మొదలైన మాస పత్రికలు విభిన్న కథలని వెలుగులోకి తెస్తున్నారు. 


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ నుంచి ప్రధాన స్రవంతి కథలు వస్తలేవనే ఆరోపణల వెనుక ఏ ఉద్దేశ్యం ఉందనుకోవాలి? పైన చెప్పిన కృషిని వారు గమనిస్తలేరనుకోవలా? గమ నించి కావాలనీ ఆరోపిస్తున్నారనీ అనుకోవాలా?


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సామాజిక తెలంగాణ రాలేదన్నది చాలామంది భావన. బతుకమ్మ అనేది వేడుకలకు రాజకీయ సభ్యులకు మాత్రమే పరిమితమైందని తెలిపే కథ పి. చిన్నయ్య ‘అంటరాని బతుకమ్మ’. జీవన సంస్కృతికి, జీవన విధానానికి చిరునామా అయిన చెరువులు విధ్వం సానికి గురవుతున్న పరిస్థితిని వలపోసిన కథ గుడిపల్లి నిరంజన్‌ ‘నీరటు కాడి కల’. పై రెండు కథలు కథావార్షిక 2015 ప్రచురితమయ్యాయి. తెలంగాణలో ఆత్మ హత్యలు కూడదని తెలిపే చందు తులసి కథ ‘ఊరవతల ఊడలమర్రి’. ఊడలమర్రి ఉంటేనే కదా ఊరంతా ఉరివేసు కొని ఆత్మహత్య చేసుకునేది అని ఆలోచించి మర్రిచెట్టు తెల్లా రేసరికి కొట్టేస్తారు ఈ కథలో. చిత్తలూరి సత్యనారాయణ 2015 ‘ఏశక్క’ కథకు భాగ్యరెడ్డిస్మారక కథల పోటీల్లో తృతీయ బహుమతి వచ్చింది. కాంక్రీట్‌ జంగిల్‌గా పిలవ బడే మహానగరాల్లో కులవివక్ష ఎంత పిచ్చిగా మారుతుందో తెలిపే డాక్టర్‌ పసునూరి రవీందర్‌ కథ ‘అయినా మనిషి మారలేదు’ కథావార్షిక 2016లో ప్రచురితం. వీరిదే మరో కథ మాల మాదిగలు అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణను అడ్డు కోవడాన్ని పసిగట్టిన కథ ‘దమ్కీ’ ప్రధాన స్రవంతికి ప్రతిబింబం.


నోట్ల రద్దు వల్ల జరిగిన పరిణామాలతో బతుకులు ఎంత దుర్భరంగా మారుతా యో వివరించే కథ సిద్దెంకి యాదగిరి ‘పిడుగు’. తెలం గాణ రాష్ట్ర ఆవిర్భావ అనం తరం పరిస్థితులు మారాయని తెలియజేస్తూ- దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి రాజయ్య తన బావ మరిదితో సహ తెలంగాణకు తొవ్వ తీసిన కథ ఐతా చంద్రయ్య ‘బతుకు తొవ్వ’. వీరిదే మరో కథ తెలంగాణ రాష్ట్రంలో పైరవీలు లేకుండా సీట్లు దొరుకుతాయని తెలియజేసే ‘రాజ రాజ గుమ్మడి పండు’. చిత్తలూరి సత్యనారాయణ ‘యాస’ కథ మన భాష పట్ల, యాస పట్ల ఉన్న వివక్షను, తద్వారా ఒక వ్యక్తి జీవితంలో ఎదురైన అనుభవాలను వ్యక్తీకరిస్తుంది. ఇట్లా అనేక రకాలుగా, అనేక వస్తువులుగా, ప్రధాన స్రవంతి నుంచి వస్తున్న కథలపై, కథకులపై అనవసర అభాండాలు వేయడం సరి అయిందేనా? 


వ్యాసకర్త సంగిశెట్టి శ్రీనివాస్‌తో కలసి తీసిన కథా సంక లనాలను మాత్రమే పేర్కొన్నాడు. తెలంగాణ కథకు చోటు కల్పించిన ‘కథ’ 2015, 16 పుస్తకాలను; నమస్తే తెలంగాణ -ముల్కనూరు ప్రజాగ్రంథాలయం ‘కథ 2019’ను నామమాత్ర మైన పేర్కొనక పోవడం వెనుక ఏ కారణముందో తెలీదు?


‘‘మొత్తంగా తెలంగాణ రాష్ర్టావతారణానంతర కథ ఆరు దశాబ్దాల తెలంగాణ పోరాటాన్ని ఏ మాత్రం పట్టించుకోకుం డానే ముందుకు సాగిపోతోంది’’ అని ఆరోపించాడు విమ ర్శకుడు. ఇది ఎంతమాత్రం నిజం కాదు. ఐత చంద్రయ్యగారు ఆరు దశాబ్దాల పోరాటాన్ని చిత్రిక పట్టాడు. అనాటి పోరు బాట, సైనిక చర్యల గురించి కాలేజీ పిల్లలు తమ తాతను అడిగి తెలుసుకునే చంద్రయ్య కథ ‘పోరుబాట’. ఈ వ్యాసంలో ఉదాహరించినవే గాక ఇంకా మంచి కథలు వుండవచ్చు. మంచి కథలను విశ్లేషిస్తూ, నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఇస్తే స్వీకరించే వారు ఉన్నారు. కలం, కాగితం అందుబాటులో ఉన్నవని ఆరోపణలు చేయటం సరి కాదు. 

సిద్దెంకి యాదగిరి

94412 44773


Advertisement
Advertisement
Advertisement