Abn logo
Aug 7 2020 @ 00:42AM

ఎమ్మెల్యే రామలింగారెడ్డి సేవలు మరువలేనివి

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, 

ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, అంజయ్యయాదవ్‌


ఆంధ్రజ్యోతి,రంగారెడ్డి అర్బన్‌/వికారాబాద్‌/షాద్‌నగర్‌ /కీసర రూరల్‌: దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తీరనిలోటని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  పేర్కొన్నారు. గురువారం ఆయన మృతికి సంతాపం తెలిపి, పలుచోట్ల నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టుగా, ప్రజాప్రతినిధిగా రామలింగారెడ్డి ప్రజలకు చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహ రించారని గుర్తుచేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ ప్రజల ఆధారాభిమానాలు పొందారని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని ఆమె కోరుకున్నారు. వికారాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ నివాళులర్పించారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, ప్రభాకర్‌రెడ్డి, చిగుళ్లపల్లి రమేష్‌, విజయ్‌, నర్సింహారెడ్డి, అనంత్‌రెడ్డి, చందర్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా షాద్‌నగర్‌ మండలం ఎక్లా్‌సఖాన్‌పేటలో ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అలాగే షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌ ఆధ్వర్యంలో పలువురు ప్రజాప్రతినిధులు, టీఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక చౌరస్తాలో రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నటరాజన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పాండురంగారెడ్డి, ఎంపీపీ ఖాజాఇద్రీస్‌, జడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కీసర మండలం నాగారం మున్సిపల్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు  వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చంద్రారెడ్డి, మల్లేష్‌, శ్రీధర్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement