Abn logo
May 5 2020 @ 00:39AM

శాస్త్రీయతే పునాదిగా బోధనా మాధ్యమం

సామాజిక రుగ్మతలు, అపోహలు ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాలు, వర్గ భేదాలు, సంఖ్యా బలాల్ని పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సే గీటురాయిగా ప్రభుత్వాలు తమ విధానాల్ని రూపొందించాలి. ఆంగ్లేయుల పాలనలో ‘సతి’ దురాచార నిర్మూలనా చట్టం నుంచి నిన్నటి తక్షణ తలాఖ్, ఇవాల్టి లాక్‌డౌన్ దాకా ఆయా పరిస్థితులలో ఉన్న ప్రజల అపోహల్ని పక్కకు పెట్టి మరీ ప్రజా ప్రయోజనమే పరమావధిగా భావించి ప్రభుత్వాలు చట్టాల్ని చేశాయి. ఆ కోవలోనే ఈ నిర్బంధ ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై ఎస్‌సీఈఆర్‌టీ తన శాస్త్రీయ అభిప్రాయాన్ని, సలహాను నిష్కర్షగా ప్రభుత్వానికి తెలియజెప్పే వంతు వచ్చింది.


రాష్ట్రప్రభుత్వం తలపెట్టిన నిర్బంధ ఆంగ్ల మాధ్యమ విద్యకు సంబంధించిన ఉత్తర్వులను కొట్టివేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ఇటీవల సంచలనాత్మకమైన తీర్పునిచ్చింది. విద్యా రంగంలో, వివిధ సందర్భాల్లో, వివిధ రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో, దేశ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన వ్యాజ్యాల కన్నా ఈ తీర్పు చాలా లోతైనది, సమగ్రమైనది. 


ఈ తీర్పులో నాలుగు ముఖ్యాంశాలు ఉన్నాయి: 1) స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయులు మన దేశంలో ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్యావిధానంలోని లోటుపాట్లను గురించి విశ్లేషణ. 2) స్వాతంత్ర్యానంతర విధానాల్లో శాస్త్రీయత, మహనీయుల అభిప్రాయాలు. 3) ఏ మాధ్యమంలో చదువు శాస్త్రీయం, మాధ్యమ నిర్ణయంలో ఎన్‌ఈసీఆర్‌టీ, ఎస్‌సీఈఆర్‌టీ ల పాత్ర. 4) రాజ్యాంగం, విద్యాహక్కు చట్టం, జాతీయ విద్యా విధానపరంగా చూసినప్పుడు నిర్బంధ ఆంగ్ల మాధ్యమ ఉత్తర్వులు చట్ట వ్యతిరేకం. హైకోర్టు ఇప్పుడు ఇచ్చిన ఈ సమగ్రమైన తీర్పును గురించిన చర్చ ఈనాడు జరగట్లేదు అన్నది వాస్తవం. తీర్పులోని అంతరార్థం, ఆంగ్ల మాధ్యమ విద్య ప్రాథమిక స్థాయిలో శ్రేయస్కరం కాదనే చెబుతోంది. అయినా, రామాయణంలో పిడకల వేట చందాన సాంకేతిక కారణాల లొసుగులతో తీర్పులోని న్యాయాన్ని నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతుండటం అత్యంత బాధాకరం.


‘‘ప్రైవేట్ పాఠశాల పిల్లల మాదిరిగా పేదవారికి, బడుగు బలహీన వర్గాలకు ఆంగ్ల మాధ్యమ విద్య అక్కర్లేదా? గొప్పింటి బిడ్డలే ఆంగ్ల మాధ్యమ విద్యకు అర్హులా?’’ లాంటి ప్రశ్నలతో విద్యాభ్యాసానికి అసమానతల రంగు పులుముతున్నారు. ఇక్కడ గుర్తించాల్సిన అంశం, ఏ మతమైనా, ఏ కులమైనా, సంపన్నులైనా, బీదలైనా... ఎవరైనా సరే, శ్రద్ధ, పట్టుదలతో అభ్యసించిన వారినే విద్య వరిస్తుంది. అలాంటి విద్యను దేశమంతటా అన్ని వర్గాల వారు అందిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోనే విద్యా హక్కు చట్టం, నిర్భంధ ప్రాథమిక విద్యా చట్టాల్ని రూపొందించారు. విద్యను ప్రభుత్వేతర సంస్థలు అందించినపుడు కూడా నిస్వార్థ సేవగానే చేయాలనే చట్టాల్ని చేశారు. కానీ ప్రైవేట్ సంస్థలు ఆంగ్ల మాధ్యమ విద్యను ఒక వినూత్న విపణి విధానంగా మల్చుకున్నాయి. ఈ ధోరణిలోనే ‘‘కొలువుల కోసం విద్య’’ అన్నట్లు వారు చేసే ప్రచారం వలన ఆంగ్ల మాధ్యమంలో చదవటం గొప్ప అన్నట్లు, ఆ విధానంలో చదివితేనే ఆంగ్ల భాషలో అనర్గళ వాక్పటిమ వస్తుందన్నట్లు తల్లిదండ్రులు భ్రమపడుతున్నారు.


గాంధీజీ స్వీయ సంపాదకత్వంలో వెలువరించి ‘హరిజన’ పత్రికలో ఆంగ్ల విద్య గొప్పదన్న ఆలోచన మానసిక బానిసత్వమని, అలాంటి పోకడలకు లొంగవద్దని, మాతృభాష తల్లి పాల వంటిదని, రష్యా లాంటి దేశాలు తమ మాతృభాష మాధ్యమ విద్యతోనే సాధించిన పురోగతిని గుర్తించాలని ప్రబోధించిన విషయాన్ని హైకోర్టు ప్రస్తుత తీర్పులో పొందుపరిచారు. నిజానికి మెకాలే ఆంగ్ల మాధ్యమ విద్యావిధానం తెల్లవారి సామ్రాజ్యంలో మనం సేవకులై, వారి కొలువులో గుమాస్తాగా పనిచేసే ‘సౌభాగ్యం’ కోసం తెల్లవారు ఇచ్చిన ‘అవకాశం’ అనేది జగమెరిగిన సత్యం. రెండు శతాబ్దాల వారి పాలనలోని ఆంగ్ల విద్యా విధానం.. భారతీయ విద్యా విధానం నేర్పించే పరిశోధనా కాంక్షను, తర్కబుద్ధినీ, సాంకేతిక శాస్త్ర నైపుణ్యాన్ని స్థూలంగా నష్టపరిచింది.


విద్యా విధానంలో బోధనా మాధ్యమం ప్రభువుల ఆదేశాలను బట్టి కాకుండా నిపుణుల సూచనలను బట్టి నిర్దేశింపబడాలి అనేది RTE చట్టం చెబుతున్న సత్యం. రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా మనకు అందించిన భావ వ్యక్తీకరణ, వాక్ స్వాతంత్ర్యంలో (అధికరణ 19) విద్యాభ్యాస మాధ్యమం కూడా అంతర్భాగం. అందుకే నిర్బంధ మాధ్యమ విధానం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఇన్ని విషయాల్ని గమనించి, NCERT, SCERT సూచనల పైన, విద్యారంగ చట్టాలకు, విద్యా హక్కు చట్టానికీ అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలేతప్ప, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని న్యాయస్థానం ప్రభుత్వానికి గుర్తు చేసింది. పిల్లలు తమ చుట్టూ ఉన్నవారితో అమ్మ, ఆవు, చెట్టు.. అంటూ తొలి పలుకులు నేర్చి, బడిలో చేరితే బడి కూడా ఆ వాతావరణానికి దగ్గరగా ఉండటం వల్ల బడి మాన కుండా ఇష్టంగా వెళ్తూ చదువుకుంటారు. అలా కాకుండా ‘‘A for Apple’’, ‘‘B for Ball’’ అంటూ అన్న ప్రాసనకే ఆవకాయ వడ్డిస్తే పిల్లవాడికి అరగదు అన్నది శాస్త్రీయ సత్యం. యునెస్కో వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా పిల్లలకు వారి మాతృభాషలోనే విద్యనందించాలని, వాటివల్ల వారి అభ్యాస ఫలితాల్లో (learning outcomes) వృద్ధి అత్యధికంగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఎవరేమన్నా, శాస్త్రీయతకు తిలోదకాలిచ్చి, ఆంగ్లంలోనే బోధిస్తే– బోధనాంశాల మూలాలను, విస్తృతిని అవగాహన చేసుకునే శక్తి లేని ఉపాధ్యాయుడు ఇంగ్లీషు మంత్రాలు పఠిస్తే విద్యార్థులు ‘‘మమ’’ అనుకుంటూ పోతారు.


ఆంగ్ల భాష ప్రస్తుత ప్రపంచీకరణ నేపథ్యంలో అవశ్యకమేకానీ భాషకోసం బోధన మాధ్యమమే శరణం అనటం అశాస్త్రీయం. కొలువు కోసం ఆంగ్లం అన్న వాదన కూడా పస లేనిదే. ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలకు స్థానిక భాషల్లోనే చదువుకుని, పరీక్షలు రాసి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులైనవారు కోకొల్లలు. ప్రైవేట్ రంగ ఉద్యో గాల్లోకూడా ఆంగ్ల భాషకన్నా విషయ పరిజ్ఞానానికే పెద్దపీట వేస్తారు. ఆంగ్లంలో భావ వ్యక్తీకరణ కోసం ప్రభావవంతమైన, శాస్త్రీయమైన పాఠ్య ప్రణాళికలు అనేకం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటితో రోజుల వ్యవధిలోనే ఇంగ్లీషు నేర్చుకోవచ్చు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా, చైనా లాంటి దేశాల్లో వారి వారి మాతృ భాషలోనే ఉన్నత విద్యలు అభ్యసించి కావల్సినంతవరకు మాత్రమే ఆంగ్లం నేర్చుకుంటారు. తమ సొంత భాషలోనే చదువుకోవటం వల్ల, చదువు తమది అన్న భావనతో పాటు, సృజనాత్మకత, శోధనాతత్వం ఒంటబట్టి వారిని శాస్త్రసాంకేతిక పరిశోధనా రంగాల్లో, ఆంగ్ల అగ్రరాజ్యాలకు ధీటుగా నిలబెట్టాయి. అమెరికా గణాంకాల ప్రకారం కూడా గత పదేళ్ళ కాలంలో చైనా విద్యార్థులే అధికంగా ఉన్నత చదువుల కోసం వలస వెళ్లారు, మనం రెండవ స్థానంలో ఉన్నాం. అందువల్ల విదేశీ ఉన్నత చదువుల కోసం, ఉద్యోగాల పోటీ పరీక్షలకు కూడా స్థానిక భాష మాధ్యమం అడ్డుగోడ అవ్వదని ఘంటాపథంగా చెప్పవచ్చు.


విద్యా బోధన విద్యా సముపార్జనకే ప్రాధాన్యతనివ్వాలి కానీ, కేవలం పొరుగు దేశాల అరువు కొలువుల కోసమే అన్నట్లు ఉండరాదు. కోర్టు తీర్పులో ప్రస్తావించిన గాంధీ మహాత్ముని మాటల్లో ‘‘తల్లి భాష కాని పర భాషలో విద్య నేర్పటం దేశద్రోహం’’ అన్న మాటను ఇవ్వాళ్టి ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఈ తీర్పు వెలువరించిన తర్వాత కూడా, వారి పిల్లలకు ఆంగ్ల మాధ్యమం కావాలా వద్దా? అంటూ ఒక ప్రశ్నావళి రూపొందించి తల్లిదండ్రుల అభిప్రాయం తక్షణమే సేకరించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారులని ఆదేశించింది. తీర్పును గౌరవిస్తూ ఎన్‌సీఈఆర్‌టీని కూడా ఈ విషయంపై సంప్రదించాలి అని ప్రభుత్వం భావిస్తోంది.


నిస్సందేహంగా తల్లిదండ్రులకు తమ పిల్లల్ని ఎలా చదివించాలో ఎంచుకునే హక్కు ఉన్నది. కానీ, పిల్లవాని ప్రపంచం ఎలా ఉంటుంది? పిల్లల వికాసంపై మాతృభాష ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? దేశంతో, దేశ ప్రజలతో ఉత్తరోత్తరా వారి అనుభూతి, అనుబంధం ఎలా ఉండబోతున్నాయి? లాంటి ప్రశ్నల్ని సాంఘికంగా, చారిత్రాత్మకంగా, రాజ్యాంగపరంగా, బోధనాపరంగా, ఆఖరికి విద్యావిజ్ఞాన లక్ష్యాల పరంగా చూసినా, మాతృభాషే మేలు అన్న అంశాన్ని వైజ్ఞానిక, మేధో సంస్థగా ఎన్‌సీఈఆర్‌టీ ఇప్పుడు చెప్పాలి. ఆంగ్లం అనర్గళంగా రావాలంటే మాధ్యమ మార్పు కాకుండా ఏం చేయాలనే ప్రశ్నకు, ఆంగ్లేతర దేశాలు అవలంబించే వ్యవస్థలను పరిశీలించి అవగాహన పెంచుకోవచ్చు. ఆంగ్ల భాష వాక్పటిమ కోసం ఒక విస్తృతమైన ప్రణాళికతో ప్రాథమిక స్థాయి నుంచీ, ప్రత్యేకించి భాషను నేర్పించే నిపుణులైన TEFL వంటి నైపుణ్య సామర్ధ్యతను ధ్రువపరిచే పరీక్షలతో, ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి, వారి పాఠాలను ఒక పాఠ్యాంశంగా ప్రతీ తరగతిలోను పెట్టుకోవచ్చు. ప్రైవేట్ పాఠశాలల్లో కంటే ప్రతిభావంతులైన అధ్యాపకులుండే ప్రభుత్వ బడులలో ప్రమాణాలు తగ్గటంలో విధాన లోపాలు వంటి వాటిని పరిశీలించవచ్చు. అవి పక్కకుపెట్టి ఈ నిర్భంద ఆంగ్ల మాధ్యమ విన్యాసం చేయటం వల్ల పిల్లల్లో అవగాహన లోపం, భావ వ్యక్తీకరణ లోపం మరింతగా పెచ్చుమీరి చివరకు నేర్చుకునే దారిద్ర్యానికి (learning poverty) దారితీయొచ్చు. అందువల్ల ఈ మాధ్యమ నిర్ణయంలో మంది బలం, రాజకీయ ప్రయోజనాలు లాంటివి చూడకుండా, భావి తరాలకు సరయిన దిశానిర్దేశం చేయాలి.


సామాజిక రుగ్మతలు, అపోహలు ఉన్న సమయంలో రాజకీయ ప్రయోజనాలు, వర్గ భేదాలు, సంఖ్యా బలాల్ని పక్కన పెట్టి ప్రజా శ్రేయస్సే గీటురాయిగా ప్రభుత్వాలు తమ విధానాల్ని రూపొందించాలి. ఆంగ్లేయుల పాలనలో ‘సతి’ దురాచార నిర్మూలనా చట్టం నుంచి నిన్నటి తక్షణ తలాఖ్, ఇవాల్టి లాక్‌డౌన్ దాకా ఆయా పరిస్థితులలో ఉన్న ప్రజల అపోహల్ని పక్కకు పెట్టి మరీ ప్రజా ప్రయోజనమే పరమావధిగా భావించి ప్రభుత్వాలు చట్టాల్ని చేశాయి. ఆ కోవలోనే ఈ నిర్బంధ ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై ఎస్‌సీఈఆర్‌టీ తన శాస్త్రీయ అభిప్రాయాన్ని, సలహాను నిష్కర్షగా ప్రభుత్వానికి తెలియజెప్పే వంతు వచ్చింది. అరిస్టాటిల్ విషం తాగినా, హరిశ్చంద్రుడు సంపదలన్నీ వదులుకున్నా అవి సత్యం కోసమే. మేధావుల్ని, వాళ్ళ హోదాని, స్థాయిని బట్టి కాక, వారి లోకోపకారాన్ని బట్టి ప్రజలు గుర్తుంచుకుంటారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు లాంటి వారు ఇంచేతనే మనకు ఇంకా గుర్తున్నారు. విజ్ఞానవేత్తలు, విద్యావేత్తలు సమయం వచ్చినపుడు మౌనాన్ని, నిర్వేదాన్ని ఆశ్రయించ కూడదు. అలా చేస్తే సమాజ భవిష్యత్తుకు అపచారం, పాపం, శాపం కూడా.

యన్‌. ముక్తేశ్వరరావు

విశ్రాంత ఐ.ఎ.ఎస్‌ అధికారి,

భాషా సాంస్కృతిక శాఖ మాజీ కార్యదర్శి

Advertisement
Advertisement
Advertisement