Abn logo
Apr 27 2020 @ 05:04AM

కొమ్మ కుంకుమ

1

వినకపోతివి గదర ఎరక గలిగిన పదం

కొరివి కొని తెచ్చుకొని వణికితేమి ఫలం

దయ్యమోలె నిన్ను పట్టుకున్నది ధనం

యుగములె గడిసిన మారలె నీ గుణం

నాకెదురె లేదని ఎగిసిపడె నీ మదం

భరియింపక పుడమి శపియించెనిది నిజం


2

దూరాన గల సిరుల దారులను గాలించి

పడవలిమానాల పయనించి అవి తుంచి

కొమ్మ కుంకుమ పూల అడవి సుగంధాల

చిదిమి పాదుల నరికి పారించితివి మురికి

ఆ పాపమె మున్ను అంటుకునె విషకన్ను

ఏమవునొ నీ కత ఏడుపె ఇక జత


3

తేనెలొలికె పండ్లు ఆకు సాటున నుండు

వాడిగలిగిన ముండ్లు పైన ఉరుముచుండు

స్వాతి మబ్బుల సెమట వల్లు ముత్యపు జల్లు

భరిణ ఉరుముల డొల్లు కాపు కాతల పొల్లు

ఆశలేని మనిషి అడవి మునివలె నుండె

సిరులు మరిగిన నీవు మరమనిషివైనావు


4

నేల ఎద చనుబాల దారలు ఈ నదుల

కీచకుడవయి కాటు వేయ లేద నీవు

వగరు గందాలొంపె వనరాసి అందాల

కాసులను ఎరవేసి చెరపలేద నీవు

భూమిలోపలి సిరుల పోగేసుకొన నెంచి

గాయమవనికి పెంచి గత్తరయి పోతివి


5

చెట్టు కింత జాగ పిట్ట కింత గూడు

పురుగు బూసికి పుట్ట బొరియలుంటె చాలు

నరుడ నీవు వందలెకరాలనె పొంది

చీమయిన రాకుండ గోడకట్టించితివి

ఏడు అడుగుల జాడ చివరి నీ గూడన్న

పామరుల నుడుగును పెడ చెవిన పెడితివి


6

సలువరాతి మేడ కట్టుకొని మురిసితివి

కడుపేదలని ఎంచి మెట్లకడ నిలిపితివి

రంగు తెగ మత కుల బేధాలనెంచితివి

ఇల ఉత్తముడనని తెగ విర్రవీగితివి

తొమ్మిదర్రల తొర్ర గాలి తుంగ బుర్ర

కొరడ క్రిమి వేటుకు ఒరిగె నీ వెనుగర్ర


7

తుంటె పురుగు కన్న నీ చెయ్యి చెడురన్న

ఆ చేతలకు పుట్టె కద విషపు తుట్టె

గాజు పెంకుల వేటు కందిరీగల పోటు

రొంటి మించిన చేటు లోభి నరుని కాటు

లాభాలకయి నేల నూబిగా చేసేసి

ఊపిరాడక నీవు కేక వెడుతున్నావు


8

వెనుకట గబ్బిలాలెలుకలేవీ లేవ

వున్న తావున వాటినుండ నిచ్చినవ

ఉసిగొలిపి జీవులను వణికించిన నీవె

కనపడని ఉరులకు కంపించుచున్నావు

అన్నిటిని కబలించె ఆశ పెనుభూతమయి

నిన్నె కబలించుటకు తన పంజ విసిరింది


9

వున్న తావున నీవు వుంటె లేదే తప్పు

అన్ని నాకెననె అతి ఆశనె ముప్పు

ఆకులలముల దిని అపకారమెరగక

కలిసి బతికె జీవరాశినొంటరి జేసి

మురిసి పోయిన నీదు పాపమెల్ల పండి

కడకు ఒంటరివయ్యి కడతేరుచున్నావు


10

పసుపు కొమ్ము యాప కర్పూర గుగ్గిలం

ధూపమునకు నువ్వు దోసిలొగ్గినటుల

కనుకొలుకులొ కరుణ నింపుకుని పరులను

సేవించె వారలకు సేతులొగ్గితె సాలు

చిరునవ్వులొలికేటి సిరుల కుదురు పల్లె

తల్లి వొడికి మళ్లి బాట పట్టితె మేలు


11

ఉరుకుల పరుగుల పొగలారి పోవంగ

నింగిపొర నీలంపు రంగులీని మెరిసె

మితిలేని కోరికల అతి మేళములు ఆగి

కొండపై కోవెల వెన్నెలూరి పారె

ఏమి కోరని జీవరాసులెల్ల కూడి

ఆడిపాడగ పుడమి వేడుకాయె


12

ఎగువ తిరుమల దిగువ తిరుమల నీలోనె

వెలుగొందుచున్నవి యాత్రలేల

కనుపాపలొ మక్క అజ్మీరులున్నవి

జమయతులు ఎందులకు జపము జాలు

గాటి ఎద్దువోలె మతిని గుంజి కట్టు

కాసె పున్నమి కాంతి నీలోపలనె పుట్టు


గోరటి వెంకన్న  


Advertisement
Advertisement
Advertisement