Abn logo
Oct 22 2021 @ 01:04AM

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

అమరవీరుల దినోత్సవంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే


దర్శి, అక్టోబరు 21 : పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాల్లో భాగంగా గురువారం పోలీసులు దర్శిలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రజల రక్షణకోసం ఎంతోమంది పోలీసులు అమరులయ్యారన్నారు. వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో దర్శి డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి, దర్శి, పొదిలి సీఐలు భీమానాయక్‌, సుధాకర్‌, సబ్‌డివిజన్‌ పరిధిలోని పోలీసు అధికారులు, పోలీసులు, పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

రామాయపట్నం(ఉలవపాడు) : విధినిర్వహణలో అవసరమతే ప్రాణాలను సైతం అడ్డుపెట్టి ప్రజలకు రక్షణ కల్సించేవాడే పోలీస్‌ అని మెరైన్‌ సీఐ ఆర్‌ఎస్‌ కిషోర్‌ కుమార్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం రామాయపట్నం మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అమరవీరుల త్యాగాలను కీర్తిస్తు ర్యాలీ నిర్వహించి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో ఎస్సై ఎస్‌కే షరీఫ్‌, ఏఎస్సై పీ వెంకటేశ్వర్లు, మెరైన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎమ్మెల్యే లక్ష విరాళం

కందుకూరు : కందుకూరు సబ్‌ డివిజన్‌ పరిధిలో పోలీసు సంక్షేమనిధి ఏర్పాటుకుఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి లక్ష రూపాయల విరాళం ప్రకటించారు. పోలీసు అమరవీరుల సంస్మరణ  వారోత్సవాల ప్రారంభ కార్యక్రమాన్ని స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి శాంతిభద్రతల పరిరక్షణ , ప్రజల రక్షణ కోసం అనునిత్యం పనిచేసే పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. సబ్‌డివిజన్‌ పరిధిలో పోలీసు సిబ్బందికి ఎవరికి కష్టం వచ్చినా తక్షణ సహాయం అందేలా ఒక సంక్షేమనిధిని ఏర్పాటు చేయాలన్నారు. తనవంతుగా లక్ష రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో డీఎస్పీ కండే శ్రీనివాసరావు, సీఐ వి.శ్రీరామ్‌, ఎస్‌ఐలు తిరుపతిరావు, అంకమ్మ తదితరులు పాల్గొన్నారు.