Abn logo
Oct 20 2021 @ 23:31PM

అమరుల త్యాగం అజరామరం

నేడు పోలీసు అమరవీరుల దినోత్సవం

పరేడ్‌ మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు

ముస్తాబవుతున్న అమరవీరుల స్తూపం

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 20: పోలీసుల త్యాగం చిరస్మరణీ యం. వారి ధైర్య సాహసాలు స్ఫూర్తిదాయకం. ఈ పోలీసు సమాజంలో ఓ కీలకమైన వ్యక్తి. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ గా సమాజహితుడుగా పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనది. విధులు నిర్వహిస్తున్న క్రమంలో శత్రుమూఖల దాడుల్లో అసు వులు బాసిన అమర పోలీసుల త్యాగం అజరామరం. 24గంటల పాటు విధులు నిర్వర్తిస్తూ శాంతి భద్రతలను కాపాడుతూ నిజాయితీగా పనిచేస్తూ విధుల నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకోవడమే ఈ సంస్మరణ దినోత్సవం ప్రాముఖ్యత. 1959 అక్టోబరు 21 లఢక్‌ సరిహద్దుల్లో కాపల కాస్తున్న 10 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు చైనా సైనికులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు. వీరి స్మారకార్థంగా ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకోవాలని 1960 జనవరిలో జరిగిన రాష్ర్టాల పోలీసు ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ సమావేశంలో నిర్ణయించారు. అప్పటి నుంచి విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరిస్తూ సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో అమరులైన పోలీసులు..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 28 సంఘటనలు జరగగా మొత్తం 48 మంది పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధి నిర్వహణలో అసువులు బాసారు. అయితే వీరి సేవలకు గుర్తుగా ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్‌జిల్లా కేంద్రంలోని హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన అమరవీరుల స్మృతి స్తూపం వద్ద ఏటా పోలీసు ఉన్నతాధికారులతో పాటు సిబ్బంది అమరవీరుల కుటుంబాలతో కలిసి నివాళులర్పిస్తారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన తమ సహచరుల స్మారకార్థం యేటా అక్టోబరు 15 నుంచి 21 వరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలను నిర్వహిస్తారు. ప్రతి పోలీసు స్టేషన్‌లో ఓపెన్‌ హౌజ్‌ కార్యక్రమాలను ఏర్పాటు చేసి విద్యార్థులు, ప్రజలకు పోలీసుల విధుల గురించి అవగాహన కల్పిస్తారు. అంతేకాకుండా రక్తదాన శిబిరాలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు తదితర సామాజిక కార్యక్రమాలు చేపడతారు. అయితే గత యేడాది కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో పోటీలు నిర్వహించి ముగింపు కార్యక్రమాన్ని చివరి రోజు ఏర్పాటు చేయగా ఈ యేడాది అమరుల త్యాగాలకు గుర్తుగా సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు.

జిల్లాలో పోలీసు అమర వీరుల జ్ఞాపకార్థం..

 ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో విధులు నిర్వర్తిస్తూ అనేక మంది పోలీసులు అమరులయ్యారు. అయితే వారి జ్ఞాపకార్థం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని పోలీసు హెడ్‌క్వాటర్‌లో ప్రత్యేక నిర్మాణాలు చేపట్టారు. ఇందులో సీఐ చక్రపాణి జ్ఞాపకార్థం జిల్లా పోలీసు పరేడ్‌ మైదానంలో చక్రపాణి మెమోరియల్‌ హాల్‌ నిర్మించారు. 

 1987ఆగస్టు 18న అల్లంపల్లి ఘటనకు గుర్తుగా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో అల్లంపల్లి కాంప్లెక్స్‌ నిర్మించారు.

 బెల్లంపల్లి పాతబస్తీ ఘటనలో అసువులు బాసిన హెడ్‌కానిస్టేబుళ్లు సంజీవ్‌కుమార్‌, శేషుల జ్ఞాపకార్థం పోలీసు వ్యాయామశాల ఏర్పాటు చేశారు.

 ఉట్నూర్‌ కొత్తగూడం ఘటనలో మరణించిన బి.కోట్యానాయక్‌ స్మారకార్థం చిల్డ్రన్స్‌ పార్కును ఏర్పాటు చేశారు.

 ఖానాపూర్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సై మల్లేష్‌ జ్ఞాపకార్థం స్తూపాన్ని నిర్మించారు. ఇలా జిల్లా హెడ్‌క్వార్టర్స్‌లో ఏ భవన నిర్మాణం చేపట్టినా వాటికి అమరుల పేర్లను పెట్టి వారిని స్మరించుకుంటున్నారు.