Abn logo
Sep 17 2021 @ 00:21AM

తెలంగాణ ఏర్పాటులోనూ ‘విమోచన’ పాత్ర

సెప్టెంబర్‌ 17ను విమోచనదినంగా ప్రకటించి అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలి. ఈ డిమాండ్‌లో అమోఘమైన చరిత్ర నిక్షిప్తమై ఉంది. ఎంతోమంది బలిదానాల ఫలితంగా, హైదరాబాద్‌ సంస్థాన ప్రజల మనోభావాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం తరఫున 1948 సెప్టెంబర్ 17న భారత సైనిక దళాలు బొల్లారంలో అధికారికంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాయి. ఆనాడు ఇక్కడ ప్రజా ప్రభుత్వం లేదు. భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన తరువాత, తెలంగాణలో తొలి ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ పిదప కూడా సెప్టెంబర్ 17ను ‘విమోచన దినం’గా గుర్తించకపోవడం ఒక చారిత్రక తప్పిదం. 


బొల్లారంలో త్రివర్ణ పతాకం ఎగురవేసి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా 1998 సెప్టెంబర్‌ 17న నిజాం కాలేజ్‌ గ్రౌండ్స్‌లో ఎల్‌కె ఆడ్వాణీ వందలాది స్వాతంత్య్ర సమరయోధులకు స్వయంగా సన్మానం చేశారు. నిజాం పైన బాంబు వేసినందుకు ఉరిశిక్ష విధించబడ్డ పవార్‌, వందేమాతరం రామ్‌చందర్‌రావుతో పాటు వందమందికి పైగా సమరయోధులను ఆడ్వాణీ సత్కరించారు. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇది మతపరమైన అంశం అనడానికి ఆస్కారం లేదు. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని కోరిన జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ తన పత్రిక ‘ఇమ్రోజ్’ లో ఒక వ్యాసం రాశారు. భారతదేశం శరీరం అయితే హైదరాబాద్‌ సంస్థానం గుండె లాంటిదని, గుండె వేరుగా ఉండడానికి వీలులేదని వెంటనే విలీనం కావాలని ఆయన ఆ వ్యాసంలో పేర్కొన్నారు. ఇలా ఉదాత్తంగా విశాల భావం చూపినందుకే షోయబుల్లా ఖాన్ దారుణంగా హత్యకు గురయ్యారు. గణేష్‌ శంకర్‌ విద్యార్థి అనే యువ పాత్రికేయుడు కూడా 1932లో లక్నోలో ఈ విధంగానే హత్యకు గురయ్యాడు. ఈ దేశంలో మత సామరస్యం కోసం ప్రాణాలిచ్చిన జర్నలిస్టులు వీరిద్దరే. 


అసలు బొల్లారంలో భారతప్రభుత్వం తరఫున త్రివర్ణ పతాకాన్ని ఎగరేయడం, నిజాం తలవొంచి నేను లొంగిపోతున్నాను అని విధిలేక చెప్పిన ఫలితంగానే జరిగింది. ఇది ఎవరిపైన సాధించిన విజయమో అందరికీ తెలుసు. కానీ కొందరు అర్థంకానట్టు నటిస్తున్నారు. అసలు నిజాంను, రాజప్రముఖ్‌గా ఎందుకు చేశారని కొందరు ప్రశ్నిస్తారు. కాశీం రజ్వీకి ఎందుకు ఉరిశిక్ష విధించలేదు? లాయక్ అలీని ఎందుకు పాకిస్థాన్‌కు పోనిచ్చారు? ఇది ద్వంద్వనీతి కాదా అని గోస పడేవారు చాలా మంది ఉన్నారు. దేశంలో అప్పుడున్న పరిస్థితులలో ప్రజాస్వామ్యాన్ని, మత సామరస్యాన్ని శాంతియుతంగా సమన్వయంగా ముందుకు తీసుకుపోవాలనుకున్నారు. అందుకే ఒకవైపు దౌత్యచర్చలు, మరోవైపు కఠినచర్యలు అనే సమాంతర కార్యక్రమాలను కొనసాగించారు. అయితే రజాకార్లు వందలాది ప్రజలను కిరాతకంగా చంపడం, తబ్లిక్‌ పేరిట మతమార్పిడిలు యుద్ధ ప్రాతిపదికన జరిపించడం, గ్రామాలను దోచుకోవడం, పాకిస్థాన్‌తో దోస్తీ చేసి కోట్ల రూపాయలు ఇవ్వడం, సిడ్నీ కాటన్ అనే స్మగ్లర్‌ను ఉపయోగించుకుని ఆయుధాలను తెప్పించుకుని హైదరాబాద్‌ రాష్ట్రంలో మారణహోమాన్ని సృష్టించాలనుకోవడం మొదలైనవి హైదరాబాద్ సంస్థానంపై ‘పోలీస్‌ యాక్షన్’కు దారితీసిన ప్రధాన కారణాలు. ఈ చర్య తీసుకోవడంలో చాలా ఆలస్యమైందనేది నిర్వివాదం.


ప్రత్యేక తెలంగాణ ఏర్పాటులో సెప్టెంబర్‌ 17 అంశం తనదైన పాత్ర పోషించింది. తెలంగాణ గుండె చప్పుడు విన్న శ్రీమతి సుష్మాస్వరాజ్‌ అప్పటి భారత రాష్ట్రపతికి ఒక మెమొరాండం ఇచ్చారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించమని కోరారు. 1998లో నిర్వహించిన విమోచన స్వర్ణోత్సవాలకు కర్ణాటక, మరాఠ్వాడా నాయకులను కూడా ఆహ్వానించాం. ఆ తరువాతనే మహారాష్ట్ర, కర్ణాటకలో సెప్టెంబర్ 17న అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆ రోజు ప్రతి ఇంటి మీద త్రివర్ణపతాకం ఎగురవేసి ఒక పండుగలాంటి వాతావరణాన్ని కల్పించుకుంటున్నారు. ఆగస్టు 15, జనవరి 26న ప్రభుత్వ కార్యక్రమాలు ఏవిధంగానైతే జరుగుతాయో, అదేవిధంగా సెప్టెంబర్‌ 17న విముక్తిదినాన్ని గొప్పగా జరుపుకుంటున్నారు. తెలంగాణలో జరగడం లేదంటే అది హాస్యాస్పదమే కాకుండా రాజ్యాంగవిరుద్ధం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో దీనికి పరిష్కారం లభిస్తుంది. భారత స్వాతంత్య్ర అమృతోత్సవాలతో పాటు సెప్టెంబర్‌ 17 విమోచనదినాన్ని కూడా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో జరపాల్సిన అవసరం ఉంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 మాసాల రెండు రోజుల తర్వాతే తెలంగాణ ప్రజలు మువ్వన్నెల జెండా ఎగురవేశారని ఈ తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.


సరే, నేడు నిర్మల్‌లో జరిగే సభ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. గిరిజనుల కోసం, విదేశీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన ‘రామ్‌జీ గోండు’ స్మారకాన్ని దర్శించుకుని కేంద్ర హోం మంత్రి అమిత్ షా బహిరంగసభలో పాల్గొంటారు. రామ్‌జీ వీరోచిత పోరాటం మరొక్కసారి తెరమీదకు రాబోతోంది. బ్రిటిష్‌ వారిని ఎదిరించి భారతమాతను బంధవిముక్తి చేయాలని దేశవ్యాప్తంగా జరిగిన పోరాటంలో భాగంగా రామ్‌జీ గోండు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. దురదృష్టవశాత్తూ చరిత్రలో దానికి సరైన స్థానం దొరకలేదు. నిర్మల్‌ పట్టణంలో జరుగనున్న సభ రామ్‌జీ గోండు గాథను దేశ చరిత్రపుటలలో సుప్రతిష్ఠితం చేస్తుంది. 


రామ్‌జీ గోండు తదితర గిరిజన నాయకుల బలిదానాలను వృథాగా పోనీయకుండా అన్ని రాజకీయ పార్టీలు శషభిషలు లేకుండా గిరిజన సమస్యల పరిష్కారానికి పూనుకోవాలి. ఒక నయాపైసా ఖర్చు లేకుండా ఆదిలాబాద్‌, ఖమ్మం, వరంగల్‌ తదితర జిల్లాల ఆదివాసీలను ఒక్క క్షణంలో రాజ్యాంగబద్ధంగా కోటీశ్వరులను చేయవచ్చు. నిజాం ఆదేశం మేరకు గిరిజన సమస్యల పరిష్కారానికి 1940 దశకంలో కృషి చేసిన మానవ శాస్త్రవేత్త ‘హైమండార్ఫ్’, 1977లో ఉట్నూరు ప్రాంతానికి వచ్చిన సందర్భంగా ‘గతంలో తాము ఇచ్చన సలహాలను పాటించడం లేదని, ఇప్పుడు గిరిజనులు ఇంకా రెట్టింపు దోపిడీకి గురవుతున్నారని’ ఆవేదన వ్యక్తంచేశారు, కంటతడి పెట్టారు. 2005లో గిరిజన సమస్యల పరిష్కారానికి నియమితుడైన ఐఏఎస్ అధికారి గిర్‌గ్లాని లక్షల ఎకరాల గిరిజనుల భూమి అన్యాక్రాంతం అయిందని, ఇంకా అవుతున్నదని తన నివేదికలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం షెడ్యూల్డ్‌ అటవీ ప్రాంతంలో గిరిజనులకు సర్వహక్కులు ఇచ్చింది. అయితే ఆ అడవిబిడ్డల భూమిని లాక్కుని వారిని కొండలు, కోనల వైపు తరిమేస్తున్నారు. శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతుండడంతో రాష్ట్ర గవర్నర్లు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ను ఉపయోగించి ‘ఫారెస్ట్‌ లా’ను సవరించి సాగు చేసుకుంటున్న భూములను క్రమబద్ధీకరణ చేయాల్సిన అవసరం వచ్చింది. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్‌ ప్రకారంగా నోటిఫికేషన్ జారీ చేసి షెడ్యూల్డ్‌ ఏరియాలో రాష్ట్ర, కేంద్ర చట్టాలు అమలుకాకుండా స్థానికుల హక్కులను రక్షించవచ్చని స్పష్టంగా ఉంది. ఆ మేరకు గవర్నర్‌కు స్పష్టంగా అధికారం కల్పించారు. లేకుంటే షెడ్యూల్డ్‌ ఏరియాకు సంబంధించి ఏ చట్టం తెచ్చినా సంవత్సరాల తరబడి అమలుకావడం లేదు. అసలు ఈ సమస్యలన్నీ చిత్తశుద్ధితో త్వరితగతిన ఒక్క కలం పోటుతో క్షణాల మీద పరిష్కరించి, గిరిజనుల అకౌంట్‌లో డబ్బులు వేయకుండానే, వారి భూమిని వారికి ఇప్పించి కోటీశ్వరులను చేయవచ్చు. మళ్లీ రామ్‌జీ గోండు జీవనయానం తెరమీదకు వచ్చిన నేపథ్యంలో గిరిజనులకు భూ హక్కులు కల్పించేందుకు అన్ని రాజకీయ పార్టీలు నిర్మల్ సభను స్ఫూర్తిగా తీసుకుని కృషిచేయాలి. 

సిహెచ్. విద్యాసాగర్ రావు

మహారాష్ట్ర మాజీ గవర్నర్‌